రామాయణమ్ – 67
‘‘ఇప్పుడేకదా నీవెంట మహావీరులైన రాక్షసులను పంపాను. ఇంతలోనే ఏమయ్యిందే నీకు మళ్ళా ఏడుస్తున్నావు?’’ అని కోపంతో అన్నాడు ఖరుడు.
‘‘లేలే నీకేమీ భయములేదు నేనున్నాను నీకు అధైర్యము వద్దు ఏమిజరిగిందో చెప్పు’’ అన్నాడు.
‘‘అవును. ఇంతక్రితమే నీవు నాతొ పద్నాలుగు మంది మహాశూరులను పంపావు. కానీ వారందరినీ క్షణకాలంలో చంపివేశాడా మానవుడు. ఆతని యుద్ధరీతి చూస్తే నాకేదో భయంగా ఉన్నది.ఏమో! ఎటునుండి ఏ ప్రమాదము రానున్నదో అని భీతికలుగుతున్నది.
Also read: శూర్పణఖ ముక్కుచెవులు కోసిన లక్ష్మణుడు
‘‘నేను విషాదమనే మొసలి,
భయము అనే తరంగాలు కలిగిన
దుఃఖము అనే సముద్రములో మునిగి ఉన్నాను. నన్నెందుకు రక్షింపవు నీవు?
నీకు రాక్షసులయందు జాలి ఉన్నట్లయితే ఆ రాక్షస కంటకుడిని ఎదిరించు.
నీకు శక్తీ ,తేజస్సు ఉంటే ఆ రాముడిని చంపేసి నా కోపము చల్లార్చు. లేని పక్షములో నేనిప్పుడే నీ ముందే ప్రాణాలు విడుస్తాను. నీకు ఆపని చేతకాకపోతే ఇక్కడనుండి పారిపో’’ అని రెచ్చగొడుతూ పొట్ట బాదుకుంటూ బావురుమని ఏడ్చింది.
అప్పుడు ఖరుడు రోషముతో, ‘‘శూర్పణఖా ఇదిగో ఇప్పుడే చెపుతున్నాను ఈ గండ్ర గొడ్డలితోనే వాడి తల నరుకుతాను. అప్పుడు వాడి కంఠం నుండి పొంగుతూ బయటకు వచ్చే వెచ్చని నెత్తురు ఆనందముగా త్రాగుదువుగాని…..’’అని అంటూ..
Also read: శ్రీరామచంద్రుడిపై మనసు పారేసుకున్న శూర్పణఖ
తన సేనాని అయిన దూషణుని వైపు తిరిగి ‘‘నీవు వెంటనే పద్నాలుగువేలమంది మహావీరులు, శత్రు భయంకరులు అయిన సైనికులను సిద్ధం చేయి’’ అని ఆజ్ఞాపించాడు. వీరులైన రాక్షసులు వెంటరాగా రాముడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు ఖరుడు.
వాడు బయలుదేరగానే ఆ సైన్యము మీద అమంగళకరమైన రక్తము వర్షించింది.
ఒక పెద్ద రాబందు వచ్చి వాడి ధ్వజాన్ని ఆక్రమించి రధము మీద కూర్చున్నది..
ఖరుడి ఎడమ భుజము అదిరింది. అయినా ఇవి ఏవీ లెక్క చేయక రణ ఉత్సాహము ఉప్పొంగుతుండగా ముందుకు కదిలాడు వాడు.
రాముడు కూడా ఖరుడు చూసిన ఉత్పాతాలే చూశాడు. ‘‘ఈ ఉత్పాతాలు సకల భూత వినాశనాన్ని సూచిస్తున్నాయి, చూశావా లక్ష్మణా’’ అని అన్నాడు. పక్షుల కూతలు ఒక్కసారి విన్నావా? మనకు ఎదో అపాయము దగ్గరలోనే రాబోతున్నదనిపిస్తున్నది. ఎదో గొప్ప యుద్ధమే జరుగబోతున్నట్లు అదిరే నా భుజము చెపుతున్నది. అయినా శకునాలు అన్నీ మనకు జయాన్నీ ఎదుటివాడికి అపజయాన్నీ చెపుతున్నాయి. అదుగో! దూరంగా ఎదో ధ్వని వినపడుతున్నది . అది రాక్షసులు దండుగా బయలుదేరి వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. అది వారుచేసే కోలాహలమే! భేరీల భయంకరమైన శబ్దము వినపడుతున్నది. నీవు వెంటనే నీ వదినగారిని సమీపములోని కొండగుహలోనికి తీసుకెళ్ళి రక్షణగా ఉండు. నేను రాక్షసుల సంగతి చూస్తాను’’ అని అన్నాడు రాముడు.
Also read: పంచవటిలో పకడ్బందీగా, సుందరంగా పర్ణశాల నిర్మాణం
లక్ష్మణుడు సీతమ్మను భద్రముగా తీసుకొని వెళ్ళిన తరువాత రాముడు కవచము తొడుక్కొన్నాడు. తన ధనుస్సు చేతిలోనికి తీసుకొన్నాడు. ధనుష్టంకారం చేశాడు. ఆ శబ్దము వేయిపిడుగులు ఒక శ్రేణిలో అనగా ఒక వరుసలో పడినప్పుడు ఏ విధమైన ధ్వని వస్తుందో ఆ విధమైన ధ్వనిని తలపించింది. ఆ ధ్వని తరంగాలు గాలిలో వ్యాపించి అవి విన్న వారి హృదయాలలో గొప్పభయాన్ని పుట్టించాయి.
సకల ఋషిగణాలు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ అక్కడ వచ్చి చేరారు జరుగబోయే ఘోర యుద్ధాన్ని వీక్షించడానికి.
దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో ధనుస్సు ఎత్తిపట్టి నిలిచిన రాముడు చూడటానికి భయము కొల్పుతున్నాడు. ఆయన ఆకృతిలో ఒక ఉగ్రత్వము, ఒక తేజస్సు కలగలసి ప్రళయకాల రుద్రుడి లాగా కనపడుతున్నాడు.
రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్ట కర్మణః
బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః
క్రుద్ధుడైన రుద్రుడిలాగా ఉన్నాడట ఏ పనినైనా అత్యంత సులువుగా చేయగల రాముడు.
Also read: పంచవటి సందర్శన
ఇంతలో నలుమూలలనుడి కలకలం చెలరేగింది. నాలుగువైపులనుండీ ముంచెత్తే వరదలాగా సైనికులు నలువైపులనుండీ కమ్ముకుంటూ, మండలాకారంగా దూరమునుండే చుట్టుముట్టుకుంటూ వస్తున్నారు. వారిని చూడగానే ఆయన చేతిలోని ధనుస్సు రుద్రుడి చేతిలోని పినాకములాగా భాసిల్లింది. ఒక అడుగు ముందుకు వేసి ధనుస్సును గట్టిగా పట్టుకున్నాడు.
అప్పుడాయన
రుద్రుడైనాడు
వీరభద్రుడైనాడు
ప్రళయకాల ప్రభంజనమైనాడు.
Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు
వూటుకూరు జానకిరామారావు