గోదా గోవింద గీతం తిరుప్పావై 10
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
తెలుగు భావార్థ గీతిక
నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా
తలుపు తెరవకున్నపోనిమ్ము పలుకైన పలుకవేమి
కిరీటి, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు
పల్లాండు పాడిన పరవశించు పరమానందమూర్తి
పఱై నిచ్చి పర తత్త్వజ్ఞానమ్ముకూడా బోధించువాడు
రామబాణహతుడు కుంభకర్ణుడు నిద్రలో నీచేత ఓడెనా
నారీ రత్నమా మత్తులో తొట్రుపడక నెమ్మదిగ
గడియ తీయరమ్ము, నోము కై మా తోడ కలిసి రమ్ము.
నేపథ్యం
గోపికలంతా శ్రీకృష్ణుడికి దూరమై విరహంలో నిద్రలేకుండా ఉండి, ఆయనను కలియడం కోసం వ్రతం చేస్తూ ఉంటే ఒక పదిమంది గోపికలు మాత్రం నిద్రిస్తున్నారట. ఆ విధంగా నిద్రిస్తున్నమరో గోపికను మేలుకొలపడం ఈ రోజు గోదాదేవి కార్యక్రమం. వారు నిజంగా నిద్రిస్తున్నారా అంటే కాదట. ఆమె శ్రీకృష్ణుడిని తలచుకుంటూ కళ్లుమూసుకున్నవారే వారంతా. అది శ్రీ కృష్ణానుభవం, అది శ్రీ కృష్ణ సంశ్లేషం, అదే వారికి స్నానం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. ఈ పాశురంలో జ్ఞానదీపం వెలిగించిన తొలి ముగ్గురు ఆళ్వార్లలో ఒకరయిన పేయాళ్వారులను మేల్కొలుపుతున్నారు. భగవంతుడిని పొందాలంటే మనం ప్రయత్నం చేయాలని ఒక వాదం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మ, జ్ఞానం, భక్తి ద్వారా, అవతార రహస్య జ్ఞానం (నాలుగో అధ్యాయం) తెలుసుకోవడం ద్వారా, పురుషోత్తముడి స్వరూపం (15వ అధ్యాయం) ఎరిగి భజించుట ద్వారాభగవంతుడిని పొందవచ్చునని చెప్పినా చివరకు తానే ఉపాయమని సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకం ద్వారా ప్రకటిస్తాడు. ఈ పదిమంది పరమాత్మయే ఉపాయమని నమ్మినవారు. మిగిలి వారు స్వప్రయత్నాల ద్వారా అంటే వ్రతాలు, నామస్మరణ, సత్కర్మ వంటి ఉపాయలద్వారా భగవంతుడిని చేరాలని అనుకుంటున్నారు. శ్రీకృష్ణుని సంశ్లేషంలో ఉండి నిద్రిస్తున్నట్టు కనిపించే ఈ పదిమంది సిద్ధోపాయ నిష్టులు వెంట ఉంటే తమకు భగవత్ ప్రాప్తి సులువని గోదాదేవి వారిని వెంటతీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడి దయతలచి స్వయంగా ఉపాయమైన ఆళ్వార్లతో ఈ గోపికలను పోలుస్తూ లేదా వారికి ప్రతీకలుగా భావిస్తూ ఆరో పాశురం నుంచి పదో పాశురందాకా అయిదుగురిని నిద్రలేపారు గోదాదేవి.
Also read: కృష్ణస్పర్శస్వర్గాన తేలుతున్నావా?
శ్రీవైష్ణవంలోని 12 మంది ఆళ్వార్లలో మొదటి ముగ్గురు, పొయ్ గై ఆళ్వార్, పూదత్తాళ్వార్ పేయాళ్వార్. ఈ రోజు గురువాక్య పరంపరలో శ్రీపరాంకుశ దాసాయ నమః మంత్రాన్ని అనుసంధానం చేసారు గోదాదేవి. అందరూ ఒకటే అనీ, భూమిమీద నివసించే వారంతా కలిసి ఉండాలని, మంచి తనం పెంపొందించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, అందరూ భగవద్గుణాభవాన్ని పొందాలని గోదాదేవి అభిలషిస్తూ ఈ వ్రతాన్ని రూపొందించారు.
అర్థం
నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ = స్వర్గాన్ని ప్రవేశిస్తున్నంత సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి = పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలచే అలంకృత కిరీటముగల, నారాయణన్=నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనచేత, పోట్ర=పల్లాండును,పాడించి, ప్పఱైతరుమ్ = మనకు ప్రాయమైన కైంకర్యాన్ని పఱైని అనుగ్రహించే వాడు, పుణ్డియనాల్= పుణ్యస్వరూపుడైన శ్రీమహావిష్ణువుచే, పండు ఒరునాళ్ = ముందొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద = యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్, కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమైన నిద్రను కలిగిన దానా, అరుంగలమే =దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలిచుకొని వచ్చి, తిఱ=తలుపు తీయి.
