Sunday, December 22, 2024

ఖమ్మంలో సూసైడ్ ఎపిసోడ్ పై రగడ-ఓ రాజకీయ వ్యాఖ్య!

  • సాయిగణేశ్ ఆత్మహత్యపై రాజకీయ దుమారం
  • వామపక్షాల ఎదుట సువర్ణావకాశం
  • వినియోగించుకుంటాయా? వదులుకుంటాయా?
  • వామపక్షాల ఉపేక్ష బీజేపీకి శ్రీరామరక్ష
  • ఖమ్మంలో బీజేపీ ఒక శక్తిగా ఎదగడానికి కారణం ఎవరు?
  • ఇప్టూ ప్రసాద్

ఎదురుగా ఉన్న ఎర్ర బూర్జువా శిబిరంపై వర్గ పోరాటాల్ని విస్మరిస్తే, దూరపు కాషాయజండా బలపడటం సహజమే! వామపక్షాలు తమ తక్షణ కర్తవ్యం వదిలేసి బీజేపీ దీర్ఘకాల ముప్పు పై గోచీ బిగించడం నేల విడిచి సాము వంటిదే! 

పువ్వాడ బాసిజంపై పోరాటాన్ని నిర్లక్ష్యం చేసి కమ్యూనల్ ఫాసిజాన్ని ఓడించే అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏదైనా ఖమ్మం వామపక్షాలకి ఉందా? ఏది వర్గ దృష్టి? ఏది వర్గేతర దృష్టి? ఏది మార్క్సిజం? ఏది ఆంటీ మార్క్సిజం? వీటిపై ఖమ్మం వామపక్షాలు సమీక్షకి సిద్ధం కావాలి 

ఫ్రెండ్స్ & కామ్రేడ్స్!

సర్వదేవభట్ల రామనాథం

1937 మేలో గుంటూరు జిల్లా (నేటి ప్రకాశం జిల్లా) కొత్తపట్నం రాజకీయ పాఠశాలకు తెలంగాణ నుండి హాజరైన ఏకైక ప్రతినిధి సర్వదేవభట్ల రామనాధం గారు! ఖమ్మం ప్రాంత వాస్తవ్యులైన సర్వదేవభట్ల తెలంగాణలో తొలి కమ్యూనిస్టు! 1400 ఎకరాల తనవాటా భూముల్ని కౌలు రైతులకి పంపిణీ చేసిన ఆదర్శ కమ్యూనిస్టు! ఆ బాటలో మంచికంటి రాంకిషన్ రావు, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, కొండపల్లి లక్ష్మీ నర్సింహారావు (KL), పర్సా సత్యనారాయణ, పర్సా దుర్గాప్రసాద్  కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలుగా ఎదిగారు.  వీరు సనాతన బ్రాహ్మణ కుటుంబీకులే! కొందరు ఫ్యూడల్ భూస్వామ్య కుటుంబాల వారే! తమ ఆస్తుల్ని పార్టీకోసం, జనం కోసం ధారపోశారు. నాటి ఫ్యూడల్ జమీందారీవర్గంపై అసాధారణ త్యాగాలు చేసి ఖమ్మం కమ్యూనిస్టు కంచుకోటగా మలిచారు.  అది గత ఘన చరిత్ర! ఆ ఖమ్మం తర్వాత కాలంలో ఎర్రజెండా నీడన ఎదిగిన ఎర్రబూర్జువా కేంద్రంగా మారింది. నేడు అంబానీ, ఆదానీ కుటుంబాల పట్ల దేశ ప్రజల అభిప్రాయాల వంటివే ఖమ్మం ప్రజలకు పువ్వాడ కుటుంబం పట్ల కూడా వుంటాయి.

కమ్యూనిస్టు నేపధ్యంతో ఎదిగిన పువ్వాడ కుటుంబం యాబై ఏళ్ల కాలంలో ఖమ్మంలో బడా ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఖమ్మం  ప్రజల మనస్సుల్లో అదో ఎర్ర నయా జమీందారీ శిబిరంగా పేరొందింది.

ఒకవైపు ఎర్రజెండాని నేటికీ వదిలిపెట్టదు. అది మరోవైపు రాజ్యాధికారం పొందగలిగింది. అదో భౌతిక వాస్తవం! అట్టి ఎర్ర సంపన్న ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్య శిబిరం పట్ల ఖమ్మం వామపక్షాలు సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న భావం ఖమ్మం ప్రాంత ప్రజల మనస్సుల్లో బలపడింది. ఈ రాజకీయ రసాయనిక ప్రక్రియకు సాయి గణేష్ ఆత్మహత్య ఉత్ప్రేరకంగా మారడం గమనార్హం!

