- పీడకలగా 2014 ఇంగ్లండ్ టూర్
- వరుస వైఫల్యాలతో డిప్రెషన్
విరాట్ కొహ్లీ వందల కోట్లరూపాయల సంపాదన, అందమైన భార్య, పండంటి కూతురు. అయినా ఒంటరితనం ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఏడేళ్ల క్రితం నాటిమాట ఇది. 2014 ఇంగ్లండ్ పర్యటన సమయంలో విరాట్ కొహ్లీ అంతులేని ఒంటరితనాన్ని అనుభవించాడు. తానొక్కిడినే, తనకు ఎవ్వరూలేరన్న భావనతో విలవిలలాడి పోయాడు. ఆ సిరీస్ లో వరుస వైఫల్యాలు 24 సంవత్సరాల కొహ్లీకి అప్పట్లో కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఆనాటి అనుభవాలను విరాట్ ఓ ఇంటర్య్వూ సమయంలో గుర్తు చేసుకొన్నాడు.
వరుస వైఫల్యాలు ఒంటరితనంలో పడవేస్తాయని, విదేశీపర్యటనలు కొన్నిసార్లు అతిపెద్ద పరీక్షగా నిలుస్తాయి, దానికి తోడు వైఫల్యాలు ఎదురైతే అది అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని, ఆ సమయంలోనే ఎవ్వరూలేరన్న భావన వెలికివస్తుందని, ఆ ఒంటరితనం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటం ద్వారా భయపెడుతుందని అదే పరిస్థితి తనకూ ఎదురయ్యిందని, ఏ ఆటగాడూ దీనికి మినహాయింపు కాదని కొహ్లీ గుర్తు చేశాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ల జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు వైఫల్యాల పరీక్ష తప్పదని చెప్పాడు. 2014 సిరీస్ లో కొహ్లీ 1, 8, 25, 0, 39, 28, 0,7, 6 స్కోర్లు మాత్రమే సాధించాడు. మొత్తం ఐదుటెస్టుల సిరీస్ లోని 10 ఇన్నింగ్స్ల్ లో 13.40 సగటు మాత్రమే సాధించడం విరాట్ ను కృంగదీసింది.
Also Read: వినుము వినుము విరాట్ డకౌట్ల గాథ!
ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో తనకు అంతుపట్టలేదని, ఆ తర్వాత జరిగిన ఆస్ట్ర్రేలియా టూర్ లో 692 పరుగులు సాధించడం ద్వారా తిరిగి గాడిలో పడ్డానని తెలిపాడు. క్రికెటర్ల జీవితాలలో విజయాలు, వైఫల్యాలు వెలుగునీడల్లాంటివని, క్రీజులో మాత్రమే కాదనీ, జీవితంలోనూ బ్యాలెన్స్ ప్రధానమని కొహ్లీ చెప్పాడు. ఒంటరితనం ఆత్మవిశ్వాసాన్ని కబళించే సమయంలో తోడుగా ఎవరో ఒకరు ఉండితీరాలని, సలహాలు,సూచనలు, మంచిమాటలతో ఆత్మవిశ్వాసం పాదుకొలిపేవారి అవసరం ఎంతో ఉంటుందని తెలిపాడు. ఇలాంటి తరుణంలో మానసిక నిపుణులు, వైద్యుల మార్గదర్శనం కీలకమని అన్నాడు.
Also Read: విరాట్ కొహ్లీకి ఏమయ్యింది…?
నాన్నే నాకు నిత్యస్ఫూర్తి- విరాట్:
1990 దశకంలోని భారత క్రికెట్ ను, హీరోలను చూసి తాను స్ఫూర్తిపొందానని, తన దృక్పథం మారిపోయిందని, అంకితభావంతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీలేదని తనకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చిందని వివరించాడు. 18 ఏళ్ల వయసులో తనపైన నాన్న ప్రేమ్ చంద్ ప్రభావం బాగా ఉండేదని, తనకు అత్యుత్తమ క్రికెట్ శిక్షణ, సదుపాయాలు కల్పించడానికి తొలిరోజుల్లో తనతండ్రి పడిన పాట్లు అన్నీఇన్నీ కావని కొహ్లీ గుర్తుచేసుకొన్నాడు. తనతండ్రి పట్టుదల, అంకితభావమే తనను ఇంతవాణ్ని చేశాయని కొహ్లీ గర్వంగా చెప్పుకొన్నాడు. తన తండ్రి లేకపోయినా ఆయన స్ఫూర్తి, ప్రేరణతోనే తాను ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నట్లు కొహ్లీ పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఫీల్డ్ లో ఎంత దూకుడుగా ఉంటానో, నిజజీవితంలోనూ అంతేనని, తనకు నచ్చినట్లే సహజసిద్ధంగా ఉంటానని, జనాన్ని, ఎదుటవారిని మెప్పించడం కోసం బ్రతకనని కొహ్లీ తేల్చి చెప్పాడు. భారీఅంచనాలు ఏదో తెలియని ఒత్తిడిని పెంచుతాయని, వాటి గురించి ఆలోచించిన కొద్దీ ఒత్తిడి పెరిగిపోతుందని తెలిపాడు.
Also Read: సౌరవ్ సరసన విరాట్