- శశి థరూర్ ని వినియోగించుకోవడం విజ్ఞత
- అందరినీ కలుపుకొని పోవడం అత్యవసరం
- నిష్క్రమణలకు అడ్డుకట్ట వేయాలి, అందరినీ సంప్రదించాలి
కాంగ్రెస్ చరిత్రలో బుధవారంతో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టాడు. ఆ ఖ్యాతి 80ఏళ్ళ మల్లికార్జున ఖడ్డేకు దక్కింది. కర్ణాటకకు చెందిన దాక్షిణాత్యుడు ఘన చరిత్ర కలిగిన పార్టీలో అగ్రపీఠాన్ని అధిరోహించడం ఒక చారిత్రక సందర్భం. గతంలోనూ మనవాళ్ళకు ఎందరికో ఆ యోగం పట్టింది. ఆ భాగ్యశాలుల సరసన నేడు ఖడ్గే కూర్చో గలిగాడు. తప్పనిసరి పరిస్థితులు, ప్రత్యామ్నాయం లేకపోవడం, రాజకీయ అవసరాల పునాదులపై ఈ చరిత్ర నిర్మాణమైంది. దానికి విధేయత, పరిపక్వత, స్థిరత్వం, అనుభవం, అనుకువ, సమర్ధత జత కలిశాయి.ఈ గుణాలు అర్హతగా కలిగిన మల్లికార్జునుడు కాంగ్రెస్ కు నేడు మాలిక్ అయ్యాడు. పై నుంచి చూస్తే అంతా ప్రజాస్వామ్యయుతంగానే ఉంది. లోపలికెళ్ళి చూస్తే గాంధీ కుటుంబం పెత్తనం మరోసారి రుజువవుతుంది. ఆ కుటుంబానికి వీర విధేయుడు, రాహుల్ గాంధీకి ఏ మాత్రం పోటీగా నిలబడక, పక్కలో బల్లెం కాని నేతకే పగ్గాలు అప్పగించారన్నది బహిరంగ రహస్యం. పగ్గాలు అప్పజెప్పినా రిమోట్ సోనియాగాంధీ కుటుంబం చేతిలోనే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. నేడు కాంగ్రెస్ వున్న పరిస్థితికి ఆ ముళ్ల కిరీటంలో కూర్చోడానికి పెద్దగా ఎవ్వరూ సిద్ధపడరు. ఇద్దరు ముగ్గురు సిద్ధపడినా పునరాలోచించి తప్పుకున్నారు. చివర వరకూ బరిలో నిల్చున్నది శశి థరూర్ మాత్రమే.
Also read: జాతిని వెలిగించే వేడుక
పాత నేతల నిష్క్రమణ
దిల్లీలో అధికారాన్ని కోల్పోయాక కాంగ్రెస్ ను చాలామంది నాయకులు వీడి బయటకు వచ్చారు. వేరు వేరు పార్టీల్లో చేరి కొత్త దారులు వెతుక్కున్నారు. అసంతృప్తి ఉన్నా చేసేది లేక ఇంకా చాలామంది అక్కడే ఉన్నారు. కొందరు పెద్ద నేతలు తనువు చాలించారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, జ్యోతిరాదిత్య సింధియా వంటి బలమైన నేతలు బంధాలు తెంచుకొని పార్టీని మరింత బలహీనపరిచారు. వీరిలో గులాం నబీ ఆజాద్ సొంత దుకాణం పెట్టుకున్నారు. ఇప్పటికీ సభ్య సమాజం నుంచి కృతఘ్నుడుగా విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అధిష్ఠానం తీసుకున్న అనేక నిర్ణయాలు వికటించి పార్టీ కొంపముంచాయి. పంజాబ్, అస్సాం మొదలుకొని అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. పార్టీ తీరు తెన్నులను, ముఖ్యంగా రాహుల్ గాంధీ వ్యవహారశైలిని నచ్చక లేఖాస్త్రాలు సంధించిన నేతల సంఖ్య తక్కువేమీ కాదు. జీ- 23 గా పేరొచ్చినా, వెనకాల చాలామంది ఉన్నారని పార్టీ పెద్దలకు కూడా తెలుసు. ఎనిమిదేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండడంతో పార్టీ ఆర్ధికంగానూ చాలా ఇబ్బందులు పడుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా డబ్బులేమి వెక్కిరిస్తోంది. స్థానికంగా తెలంగాణలోని మునుగోడు మొదలు పెట్టుకొని ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. వేల కోట్లాది రూపాయల కాంట్రాక్టులకు దాసోహమై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను కేవలం ఒక సంవత్సరం గడువుండగానే వదిలేసి వెళ్లిపోయారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటువంటి కథనాలు ఎన్నో ఉన్నాయి.