బుర్హాన్ పురం నుండి ధ్వంసలాపురం వరకూ; NSP కాలనీ నుండి శ్రీనివాస్ నగర్ వరకూ  భూకబ్జాలకి పువ్వాడ కుటుంబం సాగిస్తోంది. భూపంపిణీకై నాటి పీడిత ప్రజలు ఎర్రజండా పడితే,  భూకబ్జాకై ఎర్రదొరలు నేడు పట్టారు. పువ్వాడ కుటుంబం అలా ఎదిగి నేడు ఖమ్మం అంబానీ గా ఎదిగి శాసిస్తోంది.

పైన పేర్కొన్న ఆదర్శ కమ్యూనిస్టులు సనాతన బ్రాహ్మణ, కరణాల నుండి వచ్చారు. ఐనా ఎన్నడూ వారు రాజకీయాల్లో కులం కార్డుల్ని వాడుకోలేదు. నేటి ఎర్ర జమీందారీ కుటుంబం తమ ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్య పరిరక్షణకై కులం కార్డుని వాడుకునే నీచ, నికృష్ట స్థాయికి దిగజారింది. ఈమధ్యే వైరాలో ఒక సభలో మంత్రి పువ్వాడ అజయ్ హాజరై పలికిన కులగజ్జి మాటలు తన నీతిబాహ్య దిగజారుడు రాజనీతిని వెల్లడిస్తోంది. ఇటీవల ఖమ్మంలో ఓ ఆత్మహత్య నేపథ్యంలో బట్టబయలవుతోన్న తన బండారం, భాగోతాల్ని కప్పిపెట్టుకొని, తన ఆర్ధిక, సామ్రాజ్య పరిరక్షణకై గడ్డి తినడానికైనా సిద్ధమేనని వైరాలో మంత్రి వ్యాఖ్య వెల్లడిస్తోంది. (గడ్డి తినే పశువులు బుద్ది గలవి. వాటికి నా క్షమాపణ)

Congress cadres upbeat after Dalit Dandora
ఖమ్మంలో సాయిగణేశ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాయి గణేష్ అనే వ్యక్తి ఖమ్మంలో ఏప్రిల్ 14న ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మూడోరోజు  మృతి చెందాడు. ఖమ్మం పాలిటిక్స్ లో నేడు అదో హాట్ పొలిటికల్ టాపిక్! ముఖ్యంగా వామపక్షాల వైఖరి ఖమ్మం ప్రాంత ప్రజలలో విమర్శలకు గురవుతోంది. మార్క్సిస్టు దృష్టితో సమీక్షించాల్సి ఉంది. ఏది మార్క్సిజం? ఏది కాదు? అనే చర్చ జరగాల్సి ఉంది. ఏది గతితర్క వైఖరో, ఏది వి(కు)తర్క వైఖరో చర్చ జరగాలి. ఖమ్మం ప్రాంతం వరకే కాక, బయట కూడా సమాలోచన, సమీక్ష జరగాలి. దీనికి వ్యక్తిగత, లేదా పార్టీ ప్రాతిపదిక కారాదు. మార్క్సిజం ఓ ప్రాతిపదిక కావాలి. ఇది ఆలోచనల్ని ప్రేరేపించే (Thought provoking) ప్రయత్నం మాత్రమే!

సాయి గణేష్ ఓ బీజేపీ కార్యకర్తగా, పువ్వాడ కుటుంబ సామ్రాజ్యపు ఆగడాలపై విమర్శచేసి, వేధింపులు భరించలేక ఆత్మహత్యకి దిగాడనేది వార్త! ఆ మరణంపై రెండు వాదనలున్నాయి. చిన్న కారణానికే మానసిక దౌర్బల్యంతో ఆత్మహత్య  చేసుకున్నాడనేది ఒకటి.  మంత్రి కక్షసాధింపుతో పలు కేసుల్లో ఇరికించడం వల్ల బలవన్మరణానికి దారితీసిందనేది మరో వాదన! మొదటి వాదన ప్రకారం ఆత్మహత్య! రెండో లెక్కన హత్య! మంత్రి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల రాక, పువ్వాడ పై నిరసన సభలతో ఖమ్మం వేడెక్కుతోంది. అది ఒక ఎత్తు కాగా,వామపక్షాల పాత్ర, వైఖర్లు మరో ఎత్తు!

సాయి గణేష్ మరణం బీజేపీకి రాజకీయ  అవకాశాన్ని కల్పించింది. ఏప్రిల్ 22న కిషన్ రెడ్డి మృతుడి కుటుంబ సందర్శనకు ఖమ్మం వచ్చే అవకాశం కలిగించింది. సాయి గణేష్ మరణించి కూడా పువ్వాడ కుటుంబ రాజ్య నిరంకుశ పాలనని, వామపక్ష శక్తుల రాజకీయ వైఖర్లని ప్రశ్నిస్తున్నాడు. సాయి గణేష్ భౌతికంగా తెరమరుగై పోయాడు. అతడి బలవన్మరణానికి  కారణమైన జిల్లా మంత్రి తెరచాటుకు వెళ్లాడు. ‘గేదెకు లేదు, దూడకు లేదు, గుంజకు వచ్చింది గురక రోగం’ అన్నట్లుగా వామపక్షాలకు తిప్పలే తిప్పలు! చేసిన రాజకీయ నేరాలకి శిక్షయో, నిర్దోషి గా శిక్షయో రేపటి ఖమ్మం ప్రజాకోర్టు తేల్చాలి.