Also read: నవరత్నభవనం అంటే నవద్వార శరీరమే
సారాంశం
నిన్నటి పాశురంలో గోపికను మామకూతురా అని పిలిచిన గోద ఈరోజు మరొక గోపికను అమ్మనాయ్ (అమ్మా) అంటున్నారు. నోముతో పనేమిటన్నట్టు హాయిగా నిద్రిస్తున్న అమ్మా, వాకిలి తలుపు తీయకపోతే పోనీ కనీసం మాటైనా మాట్లాడకూడదా, కిరీటంలో తులసిమాలను ధరించి నారాయణ దివ్యనామంతో భాసిల్లేవాడు, మనకు పల్లాండు పాడే అవకాశం కల్పించి మనకు పఱైని లేదా పరాన్ని అనుగ్రహించేవాడు ధర్మం మూర్తీభవించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు, అతని చేతిలో పడి యముని జేరిన కుంభకర్ణుడు అంతకు ముందే నీతో ఓడిపోయి తన గాఢనిద్రను నీకు ఇచ్చాడా ఏమి? సొగసుగా నిదురించే దానా, దొరకని ఆభరణమా, నిద్రమత్తువదిలించుకుని తలుపు తెరువమ్మా.
వివరణ
శ్రీకృష్ణుడిని చేరి ఆయన ఇస్తానన్న వ్రత పరికరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తున్నది గోద. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అని తెలిసి జ్ఞానంతో కూడిన భక్తి కలిగిన ఈమెఇంటికి చేరుకుని సుప్రభాతం పాడి తమతో రమ్మంటున్నారు. ఆమె కోసం కృష్ణుడు వస్తాడు కనుక ఆమె తమ వెంట ఉండాలని కోరుకుంటున్నారు గోదమ్మ.
Also read: అహంకార, కామ క్రోధాలే రాక్షసులు
గోద: నోట్రు అమ్మానాయ్ ..ఏవమ్మా మాతో చేరి నోము నోచుదామని చెప్పి, నీవు ముందే వ్రతం ముగించి శ్రీ కృష్ణానుభవమనే స్వర్గాన్ని అనుభవిస్తున్నావా. నీతో కలిసి జీవించడమే స్వర్గం, విడిచి ఉండడమే నరకం అని రాముని గురించి చెప్పింది. గోపికలకు కూడా స్వర్గమంటే శ్రీకృష్ణానుభవమే. ఆ అనుభవంలో లీనమైన వారికి స్వర్గం లెక్కలోకి రాదు. వీళ్ల దృష్టిలో వ్రతమంటే శ్రీ కృష్ణుడే తమకు ఉపాయమనుకుని ఎదమీద చేయి వేసుకుని హాయిగా నిదురించడమే. ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. “తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః ” ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు (త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వివరణ) భగవంతుడి నిజస్వరూపం తెలుసుకున్నారంటే అన్ని నోములూ నోచుకున్నట్టే.
Also read: లేవమ్మా గోపికా, గోవిందుని సేవిద్దాం రావమ్మా
గోద: అమ్మనాయ్, నీవు మా అందరికీ నాయికగా ఉండడం అందంగా ఉంది. రక్ష్యారక్షక భావాన్ని నిరాకరించకు తల్లీ, మేం మాత్రం వదలము’’ అన్నారు.
గోపిక: (ఈమాటలు విన్న గోపిక ఆనందాతిశయంతో మౌనంగా ఉందట, మరో అర్థం. ‘‘వీరికి చెలికత్తెను నేను, నన్ను అమ్మనాయ్ అంటున్నారు’’, అని కూడా మౌనంగా ఉందట.
గోద: ‘‘తలుపు తెరవకపోయినా బదులైనా ఇవ్వవా’’ అని బయటనుంచి అడిగారు.
మాట్రముమ్ తిఱవాదార్= ‘‘తలుపు మూస్తే మాట కూడా మూయాలా? కళ్లకు కష్టం ఇచ్చినట్టు, చెవులకు కూడానా? మీరు సుఖానుభవంలో ఉంటే మా గురించి చింతించరా ఏమి? శ్రీకృష్ణునికి సర్వం సమర్పించినప్పుడు మాకు కనీసం మాటలు వినే భాగ్యమైనా కలిగించవా తల్లీ’’.
