- డేవిడ్ మిల్లర్ ను మనసారా అభినందించిన కొహ్లీ, రోహిత్
- సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనను మించిన మిల్లర్ బ్యాటింగ్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అస్సాంలోని గువాహతిలో బార్సపారా స్టేడియంలో ఆదివారంరాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో మనవాళ్ళు గెలిచినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొల్లగొట్టాడు. పరుగుల కుంభవృష్టిని చూసిన ప్రేక్షకులను మొదట బ్యాట్ చేసిన భారత బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, కె ఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలు అద్భుతంగా ఆడి అజేయమైన స్కోరు సాధించి మెప్పించారు. 237 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా గెలవాలంటే 238 పరుగులు చేయాలి. అది అసాధ్యంగానే చాలా వరకూ కనిపించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బెండా బావుమా ఏడు బంతులలో సున్నా పరుగులకు పెవిలియన్ కు తిరిగి వచ్చారు. మరో ఆటగాడు రిలీ రోస్సౌవ్ రెండు బంతులు ఆడి సున్నా పరుగులతో చక్కా వచ్చాడు. ఇద్దరినీ పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్వింటెన్ డీకాక్ 48 బంతుల్లో 69 పరుగులు చేశాడు. మిల్లర్ మాత్రం 47 బంతుల్లో 106 పరుగులు చేసి అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాను విజయం సరిహద్దులవరకూ తీసుకొని వెళ్ళాడు. 16 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ ల సీరీస్ ను 2-0 స్కోరుతో కైవసం చేసుకున్నది.
కానీ మిల్లర్ ఎంత బాగా ఆడాటంటే భారత బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. సిక్సర్లు వరుసగా బాదేశాడు. అది చూసిన ప్రేక్షకులతో పాటు రంగంలో ఉన్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీలు మిల్లర్ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని మనసారా అభినందించారు.
దక్షిణాఫ్రికాతో సీరీస్ గెలిచినప్పటికీ భారతజట్టు అంత సంతోషంగా లేదు. టీ20 ప్రపంచ కప్ 2022 మరి కొద్ది రోజులలో ప్రారంభం కాబోతున్నది. జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అతడు ప్రపంచ కప్ పోటీలలో పాల్గొనలేడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారంనాడు బౌల్ చేసిన అక్సార్ పటేల్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ లు ఒక ఓవర్ లో 11 కంటే ఎక్కువ పరుగులే ఇచ్చారు. అర్షదీప్ నోబాల్స్, వైడ్ ల రూపంలో చాలా పరుగులు ఇచ్చాడు. ఒక్క దీపక్ చహర్ మాత్రం నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి పొందుపుగా బౌలింగ్ చేశాడు.
ఇది కాదు ఆదివారంనాటి ఆట గురించి చెప్పుకోవలసిన అంశం. ముమ్మాటికీ డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ గురించే చెప్పుకోవాలి. పరమఅద్భుతంగా ఆడాడు. చీటికీ మాటికీ సిక్సులు కొట్టాడు. మనవాళ్ళు ఎంత టైట్ గా బౌలింగ్ చేసినా అతడు అవలీలగా సిక్సుకు లేపేవాడు. మైదానం అంతటా, వికెట్ చుట్టూ ఎటుబడితే అటు సిక్సర్లు కొట్టాడు. అతడి ఆటచూసి అచ్చెరువొందిన కొహ్లీ, రోహిత్ లు పనివేళా మిల్లర్ దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, కౌగలించుకొని మరీ అభినందించారు. ఈ దృశ్యాలను సోమవారంనాడు బీసీసీఐ విడుదల చేసింది. ప్రత్యర్థి బాగా ఆడినప్పుడు మనసారా అభినందించడం కంటే క్రీడాస్ఫూర్తి ఏముంటుంది? ఇందులో మన రోహిత్ కీ, కొహ్లీకీ నూటికి నూరు మార్కులు. వీరి అభినందనలను చిరునవ్వుతో అందుకున్న మిల్లర్ ను సైతం ప్రశంసించాలి.