కిషన్ రెడ్డి మృతుడి కుటుంబ సందర్శన చేసి, మంత్రిపై తీవ్ర విమర్శలకి దిగాడు. వైరాలో ఆరోజే మంత్రి కులం కార్డును తీశాడు. మరునాడే (23) ప్రజాతంత్ర, లౌకిక వేదిక (ప్ర.లౌ.వే) ఏర్పడి ఖమ్మంలో రౌండ్ టేబుల్ సభ జరిపింది. వేదిక ఏ పేరుతో ఏర్పడ్డా, సభలో ఇతర సంస్థలు పాల్గొన్నా, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం.ఎల్. ప్రజపంథా ల క్రియాశీల భాగస్వామ్యం  ముఖ్యమైన అంశం. బీజేపీ పై ఎక్కుపెట్టిన ఆ  సభను ఆ రాజకీయకోణం మేరకే పరిమితమై చూస్తే, ఫాసిస్టు వ్యతిరేక సభ అనొచ్చు. స్థల, కాలాదుల ప్రమేయం లేకుండా కొన్ని ఘటనల ఆధారంగా వాటి మంచిచెడుల్ని నిర్ధారణ చేయలేము. నేటి ఖమ్మం ప్రాంత నిర్దిష్ట రాజకీయ, స్థితిగతుల్లో వర్గపొందిక ఏంటి? సామాజిక పొందిక ఏంటి? రాజకీయ పొందిక ఏంటి? వీటిని దృష్టిలో ఉంచుకొని కర్తవ్యాల్ని రూపొందించాలి. అదే మార్క్సిస్టు దృక్కోణం! అట్టడుగు శ్రామిక ప్రజల ప్రధాన భాగస్వామ్యం లేకుండా వర్గపోరాటాల, సామాజిక పోరాటాల పురోగమనం సాధ్యం కాదు. ఈ నిర్దిష్టతల్ని పరిగణనలోకి తీసుకుని రౌండ్ టేబుల్ సభ పాత్రని విశ్లేషించాల్సి వుంటుంది.

దేశంలో బీజేపీ ఫాసిస్టు రాజకీయాలపై సాధారణ విమర్శ ఖమ్మం ప్రాంత నేటి నిర్ధిష్ట పరిస్థితుల్ని ప్రతిబింబించదు. ఖమ్మం ప్రజలు తలనొప్పితో బాధ పడుతుంటే, కడుపునొప్పి మాత్రలివ్వడం వైద్యులకి తగదు. వామపక్షాలకి యిది వర్తిస్తుంది. ఖమ్మం జనం పువ్వాడ కుటుంబ ఆర్ధిక, రాజకీయ రాజ్యం సాగించే బుల్డోజర్ పాలనపై పోరాడాలని వామపక్ష శక్తుల నుండి కోరుకునే పరిస్థితుల్లో కాషాయ కమ్యూనల్ ఫాసిజంపై కారాలు, మిరియాలు నూరితే జనం హర్షించదు.  అది ఆచరణలో బీజేపీకే లాభిస్తుంది. అందుకే రౌండ్ టేబుల్ సభ లౌకిక, ప్రగతిశీల, ప్రజాతంత్ర, వామపక్ష శ్రేణుల్లో కూడా చర్చనీయాంశమైనది.

పై రౌండ్ టేబుల్ సభ కాషాయ ఫాసిజం పట్ల రాజకీయ నిరసన సభ! కానీ పువ్వాడ కుటుంబ పొలిటికల్ బాసిజం పట్ల అనుకూల సభగా ఖమ్మం ప్రాంత ప్రజల మనస్సుల్లో భావన! ప్రజాతంత్ర, లౌకిక మేధావులతో ఖమ్మం వామపక్షాలు నిస్పాక్షిక  బృందాన్ని ఏర్పరిచి సత్యాన్వేషణ చేయిస్తే నిజాలు తెలుస్తాయి.  వామపక్షాల వైఖరిపై ఖమ్మం ప్రజల మనస్సుల్లో ఏముందో అర్ధమౌతుంది.  ఆ పనిని చేపడతాయో లేదో వాటి ఇష్టమే.

