రామాయణమ్ – 69
జగదేకవీరుడు రాముడు అంత స్వల్పకాలములో పద్నాలుగువేలమంది మహాబలవంతులైన రాక్షసులను సంహరించటము చూసిన ఋషులు, మునులు, దేవతలు ఆయనను సమీపించి అభినందనలతో ముంచెత్తారు.
అప్పుడు వారొక రహస్యాన్ని విప్పి చెప్పారు. ‘‘రామా, నీవు శరభంగ మహాముని ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు మునితో ఎదో మాట్లాడుతూ కనపడ్డాడు కదా, ఆ విషయము ఏమిటనుకున్నావు? నిన్ను ఈ ప్రాంతానికి ఎదో విధముగా పంపితే ఎప్పటినుండో జనస్థానములో తిష్ఠ వేసుకున్న రాక్షసులను ఏరిపారేస్తావని తెలిపాడు.
Also read: ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు
‘‘ఉపాయముతో నిన్ను ఇక్కడకు పంపమన్నాడు. ఆవిధముగానే నీవు ఇక్కడ నివసించేటట్లు మేము ఆలోచన చేసి నిన్ను పంపాము. ఇప్పుడు జనస్థానములో ఒక్క రాక్షసుడుకూడా మచ్చుకైనా లేడు. ఇక మేము నిశ్చింతగా, సుఖముగా ఈ ప్రాంతములో సంచరించగలము’’ అని కృతజ్ఞతాపూర్వకముగా పలికి వచ్చిన దారినే తిరిగి వెళ్ళారు.
యుద్ధపరిసమాప్తిని కాంచిన లక్ష్మణుడు వదినగారిని తీసుకుని గుహనుండి బయటకు వచ్చాడు.
అన్నగారి పరాక్రమము ఆయనకు తెలియనిది కాదు. ఆయన చేసిన ఘన కార్యానికి అభినందనలు తెలిపాడు లక్ష్మణుడు.
లోకకంటకులైన రాక్షసులను ఒంటిచేత్తో మట్టికరిపించి సింహములాగా నిలుచున్న వీరాధివీరుడైన భర్తను చూడగానే సీతమ్మ హృదయము ఉప్పొంగి కౌగలించుకొన్నది. ఏ మాత్రము అలసటలేని భర్తను చూసుకుంటూ మురిసిపోతూ మరలమరల ఆలింగనము చేసుకొన్నది వైదేహి.
Also read: పెద్ద సేనతో రాముడిపై యుద్ధానికి బయలుదేరిన ఖరుడు
ఒక్కడు మిగిలాడు. పదునాలుగు వేలమందిలో ఒక్కడు తప్పించుకొన్నాడు. వాడి పేరు అకంపనుడు. ఆ విధ్వంసాన్ని కన్నులారా చూసిన వాడి కాళ్ళు తడబడుతున్నాయి. గుండెలలో దడ మొదలయ్యింది ఏదో విధముగా గుండె చిక్కబట్టుకున్నాడు వాడు. వేగముగా లంకకు బయలుదేరాడు.
వెళ్ళి వెళ్ళి రావణుడి ముందు కుప్పకూలాడు. భయంభయంగా చూస్తున్నాడు. వాడి చెవులలో ఇంకా రామకోదండము వెలువరించిన శబ్దమే మారు మ్రోగుతున్నది. వాడి కన్నులలో ఆ కోదండము చేసిన వీరవిహారమే ప్రతిఫలిస్తున్నది.
వాడు రావణుని ముందు నిలబడి, ‘‘ప్రభూ మన రాక్షసులు పదునాలుగువేలమంది హతులైనారు. ఖరుడు కూడా చనిపోయినాడు’’ అని మాత్రమే పలికాడు.
ఈ మాటలు విన్న వెంటనే రావణుడి కళ్ళు కోపముతో అరుణిమను సంతరించుకున్నాయి.
భయముతో కంపించిపోయే అకంపనుడు రావణుడి ముందు నిలుచుని ‘‘ప్రభూ జనస్థానములో మనవారందరూ చంపబడినారు. నేను మాత్రమే ఎలాగో తప్పించుకొని రాగలిగాను’’ అని చెప్పగా విన్న రావణుడు క్రోధముతో ‘‘ఎవడు వాడు? ఎచటివాడు? నాచోటికి వచ్చి నన్నే ఎదిరించినవాడు,వాడికి పోగాలము దాపురించినది. నాకు అపకారము చేసినవాడు ఇంద్రుడైనా, చంద్రుడైనా, విష్ణువైనా, జిష్ణువైనా, యముడైనా సరే సుఖముగా ఉండలేడు. నీకేమీ భయములేదు. అంత సాహసము చేసిన ధూర్తుడెవ్వడో నిర్భయముగా చెప్పు’’ అని కోపోద్రిక్త స్వరముతో పలికాడు.