Also read: కలవరం కలిగిస్తున్న కరోనా వేరియంట్
తెలుగు రాష్ట్రాలలో తరిగిన వెలుగు
కాంగ్రెస్ కు నమ్మినబంటుగా ఉండే నిన్నటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలుగు ఉభయరాష్ట్రాల్లో కాంగ్రెస్ భ్రష్టుపట్టి పోయింది. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్రయోజనం చివరకు తెలంగాణలో కూడా దక్కలేదు. మేడమ్ వ్యూహం బెడిసి కొట్టింది. వెరసి తెలంగాణలో బొప్పికట్టింది. తెలంగాణ ఇచ్చింది నేనే అంటూ… వసంతకోకిల సినిమాలో కమల్ హాసన్ లా వెంటబడినా? చేదుపాటే వినిపించింది. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని దూరం చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాట వినకపోవడంతో అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయింది. తమిళనాడులో స్టాలిన్ తో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నా, సీట్ల సద్దుబాటులో కాంగ్రెస్ మాట నెగ్గలేని పరిస్థితి తెచ్చుకుంది. ఇలా అనేక తప్పిదాల కుప్పలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ను నడిపించడం,పార్టీని బతికిబట్ట కట్టేలా చేయడం కొత్త అధ్యక్షుడికి ఆషామాషీ కాదు. అన్ని ప్రాంతాలు, అన్ని తరాల మధ్య సమతుల్యత తెచ్చేందుకు కృషి చేస్తానని, పూర్వ వైభవం తెచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని మల్లికార్జున ఖడ్గే అంటున్నారు. సాధ్యాసాధ్యాలు కాలంలోనే తెలియాలి. అధ్యక్ష ఎన్నికలో నిలబడి 1000 ఓట్లు దక్కించుకున్న శశిథరూర్ ను తక్కువ అంచనా వేయరాదు. అతనికంటూ ఒక ప్రత్యేక వర్గముందని మొన్నటి ఫలితాలే చెబుతున్నాయి. అతనికి పార్టీలో ఎటువంటి స్థానాన్ని ఇస్తారు, ఎలా బుజ్జగిస్తారో అంతే ముఖ్యం. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జోరుగానే సాగుతోంది. స్పందన బాగానే వస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఎంతో కొంత అనుకూలమైన ప్రభావాన్నే చూపిస్తుందని అంచనా వేయవచ్చు.
Also read: వీరవిధేయుడు విజేత కాగలరా?
పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు
2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. అక్కడ మెరుగైన ఫలితాలను రాబట్టడం, రాజస్థాన్ లో అధికారాన్ని నిలబెట్టడం, అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ కు గెలుపును అందించడం మల్లికార్జున ఖర్గే కు ఎదురుగా కనిపిస్తున్న పెను సవాళ్లు. రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాల్లో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బలంగా ఉన్నాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి కొత్త దారులు వెతుక్కొనే పనిలో చాలామంది ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. జీ 23 సభ్యులను కూడా కాపలా కాయల్సి వుంది. పార్టీని బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తూ బలోపేతం చేయాల్సి వుంది. ఇప్పటికీ అత్యంత శక్తిమంతంగా ఉన్న బిజెపిని, మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదిరి నిలవడం సామాన్యమైన విషయం కాదు. విపక్షాలను దేశ వ్యాప్తంగా ఒక తాటికి తెస్తామని అంటున్నారు. అది కూడా అంత తేలికైన పని కాదు. బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తి, వ్యతిరేక ప్రభంజనం వస్తే తప్ప, కాంగ్రెస్ కు అధికారం దక్కే శకునాలు ఎక్కడా కనిపించడం లేదు. గాంధీ త్రయం ఏరికోరి ఎంపిక చేసుకున్న మల్లికార్జున ఖర్గేకు నిర్ణయాలు తీసుకొనే స్వతంత్రత ఇవ్వాలి.అతని ఆలోచనలను గౌరవించాలి. పెద్దనాయకుల మధ్య సఖ్యత కుదర్చాలి. ఇవ్వేమీ జరగకుండా పార్టీలో అద్భుతాలు ఊహించుకోవడం అత్యాశవుతుంది. వ్యక్తిగతంగా మల్లికార్జున ఖర్గేకు మంచిపేరు ఉంది. గాంధీత్రయం మంచి వ్యక్తినే ఎంపిక చేసుకుందనే ప్రశంసాత్మక వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. వృద్ధుడు,జ్ఞాన వృద్ధుడు, కాకలు తీరిన నాయకుడు, లోకం పోకడ, కాంగ్రెస్ తీరు తెన్నులు తెలిసిన ప్రాజ్నుడు మల్లికార్జునుడు. అందులో ఎటువంటి సందేహం లేదు.కాకపోతే వయసు ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. ప్రత్యామ్నాయంగా మరో నాయకుడిని కూడా వెతికిపెట్టుకొని ఉండడం శ్రేయస్కరం. వీటన్నిటి కంటే ముఖ్యం రాహుల్ గాంధీ రాటు తేలాలి.కొత్త అధ్యక్షుడు కాంగ్రెస్ చరిత్రకు ఎటువంటి అక్షరాలు అందిస్తాడో వేచి చూద్దాం.
Also read: శేషేంద్ర కవీంద్రుడు