ఖమ్మంలో పెద్దగా ఎగిరే పునాది లేని కాషాయ జండాకు సాయి గణేష్ ఆత్మహత్య ఎగసిపడే బలాన్నిచ్చింది. అధికార దుర్వినియోగం ద్వారా మిడిసిపడే పువ్వాడ దాష్టీకాన్ని వామపక్షాలు నిలదీయని ఫలితమిది. తమ గ్రాఫ్ పడిపోయే సందర్భాల్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడి తంతుల్ని వామపక్షాలు నిర్వహిస్తాయనే విమర్శ కూడా ఉంది. పువ్వాడ సామ్రాజ్య పునాదులపై పోరాటం చేపట్టకుండా,   కొమ్మలు, రెమ్మలపై రాళ్లు విసురుతాయనే విమర్శ ఖమ్మం ప్రాంత ప్రజాతంత్ర శక్తుల్లో కూడా ఉంది.

పువ్వాడ కుటుంబ సామ్రాజ్యంపై వామపక్ష శక్తులు బాధిత ప్రజల్ని సమీకరించి పోరాడలేని  కారణంగానే ఖమ్మంలో  రాజకీయ శూన్యస్థితి (political vacuum) ఏర్పడిందనే ఒక విశ్లేషణ కూడా వుంది. ఆ శూన్య స్థితి ఎక్కడున్నా గోతి కాడి నక్క లా బిజెపి ప్రవేశిస్తోంది. అది చరిత్ర నిరూపిస్తోన్న సత్యమే!

పై రాజకీయ కోణాన్ని విస్మరించి, హడావుడిగా రౌండ్ టేబుల్ సభ వంటి నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తే ఫలితం లేదు. ఖమ్మం ప్రాంత నిర్దిష్ట రాజకీయ స్థితిగతుల ఆధారంగానే వామపక్షాల వ్యూహం, ఎత్తుగడలు ఉండాలి. అలా లేదనేది ఖమ్మం ప్రాంత ప్రజల సార్వత్రిక అభిప్రాయం!  మంత్రి బాధితుడి పక్షాన బీజేపీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాతే హఠాత్తుగా ప్ర.లౌ.వే  ఏర్పడ్డ తీరు ఆచరణలో బీజేపీకి బలాన్నిస్తుంది.  గత మూడేళ్ళుగా మంత్రి అధికార దుర్వినియోగం ద్వారా రకరకాల కుట్రలు, కుహకలు, భూకబ్జాలు, కుంభకోణాలకి యథేచ్ఛగా పాల్పడుతుంటే ఇలా ఎందుకు నిలదీయలేదనే విమర్శ ప్రజల్లో ఉంది. అది నిజం కాదని అవి భావిస్తే, ఖమ్మం ప్రజలకి ఖమ్మం వామపక్షాలు వివరించి ఒప్పించాలి. కిషన్ రెడ్డి ఖమ్మం రాకతో  అమిత కార్యోత్సాహం,   సమరోత్సాహాలతో ఖమ్మం వామపక్షాలు రంగ ప్రవేశం చేశాయి. అవి అంతకంటే ముందు వెలిసిన ఎర్ర మందార & గుబాళించే గులాబీ రంగు జెండాల మిశ్రమ పువ్వాడ సామ్రాజ్యం పై అందులో పదో వంతు సమరోత్సాహాన్ని కూడా వామపక్షాలు ఎందుకు ప్రదర్శించలేదనే భావన ఖమ్మం ప్రాంత ప్రజల్లో ఉంది. ప్రజలపై విశ్వాసం ఉంటే, వారి విమర్శల్ని స్వీకరించడం వామపక్షాల రాజకీయ ధర్మం! ప్రజలవి అపోహలేనని వామపక్ష శక్తులు భావిస్తే, రేపటి తమ కార్యాచరణతో నిరూపించుకోవాలి.

మంత్రి చేత పలు కేసుల్లో ఇరికించబడి, నిస్పృహతో  సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబ విశ్వాసం పొందే చర్యల్ని వామపక్షాలు ఎందుకు చేపట్టలేదనేది ఓ విమర్శ! దుర్మరణానికి కారకుడైన మంత్రిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిప్పులు చెరిగే సమయంలోనే వామపక్ష రంగ ప్రవేశంలో అంతర్యం ఏమిటనే ప్రశ్న తలెత్తింది. బయటకు ఏది చెప్పినా, లోపల మంత్రిని కాపాడే లక్ష్యంతో దిగారనే విమర్శ వినిపిస్తోంది. విమర్శల్లో  నిజానిజాలు అంతిమంగా ప్రజా న్యాయస్థానం తేల్చి చెప్పాలి.

వామపక్షాల వైఖరి వల్ల ఖమ్మం ప్రాంతంలో పువ్వాడ ఎర్ర ఆర్ధిక రాజ్య నిరంకుశత్వాన్ని ఎదిరించే మొనగాడిగా పోజు పెట్టె అవకాశం బిజెపికి లభించింది. ఈ  రాజకీయ బాధ్యతని ఖమ్మం వామపక్షాలు చేపట్టక తప్పదు. ఇది ఖమ్మంలో సాధారణ ప్రజాతంత్ర వాణి!

