పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీని అకస్మాత్తుగా బదిలీ చేశారు. కిరణ్ బేదీ పుదుచ్ఛేరి గవర్నర్ గా ఉండజాలరనీ, ఆ పదవిని తెలంగాణ గవర్నర్ తమిలిసై అదనంగా నిర్వహిస్తారనీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినాయి. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ జనరల్ కిరణ్ బేదీకీ, ముఖ్యమంత్రి సి. నారాయణస్వామికీ మధ్య విద్వేషపూరితమైన, ఆగ్రహంతో కూడిన సందేశాల యుద్ధం కొంతకాలంగా నడుస్తోంది. సోమవారం పుదుచ్ఛేరి బంద్ పాటించాలని అధికార కూటమి ప్రజలకు పిలుపు నిచ్చింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల రాష్ట్రపతి కొవిద్ ను కలుసుకొని బేదీకి బదిలీ చేయాలని అభ్యర్థిస్తూ ఒక వినతి పత్రం సమర్పించుకున్నారు. గవర్నర్ రాష్ట్రంలో ‘తుగ్లక్ దర్బార్’ నడుపుతున్నారని ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు.
Also Read : ప్రమాదం అంచున పుదుచ్చేరి ప్రభుత్వం
కిరణ్ బేదీ దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య ట్వీట్ల పోరాటం సాగుతున్న దశలో గవర్నర్ ను తిరిగి పిలిపించాలని రాష్ట్రపతి కార్యాలయం నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుదుచ్ఛేరికి రావడానికి ఒక రోజు ముందే లెఫ్టినెంట్ గవర్నర్ పైన వేటు వేయడం గమనించవలసిన అంశం. పుదుచ్ఛేరి శాసనసభలో మొత్తం 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పక్షాన ఇప్పడు 14మంది మాత్రమే ఉన్నారనీ, నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందనీ, నారాయణస్వామి రాజీనామా చేయాలనీ ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. కిరణ్ బేదీని కొన్ని వారాల అనంతరం దిల్లీ గవర్నర్ జనరల్ గా నియమించే అవకాశం ఉన్నదని భోగట్టా.
Also Read : అద్వితీయ ముఖ్యమంత్రి