Also read: శూర్పణఖ ముక్కుచెవులు కోసిన లక్ష్మణుడు
‘‘వాడు రాముడు! సింగపు ఠీవి, వృషభపు మూపు, గుండ్రముగా దీర్ఘముగా ఉండే భుజాలు, చూడటానికి గంభీరముగా ఉంటాడు. వాడు దశరథ కుమారుడట. వాడు దూషణ, త్రిశిర, ఖరులను, మన పదునాలుగువేలమంది సైన్యాన్నీ ఒక్కడే చంపివేశాడు ప్రభూ’’ అని అంటున్నఅకంపనుడి మాటలు విన్న రావణుడు తోకతొక్కిన త్రాచులాగా బుస్సున లేచాడు.
‘‘నేడే వాడి అంతు చూస్తాను’’ అని బయలుదేరాడు. అప్పుడు అడ్డు తగిలిన అకంపనుడు ‘‘ప్రభూ, రాముడిని పరాక్రమముతో జయించడము శక్యము కాని పని. వానిని ఉపాయముచేత వంచించి చంపవలె. అందుకు నాకు ఒక మార్గము తోచుచున్నది. వానికి అందమైన భార్య ఒకతె ఉన్నది. ఆమెది అతి లోక సౌందర్యము. ఆవిడ అతని ప్రాణము. నీవుగానీ ఆవిడను అపహరించి తెచ్చితివా! అది చాలును అతను బలహీనపడటానికి. కృంగి, కృశించి, నశించి పోతాడు.’’
వాడి మాటలు విన్న రావణుడు వెంటనే ప్రశస్తమైన గాడిదలు పూన్చిన రధమెక్కి మారీచాశ్రమానికి బయలుదేరాడు.
రావణుని చూడగానే మారీచుడు ఎదురేగి ఆసనము, ఉదకము ఇచ్చి సత్కరించి,
వచ్చిన పని ఏమిటి అని అడిగాడు.
మారీచుడా, నేను ఒక కార్యము నిమిత్తము నీ వద్దకు వచ్చాను. రాముని భార్యను అపహరించాలి. అందుకు నీ సహాయము కావాలి అన్నాడు.
Also read: శ్రీరామచంద్రుడిపై మనసు పారేసుకున్న శూర్పణఖ
ఆమాట వింటూనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మారీచుడు. ‘‘నీకు ఈ సలహా ఇచ్చిన వెధవ ఎవడు? వాడు నీకు మిత్రుడి రూపములో ఉన్న శత్రువు. సమస్త రాక్షస జాతిని నాశనము చేయాలని వాడు సంకల్పించుకొని నీకు ఈ సలహా ఇచ్చాడు. తక్షకుడి నోటినుండి కోరలు పీకమని నిన్ను ప్రేరేపించిన వాడు ఎవ్వడు. రాముడనే మదగజాన్ని పట్టాలనుకొంటున్నావు. ఆయన నిదురించే సింహము. రాముడు అనే పాతాళలోకములోకి ఎందుకు జారిపడతావు? అందులో ధనుస్సే పెనుమొసలి, ఆయన భుజముల వేగమే బురద, ఆయన శరాలే ఉత్తుంగ తరంగాలు, యుద్ధమే జలప్రవాహము. ఎందుకు నీ అంతట నీవే మునిగిపోవాలనుకుంటున్నావు. నా మాటవిని లంకకు తిరిగి వెళ్ళు. నీ భార్యలతో క్రీడించి సుఖముగా ఉండు. ఎందుకు లేనిపోని తలనొప్పి తెచ్చి పెట్టుకుంటావు?’’ అని హితవు పలికిన మారీచుని మాటలు విని ఆ ప్రయత్నము మానుకొని లంకకు తిరిగి వెళ్ళాడు రావణుడు.
Also read: పంచవటిలో పకడ్బందీగా, సుందరంగా పర్ణశాల నిర్మాణం
వూటుకూరు జానకిరామారావు