సాయిగణేష్ ఆత్మహత్య   మానసిక దౌర్బల్యమని చెప్పి తప్పించుకునేది కాదు. బుద్ది మందగించి చేసుకున్న ఆత్మహత్యగా కొట్టేసేది కాదు. అది మతి చలించిన పిచ్చివాడి మరణం కాదు. మతి స్థిమితాన్ని కోల్పోయిన ఉన్మాది మరణం కాదు.  కేసులు అబద్ధం కాదు. అధికార జులుం అబద్ధం కాదు. తనని విమర్శించే వారి పట్ల జిల్లా మంత్రి చేపట్టే రాజకీయ వేధింపు విధానం అబద్ధం కాదు. ఇవన్నీ సత్యాలే! ఈ నిప్పులాంటి నిజాల్ని వామపక్షాలు గుర్తించాలి. అవి గుర్తిస్తాయో లేదో వాటి ఇష్టమే! ఇవి ఖమ్మం ప్రాంత ప్రజల్లో విమర్శలు ఆవేదనలు, నివేదనలే!

తెలంగాణలోనే ఖమ్మం తొలి కమ్యూనిస్టు కేంద్రం!  85 ఏళ్లక్రితమే ఎర్రజెండా రెపరేపలాడిన కేంద్రం! తొలి కమ్యూనిస్టు గడ్డపై ఎర్రజెండా పేరు చెప్పుకొని  తెగబలిసిన ఓ బూర్జువా కుటుంబం నేడు ఖమ్మం ప్రాంతాన్ని శాసిస్తోంది. ఆ కొత్త సంపన్న సామ్రాజ్య కొండ శిఖరంపై నుండి జారిపడ్డ శిలల క్రిందపడి నలిగిపోయే వందలాది జీవితాలలో సాయి గణేష్ ది ఒకటి! అలా పడిపోయే శిలలకి కారణమైన పువ్వాడ కుటుంబ సామ్రాజ్య కొండపై వర్గపోరాటాన్ని వదిలేసి దాని క్రింద నలిగిపోయే బాధిత జనాల విశ్వాసం పొందకుండా, కాషాయ కమ్యూనల్ ఫాసిజాన్ని ఓడించడం సాధ్యం కాదు.

వెనెజులాలో నికొలస్ మదురో విజయం సందర్భంగా అభినందన సమావేశం జరుపుకున్న మార్క్సిస్టు పాార్టీ నాయకులు

ఈ సందర్భంలో సాయి గణేష్ ఆత్మహత్య ఓ పిరికి చర్యగా మార్క్సిస్టు విశ్లేషణ చేయడం తగదు. ఆ ఆత్మహత్యకు దారితీసే నిర్దిష్టస్థితిని విస్మరించి, రొడ్డకొట్టుడు మార్క్సిస్టు విశ్లేషణల్ని వల్లిస్తే ప్రజలు అంగీకరించబోరు. ప్రజలకి మనస్సులు ఉంటాయి. హృదయాలు ఉంటాయి. నిర్దిష్ట పరిస్థితుల్ని బట్టి వివక్షత, విచక్షణలు సైతం ఉంటాయి. ముఖ్యంగా వర్గ సమాజంలో వర్గ ప్రతిస్పందనలు కూడా ఉంటాయి. ఆకలితో ఉన్న అన్నార్తులకు తక్షణమే అందుబాటులో ఉన్న అన్నం కుండలోని అన్నం ముద్దల్ని తినకుండా ఆపి, ఆకాశంలో ఎగిరే కౌజు పిట్టల్ని వేటాడి మాంసం వండుకొని తిందామని నోరూరించే కబుర్లు చెప్పి, మసాలా నూరమంటే ఎలా ఉంటుంది? తమ ఎదుట తక్షణ శత్రువుల్ని వదిలేసి, అంతకంటే నూరు రెట్ల రేపటి శత్రువుపై యుద్దానికి రమ్మంటే, ఆ తక్షణ బాధిత ప్రజలు స్పందించలేరు. అది నేల విడిచిన సాము వంటిది. వామపక్షాలు తొలుత పీడిత ప్రజల మనస్తత్వం, ఆశలు, ఆకాంక్షల్ని సరిగ్గా అధ్యయనం చేయాలి. 

ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (SR & BGNR GOVT COLLEGE) లో నేను 1978లో విద్యార్థి సంఘం అధ్యక్షునిగా PDSU తరపున ఎన్నిక ఆయ్యాను. (అప్పుడు నా పేరు పుల్లయ్య! PDSU పుల్లయ్యగా వాడుకలో పిలిచే వారు. నేడు ఇఫ్టూ ప్రసాద్) ఆ కాలంలో మేం తరచుగా ఒక సామెతని వినే వాళ్ళం! అదే EX COMMUNIST IS MORE DANGEROUS! 

