- గ్రూప్-బి లీగ్ లో పరాజయాల హ్యాట్రిక్
ప్రపంచ టూర్ బ్యాడ్మింటన్ ఫైనల్స్ గ్రూప్-బీ లీగ్ లోభారత స్టార్ షట్లర్ కిడాంబీ శ్రీకాంత్ పోటీ ముగిసింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో శ్రీకాంత్ వరుసగా మూడో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి ఎనిమిది మంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల మధ్య గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ గా జరుగుతున్న ఈటోర్నీ గ్రూప్-బీ లీగ్ లో 8వ ర్యాంకర్ శ్రీకాంత్ మూడుకు మూడు రౌండ్లూ ఓడి నిరాశకు గురయ్యాడు. హాంకాంగ్ ఆటగాడు కా లాంగ్ యాంగుస్ తో జరిగిన పోరులో శ్రీకాంత్ 21-12,18-21,19-21తో పరాజయం పాలయ్యాడు.
గంటా 5 నిముషాలపాటు సాగిన ఈపోరు తొలిగేమ్ ను 21-12 తో అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్ లో తుదివరకూ పోరాడినా 18-21తో ఓటమి తప్పలేదు. నిర్ణయాత్మక ఆఖరి గేమ్ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. నీకో పాయింటు, నాకో పాయింటు అన్నట్లుగా సమరం తారాస్థాయికి చేరింది. చివరకు శ్రీకాంత్ 19-21తో గేమ్ ను, 1-2తో మ్యాచ్ ను చేజార్చుకోక తప్పలేదు. గ్రూప్ -బీ లీగ్ తొలిరౌండ్ పోరులో డెన్మార్క్ ఆటగాడు యాండర్స్ యాంటోన్ సెన్ చేతిలోనూ, కీలక రెండోరౌండ్లో 12వ ర్యాంక్ ఆటగాడు వాంగ్ జు వీ తో మూడుగేమ్ ల పోరులో పరాజయం పొందాడు.
ఇది చదవండి: సింధు, శ్రీకాంత్ వరుస పరాజయాలు
మహిళల సింగిల్స్ మొదటి రెండు రౌండ్లలోనూ పరాజయాలు పొంది సెమీస్ బెర్త్ చేజార్చుకొన్న సింధు తన గ్రూప్ ఆఖరి రౌండ్ పోటీలో థాయ్ లాండ్ ప్లేయర్ చో చువాంగ్ ను ఢీ కొనాల్సి ఉంది. సింధు, శ్రీకాంత్ ర్యాంకుల ప్రాతిపదికన ప్రపంచ టూర్ ఫైనల్స్ కు అర్హత సాధించినా గ్రూప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు.
కరోనా వైరస్ దెబ్బతో గత ఏడాదిగా బ్యాడ్మింటన్ కార్యకలాపాలు స్తంభించిపోడంతో ఆటకు దూరం కావడం, తగిన మ్యాచ్ ప్రాక్టీసులేక పోడం భారత స్టార్ల ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఇది చదవండి: తొలిపోటీలో పోరాడి ఓడిన సింధు