జయప్రభ
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం
అన్నీ వాస్తవాలనే ప్రతిబింబిస్తుంది
శరసంధానం చేయకుండా
శస్త్రప్రయోగం చేయకుండా
అణువణువూ
శరీరాన్ని తెరిచి చూపించినట్టుగా వుంటుంది
అవిరామంగా పగలూ రాత్రీ కూడా
పహారా కాస్తున్నంత జాగ్రత్త చూపిస్తుంది
అదేమిటో …
శ్రమతప్ప .. కల్పన అంటే దానికి పడదు
రసవిహీనత దాని ప్రత్యేకత!
అయితే నాకొచ్చిన సమస్య ఏమిటనా?
అబ్బో దానితో నా సమస్య బహుక్లిష్ట మైనది
ఎందుకంటే –
దాన్ని చదివితే .. . బతుకు
అంతా తెలిసిపోతుంది
చివరికి… భయసందేహమంతా నిజమే అయిపోతుంది
మబ్బులాంటి మరుపన్నది నా దరికి రాకుండా
నాకు స్పష్టత తప్పనిదైపోతుంది
బతుకులోని అన్నిరంగులూ అందులోంచి కలిసి కలిసి
ఆఖరుగా నాముందు అంతా తెలుపైపోతుంది!
రవ్వంత మొహం చాటు చేసుకుందామనుకున్నా..
మొహమాట పడకుండా అది నన్ను వెంబడించి వస్తుంది
ఇంక “నేను” అన్నది మిగలక నా
ముందు అంతా సమాజమే అయిపోతుంది.
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం … ముహూర్తమాత్రం
భ్రమకి తావివ్వదు!
మాయ అంటే దానికి పడదు
రంగుల కలలని అది దాపుకే రానివ్వదు
కాస్తంతగానైనా నాలో తెలియనితనాన్ని మిగల్చదు
ఆయన అక్షరం ఆద్యంతమూ గడుసు
అయితే నాకొచ్చిన ఇబ్బంది ఏమిటనా ?
అబ్బో దానితో నాకు ఎంతో ఇబ్బంది
కొంత అమాయకత్వం కావాలి నాకు
కొంత రహస్యానికి చోటుండాలి నాకు
అన్నివర్ణాల అసలు వర్ణం తెలుపే అయినా
సప్తవర్ణ సదృశంగా దృశ్యాల్ని చూడగలగాలి నేను
శాస్త్రమో … సిధ్ధాంతమో… ఒప్పకపోనీగాక –
సంగీతంలో సైతం కాస్త వివర్ణం చెవికి ఇంపు నాకు
అజాగ్రత్తలో కూడా అందం ఉంటుందే…
ఆ అనుభవం కావాలి నాకు
వాస్తవాలనే చెప్పదలుచుకున్నా
మర్మమూ… మరీచికం… మాయలతో
చెలిమి కొనసాగాలి నాకు
ఓటమిలోని గెలుపునీ … గెలుపులోని ఓటమినీ
చూడగలగాలి నేను!
కానీ…
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం
మర్మాన్ని ఒప్పుకోదు
మమతానురాగాన్ని నమ్మినట్టుండదు
అది – యదార్ధానికి ఊపిరందనంత సన్నిహితంగా వుంటుంది
కల్పన కోసం మారామ్చేసే నా కొంటె బుద్ధిని
గదమాయిస్తూ …
కధకీ కధకీ మధ్య నన్ను కదలనివ్వక
నాకో గోడకుర్చీ శిక్షలా వుంటుంది
దాన్ని చదివి మరిచిపోదాం అనుకుంటే కుదరదు
నా ఆలోచనలన్నింటినీ
నిలువునా నగ్నం చేస్తూ
మరీ అన్యాయంగా నా కలల్ని కూడా ఆక్రమించి
కొడవటిగంటి కుటుంబరావు అక్షరం
నా నిద్రలో కూడా
నిరంతరంగా నిజాల్నే చూపిస్తుంది
—–0——–
[క్షణక్షణ ప్రయాణం కవితాసంకలనం నించి . పేజీ 66-68]