పై సామెత గూర్చి ఒక వివరణ ఇవ్వాల్సి వుంది. మాజీ కమ్యూనిస్టులు అందరికీ ఇది వర్తించదు. కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసే కొందరి కంటే, ఆ నిర్మాణాల్లో చేరకుండా బయటఉన్న కమ్యూనిస్టు రాజకీయ సానుభూతి పరులలో చాలా మంది కమ్యూనిస్టు విలువలతో జీవిస్తున్నారు. అందుకే పై సామెత సంపూర్ణ సత్యం కాదు. బండ సూత్రంగా మాజీ కమ్యూనిస్టులు అందరికీ అది వర్తించదు. మాజీ కమ్యూనిస్టులుగా మారిన తర్వాత వ్యాపార కమ్యూనిస్టులుగా ఎవరు మారతారో, అలాంటి వారి లో ఎక్కువశాతం మందికి పై సామెత వర్తిస్తుంది.

PDSU విద్యార్థి ఉద్యమ కారుడిగా నా ప్రసంగాల్లో సందర్భానుసారంగా పై సామెతను ప్రస్తావించే వాడిని. ఆ సూక్తి పలికే సమయాల్లో మా వేదిక ఎదురుగా ఉన్న వేలాది విద్యార్థులు చప్పట్లు, ఈలలతో మారుమోగేది.  ముఖ్యంగా నాడు ఖమ్మం జిల్లాలో ఆ ప్రతిస్పందన, ఆదరణలు ఎక్కువగా లభించేవి. బలమైన కారణం కూడా ఉంది. ఖమ్మం కమ్యూనిస్టు శిబిరంలో ఆనాడు లిక్కర్ కాంట్రాక్టర్ల ముఠా పుట్టి పెరుగుతోంది. దానికి ఒక “ఎర్రజెండా” పార్టీ కొమ్ము కాసింది. నాడు ఆ లిక్కర్ ముఠాకి అండగా గొడుగు పట్టిన ఆ వామపక్షానికి నాయకత్వం వహించిన నేతయే, నేటి పువ్వాడ ఆర్ధిక సామ్రాజ్య నిర్మాత!

యాబై ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో పువ్వాడ  కుటుంబం నేడు ఓ ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్య స్థాయికి చేరింది. యాబై ఏళ్లక్రితం గోదావరి ఒడ్డున పుగాకు బిజినెస్ తో ప్రారంభమై, ఖమ్మంలో పానశాలల ద్వారా బలపడి, నేడు ఖమ్మం నుండి బాచుపల్లి వరకు వైద్యశాలల విస్తరణ ద్వారా విస్తరించింది. తొలుత అది ఆర్ధిక సామ్రాజ్యం! మంత్రి పదవి చేపట్టాక ఆర్ధిక, రాజకీయ సామ్రాజ్యం! నేడు సామాజిక కార్డు కూడా వాడిన తర్వాత  1-ఆర్ధిక, 2-రాజకీయ, 3-సామాజిక రంగాల సామ్రాజ్యంగా కూడా కొత్తగా విస్తరిస్తోంది.

పువ్వాడ సామ్రాజ్యం తన ఎజెండా అమలు కోసం రెండు రాజకీయ జండాల్ని ధరించింది. ఒకటి ఎర్రజండా! మరో జండా పొద్దు తిరుగుడు పువ్వు వంటిది. మొదటి ఎర్రజండా మారేది కాదు. రెండవది ఎన్నికకోసారి మారుతుంది. తండ్రి చేతుల్లో ఎర్రజెండా; కొడుకు చేతుల్లో ఏటా ఓ జండా! ఇదీ పువ్వాడ కుటుంబ రాజకీయం! వారికి ఎర్రజెండా కేవలం ముసుగే! ఎర్రజెండా రంగు మార్చకుండానే దిక్కు మార్చిన దిక్కుమాలిన రాజకీయం పువ్వాడ కుటుంబానిది. కొడుక్కి పగటి వేషగాడి వలె ఎన్నికలకొక జండా కప్పేపని తండ్రే చేస్తాడు. (పాపం పగటి వేషగాళ్ళు ఎవరి నోళ్లు కొట్టరు. తమ  పొట్టకూటికోసం మాత్రమే వేషాలు వేస్తారు. వాళ్లకి క్షమాపణ చెబుతున్నా)

ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల నిరసన ప్రదర్శన

కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగా దళితులకు గతంలో ప్రభుత్వాలు ఎసైన్డ్ భూముల్ని పంపిణీ చేశాయి. తమ హాస్పిటల్ విస్తరణ పేరిట వాటిని కబ్జా చేశారు. వందలాది  గుడిశల్ని కూల్చివేశారు.  విలువైన భూముల్ని కబ్జా చేసారు. అరవైవేల మంది తెలంగాణ RTC కార్మికుల పొట్టగొట్టే పాపిష్టి పనికి ఒడిగట్టారు. రవాణా రంగ కార్మికుల్ని ఏడు దశాబ్దాల క్రితం కమ్యూనిస్టు పార్టీ సమీకరించి సంఘాన్ని స్థాపించింది. సుదీర్ఘ రక్తతర్పణలతో హక్కుల్ని సాధించింది. ఆ ఎర్రజెండా రంగును మార్చకుండానే, దిక్కుమార్చి తన కొడుక్కి రవాణా మంత్రి పదవి తెప్పించి, కార్మిక ద్రోహానికి పాల్పడ్డారు. ఆచరణలో ఆర్టీసీలో యూనియన్ ని సైతం లేకుండా చేశారు.  ఎర్రజండా ముసుగులో  నిర్మించిన దోపిడీ ఆర్ధిక, రాజకీయ, సామాజిక సామ్రాజ్యపు ఆగడాలు అంతటితో ఆగాయా?