‘‘మాట్రముమ్ తారారో… విచ్చేయండని స్వాగతం చెప్పాలనేం లేదు. చెప్పండి అని ఓమాటన్నా చాలు. లేదా కోపంగానైనా ఒక మాట చెప్పండి’’. అని గోపికలు అడిగారు.లోపలి గోపిక: ‘‘శ్రీకృష్ణుడికి సర్వం సమర్పించినానని అంటున్నారే, శ్రీకృష్ణుడైమైనా ఇక్కడున్నాడా?’’ఆనందరూపుడైన వాడు కృష్ణస్వామి, ఆయనే ఆనందము కూర్చేవాడు, ఆయనను తలుచుకుంటూఆనంద స్థితిలో ఉన్నందున గోపిక బదులు పలకలేదట. బయటవారేమో శ్రీ కృష్ణుడు లోపల ఈమెతో ఉన్నాడనీ అందుకే బయటకు రావడం లేదని అనుకుంటున్నారట.
గోద, బయటి గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడి.. నీవు దాచాలన్నా శ్రీకృష్ణుడి కిరీటం చుట్టిన తులసీ మాల సుగంధాలు వెదజల్లుతున్నాయి కదా. నీవలెబహిర్గతం కాని తత్త్వమా ఆయనది’’. తులసి అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి. తులసి విష్ణుపత్ని. తులసీ వనములు ఉన్నచోట శ్రీ హరి తప్పక ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తులసీ పరిమళం ఉంటుంది.
Also read: గోదా గోవింద గీతం – తిరుప్పావై 7
లోపలి గోపిక: ‘‘శ్రీ కృష్ణుడు ఇదివరకొకసారి నన్ను కౌగిలించుకున్నప్పుడు అంటిన తులసి వాసనల సౌరభం అది. తులసీదామ భూషణుడి వాసన చూసి ఆయన లోపల ఉన్నాడనడం సరికాదు. అదీగాక నిన్న సాయంత్రం నుంచి అక్కడే మీరు కాపలా ఉన్నట్టున్నారు. మీకు తెలియకుండా శ్రీకృష్ణుడు లోనికెలా వస్తాడుచెప్పండి’’. అది తులసీ దళ పరిమళమే కాని తులసీ ప్రియుడైన శ్రీ కృష్ణుడు ఇక్కడ లేడు.
బయటి గోపికలు: ‘‘నారాయణన్..సకల చేతన అచేతన వస్తుజీవములలో లోన పైన వ్యాపించియున్న నారాయణునికి తలుపులు అడ్డమా? సర్వవ్యాపి కనుకఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలడు. నమ్మాల్ పోత్తప్పఱై తరుం….దేవతలకే అందని ఆ కృష్ణ స్వామి మనవంటి సామాన్యులందరికీ సులభంగా అదేవాడు. పుణ్నియనాల్… పుణ్యాన్ని ఉదారంగా అందరికీ ఇచ్చేవాడు కదా నీ ఒక్క దాని దగ్గరే పెట్టుకోవడం సబబా?
బయట గోపికలు: ‘‘నాట్రత్తుఝాయ్ ముడినారాయణన్ = ‘‘పరిమళ భరిత తులసీమాలాధరుడైన వాడు నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు ఆ వాసన జన్మజన్మాలకూ వీడదు కదా’’.
లోపలి గోపిక మాట్లాడలేదు. మనం జవాబులు ఇస్తూ ఉంటే ‘ప్రతిదానికీ జవాబిస్తూ ఉందే’ అనుకుంటుందని మాట్లాడడం లేదేమో.
బయటి గోపిక: పండొరునాళ్ ఇదివరకు ఒకనాడు కూత్తత్తిన్ వాయ్వాళంద కుమ్బకరణనుం….. కుంభ కరణుడు మృత్యువునోట్లో దూరాడు. అందరినీ రక్షించే రాముడుకుంభకరణుడిని ఎందుకు చంపుతాడు. ఆయనే నడిచి వచ్చి రాముని తో యుద్ధానికి దిగి దీపకాంతికోసం వచ్చి ఆహుతైన కీటకం వలె మృత్యు ముఖంలో తలదూర్చాడు.తొత్తు ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో… ఎంత చెప్పినా నిద్రలేవడం లేదంటేఆ కుంభకర్ణుడు మరణిస్తూ తన నిద్రను నీకిచ్చాడా ఏమి?’’ అని వ్యంగ్యంగా పలుకుతారు గోద. ఇదే మాట అగస్త్యుడి ప్రస్తావనకు కూడా సరిపోతుంది. దివ్యజ్ఞాని అగస్త్యునితో లోపలి గోపికను పోలుస్తూ మాట్లాడతారు వారు.అగస్త్యుడు కూడా ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా ఏమి అని అంటుంది.గోదమ్మ చరణాలే శరణు
Also read: గుఱ్ఱం నోట్లో చేతిని ఉబ్బించి కేశిని చంపిన కేశవుడు