ఆకాశంలో దారి తప్పి అటూ ఇటూ తిరుగుతున్న
గాలిపటం… నేను చూస్తూ ఉండిపోయాను.
తెగిన దారం నా పిడికిటి లో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
కొండ వాలులో దొర్లిపోతున్న చేజారిన నూలు ఉండ ..
ఆపడానికి నేను ప్రయత్నం చేయలేదు.
వేగంగా జారిపోతున్న కుదురు నుండి
రంగు రంగుల దారం…
గుర్తుకొస్తున్న భిన్నానుభూతుల జ్ఞాపకాలలా,
పెదవులపై తీపు, చేదు కలిసిన చిత్రమైన రుచి…
కళ్ళల్లో నీళ్లు నిండాయి.
నభోనీలిమలో మునిగి తేలుతున్న పతంగం
ఇప్పుడు మసక మసకగా కనిపిస్తోంది.
కాలచక్రం లా కుదురు ఆగకుండా దొర్లిపోతూనే ఉంది…
దారం కూడా చివరికి వచ్చేసింది…
ఇంకోక్కసారి ఆకాశం వైపుకు చూసాను.
గాలిపటం ఇంకా నా దృష్టి సీమ లోనే ఉంది.
క్రూరమైన గాలులు తనను తోసేస్తూ ఉంటే,
గాలిలోని తేమతో బరువెక్కుతోంది
ఆ స్వేచ్ఛను కోరుకొన్న కాగితం పక్షి…
ఈ స్వేచ్ఛ ఆమెను ఎక్కడికి చేరుస్తుంది?
తప్పిపోయిన గాలిపటం
దారితెలుసుకొని తిరిగివస్తుందా…
తిరిగి తన దారం తో ముడివేసుకొంటుందా?
ఇంక చాలు పదమని కాళ్ళు తొందర పెట్టాయి…
కాసేపు, ఇంకాసేపు వేచి చూడలేవా అని మనసు గుసగుసలాడింది.
ఒక ప్రతిష్టంభన… ఒక అనిశ్చిత స్థితి…
ఆ జీవితాచల శిఖరాన, విసురుగా ముఖాన్ని తాకుతున్న
పెనుగాలుల మధ్యన ఒంటరిగా
నానుంచి విడిపోయిన నాదానికోసం,
వేచిచూస్తూ… నేనూ ఒక తెగిన గాలిపటం లా…
Also read: పంది కొక్కులు
Also read: చరిత్రకారుడు
Also read: యుద్ధం
Also read: ఎవ్వడు వాడు
Also read: తమ్ముడు