ఖమ్మంలో విశాలమైన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం అవసరమే! దాన్ని ఎవరూ కాదనరు. సూర్యాపేటలో వలె స్థానిక బస్ సర్వీసుల  కోసం పాత బస్ స్టాండ్ ని కొనసాగనిస్తే, వందలాది గ్రామాలకు చెందిన, లక్షల  ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేది. ఈ ఎర్ర ఆర్ధిక సామ్రాజ్యపు విషపు కళ్ళు ఖమ్మం నడిబొడ్డున గల మూడెకరాల పాత బస్ స్టాండ్ స్థలంపై పడ్డాయి. ఆ స్థల కబ్జాకై వ్యూహ రచనచేసి, ప్రజల కళ్ళు కప్పేందుకు ప్రస్తుతానికి మూసి వేయించారు. కొత్త బస్ స్టాండ్ నిర్మాణంలో కుంభకోణం రెండు నెలలు తిరక్కుండానే బయట పడింది. ప్రశ్నిస్తే ఏమైనదో ఖమ్మం పౌర సమాజానికి తెల్సిందే! రైతు బజార్ వంటి స్థలాల కబ్జా కై కూడా దిగజారారు.

చీమలు చేసిన పుట్టల్ని పాములు కబళించినట్లు నేడు దేశం, రాష్ట్రాల్లో ఎల్లెడలా భూకబ్జాల దందాలు తెల్సిందే! ఐతే ఖమ్మం ప్రత్యేకత ఏమంటే  చీమల పుట్టల్ని కబళించే పాముల్లో ఎర్రదొరలు గణనీయంగా ఉండటం! ఎర్రరంగులో కార్పొరేట్ రాబందులకి ఖమ్మం ఓ కేంద్రం! తమ భూముల్ని రైతాంగానికి పంపిణీ చేసిన సర్వదేవభట్ల, మంచికంటి, చిర్రావూరి వంటి కమ్యూనిస్టు త్యాగధనుల నడిచిన నేల పై పువ్వాడ సామ్రాజ్యం వెలిసింది. ఆ ఎర్రరంగు సామ్రాజ్యపు ఉక్కుపాదం క్రింద తొక్కిసలాటలో బలై పోతున్న వారెందరో! మరీ ముఖ్యంగా మంత్రి పదవి వచ్చాక గత మూడేళ్లలో పువ్వాడ సామ్రాజ్యాన్ని ప్రశ్నించిన విమర్శకుల్ని రాజ్యం అండతో అక్రమ కేసులతో శంకరగిరి మన్యాలు పట్టిస్తున్న స్థితి ఉంది. అలా బలైన వారిలో సాయి గణేష్ ఒకరు. ఆయన ఏ జండా ధరించాడో ముఖ్యం కాదు. ఏ ఎజెండాని ప్రశ్నించాడో ముఖ్యం!

పువ్వాడ సామ్రాజ్యం చేతుల్లో బలైన వారిలో సాయి గణేష్ మొదటి వాడు కాదు. చివరి వాడు కూడా కాదు. ఆయనలా ప్రాణం తీసుకోకుండానే చచ్చిన శవాల్లా బ్రతికే వాళ్ళు ఇంకా ఎందరో!  సిద్ధాంతపరంగా, రాజకీయంగా ఎర్రజెండా ఏ చెమట జీవుల పక్షాన నిలవాలో, ఆ ఆశయ మార్గంలో ఖమ్మంలో అది ప్రయాణం చేస్తోందా? ఇది  ఖమ్మం ప్రాంత ప్రజల్లోని ఓ సందేహం! ఆత్మహత్య పై సకాలంలో, సక్రమంగా వామపక్షాలు  స్పందించి, ఉద్యమ కార్యాచరణ చేపట్టివుంటే బీజేపీకి ఈ అవకాశం లభించేదా? ఇది సందేహం! వాటికి ఖమ్మం వామపక్షాలు ఏ సమీక్ష చేసుకుంటాయో!

Kishan pays homage to deceased BJP activist
సాయిగణేశ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బాధిత ప్రజల పక్షాన ఫాసిస్టు రాజకీయ శక్తులు కన్నీళ్లు కార్చడానికి నిత్య కాపలా కాస్తాయి. జర్మనీ లో నాజీలు బాధిత ప్రజల పక్షాన మొసలి కన్నీళ్లని ఆధారం చేసుకుని తొలి దశలో బలపడ్డ చరిత్ర తెలియనిది కాదు. అట్టి ఫాసిస్టు రాజకీయ శక్తులకి ఆ అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండటం శ్రామికవర్గ రాజకీయ శక్తుల కర్తవ్యం! నయా ఎర్ర సంపన్న కార్పొరేట్ సామ్రాజ్యం పై వర్గ పోరాటాలు చేపట్టే రాజకీయ సువర్ణావకాశంకై ఎదురు చూడాల్సిన వామపక్షాలు అలాంటి కర్తవ్యాన్ని విస్మరిస్తే, దేశ రాజకీయ వ్యవస్థలో ఫాసిస్టు రాజకీయ శక్తులు బలపడటం సహజమే! సాయి గణేష్ ఆత్మహత్య ఒక రాజకీయ గుణపాఠం కావాలి. మార్చుకోకపోతే, రాజకీయ సహజ మరణం తప్పదు. చరిత్ర గమన సూత్రాల్ని అర్ధం చేసుకుని   తదనుగుణంగా తగిన కర్తవ్యాల్ని సకాలంలో చేపడితే, చరిత్ర నిర్మాణం లో భాగమౌతారు. లేనిచో చరిత్ర రధచక్రాల క్రింద పడి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో నలిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరో శపిస్తే జరిగేది కాదు. తమను తాము రాజకీయ ఆత్మహత్య చేసుకోవడం! సాయి గణేష్ ఆత్మహత్య కేవలం వ్యక్తిగతమైనదిగా వదిలి వేస్తే, అది వామపక్షాల రాజకీయ ఆత్మహత్యకు దారితీసి, సహజమరణం చెందే పరిస్థితి వస్తుంది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పై దుస్థితి రాకూడదంటే, సమగ్ర సమీక్షద్వారా కొత్త రాజకీయ దిశానిర్దేశంతో వర్గ పోరాటాలతో పాటు సామాజిక పోరాటాల్ని పరస్పర సమన్వయంతో చేపట్టి పురోగమించాల్సి ఉంది. ముఖ్యంగా కొత్తగా మంత్రి సామాజిక ఆయుధాన్ని కూడా ధరించాక, ఆ గజ్జి కి దూరంగా ఉన్నామని ఖమ్మం ప్రజల ఎదుట ఖమ్మం వామపక్షాలు నిరూపించుకునే నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి. ఈ సామాజిక కోణంలో  ఖమ్మం వామపక్షాలపై ఖమ్మం ప్రాంత ప్రజల మనస్సుల్లో ఇప్పటికే ఇలాంటి అభిప్రాయాలు బలంగానే వున్నాయి. ఆ ప్రజల మనస్సులో సత్యం ఎంత ఉందో, అసత్యం ఎంత ఉందో మరొమాట! అది అంతిమంగా ఖమ్మం పౌర సమాజం మాత్రమే తీర్పు చెప్పగలిగేది.

Amit Shah Phone Call to Khammam BJP Activist Sai Ganesh Family | ఖమ్మం  బీజేపీ కార్యకర్త ఆత్మహత్యపై అమిత్ షా సీరియస్! తెలంగాణ News in Telugu
సాయిగణేశ్ కుటుంబాన్ని పరామర్శిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా టెలిఫోన్

తమ రాజకీయ తప్పుల దిద్దుబాటుకై కొన్నిసార్లు వామపక్షాలకు చరిత్ర సువర్ణావకాశాల్ని కూడా కల్పిస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకున్న వారి కళ్ళు తెరిపించడానికి చరిత్ర అవకాశాల్ని కల్పిస్తుంది. చెవులు మూసుకున్న వారికి వినిపించడానికి అది గంట కొడుతుంది. దీర్ఘ, కుంభ నిద్రపోయిన వారిని లేపడానికి అది  అంకుశంతో పొడుస్తుంది. అట్టి సదవకాశాన్ని సాయి గణేష్ ఆత్మహత్య ద్వారా ఖమ్మం వామపక్ష శక్తులకు   చరిత్ర కల్పించింది. ఆ సావకాశాన్ని వామపక్ష శక్తులు సద్వినియోగం చేసుకుంటాయో, లేదా చేజార్చుకుంటాయో వాటి ఇష్టమే! తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు వారికి సంపూర్ణ స్థాయిలో వుంది. వారి నిర్ణయాన్ని బట్టి వారిపట్ల తామెలా ఉండాలో నిర్ణయించుకునే సంపూర్ణ ప్రజాస్వామిక హక్కు ఖమ్మం ప్రాంత ప్రజలకి కూడా ఉంటుంది. ఖమ్మం వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచి చూద్దాం.

(ఈ వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయితవి.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles