Sunday, December 22, 2024

ఖలిస్థాన్ వాదం ఖతం కాలేదా?

  • విదేశాలలో వేర్పాటువాదుల ధ్వంసరచన
  • పాకిస్తాన్ నుంచి డ్రోన్ లో వచ్చిన ఆయుధాలు
  • నలుగురూ పంజాబ్ కి చెందిన యువకులే

హరియాణా పోలీసులు గురువారం ఉదయం నలుగురు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.  వారిని విచారించిన సందర్భంలో వెల్లడైన విషయాలు విస్తు గొలుపుతున్నాయి. తెలంగాణలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా అందిన ఆయుధాలను ఆదిలాబాద్ కు చేరవేసే క్రమంలో ఈ నలుగురు ముష్కరులు దొరికిపోయారు. ఈ దుశ్చర్యకు ఆదిలాబాద్ ను ఎంచుకోవడం కూడా వారి వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం, దిల్లీకి వెళ్ళడానికి పలు దారులు ఉండి ఉండడం మొదలైనవి కారణాలుగా చెబుతున్నారు. హరియాణా పోలీసులకు దొరికిన నలుగురు కూడా పంజాబ్ కు చెందిన యువకులుగానే పోలీసులు గుర్తించారు.  పాకిస్థాన్ కు చెందిన ఖలిస్థాన్ ఉగ్రవాది హరివిందర్ సింగ్ రిండా ఆదేశాల మేరకు,  అతని కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ కు ప్రణాళిక జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులకు చిక్కిన నలుగురు ముష్కరులు – ఉగ్రవాది హరివిందర్ సింగ్ మధ్య ఎంతోకాలం నుంచి సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచే ఆయుధాలు ఇక్కడకు చేరాయని ఏజెన్సీలు నమ్ముతున్నాయి.

Also read: ఐరోపాలో మోదీ పర్యటన

నలుగురూ ఖలిస్థాన్ వాదులే

దొరికిన నలుగురు కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదులుగానే అధికారులు భావిస్తున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్రలు పన్నుతున్నారని అర్థం చేసుకోవాలి. ఖలిస్థాన్ ఉద్యమం ముగిసిపోయిన అధ్యాయంగా భావించకూడదని తాజా సంఘటన హెచ్చరిస్తోంది ఖలిస్థాన్ ఉగ్రవాదం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి తీరాలి. ఈ ఉద్యమం లిఖించిన రక్తచరిత్ర ఎన్నటికీ మరువజాలం. సిక్కులతో పాటు హిందువులు తదితరులు కూడా కొన్ని వందలమంది బలైపోయారు.సాక్షాత్తు దేశ ప్రధాని ఇందిరాగాంధీనే పోగొట్టుకున్నాం. సొంత రక్షకభటులే ఆమెను అతిఘోరంగా కాల్చిచంపారు. అంతకుముందు జరిగిన ఘోరకలి, అమృతసర్ దుశ్చర్యలు, ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిర హత్యానంతరం సిక్కుల ఊచకోత మొదలైనవి పచ్చినెత్తురు సాక్షిగా దేశవాసుల స్మృతిపథంలో నిలిచే ఉన్నాయి. సిక్కులందరికీ ప్రత్యేకమైన రాజ్యం కావాలని మొదలైన ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. కొన్నాళ్ళుగా మసకేసినట్లు కనిపించినా ఆ వేడి అలాగే ఉందని భావించాల్సి వస్తోంది. మన దేశంలో వాడి తగ్గినా, విదేశాలలో ఇంకా రగులుతూనే ఉంది. ఖలిస్థాన్ నినాదాన్ని బలపరచే, నడిపించే వ్యవస్థలు ఇంకా బలహీనం కాలేదని అర్థం చేసుకోవాలి. వివిధ గ్రూప్స్ సజీవంగానే ఉన్నాయని అంతర్జాతీయ మీడియాలో కూడా పలుమార్లు కథనాలు వచ్చాయి.పాకిస్థాన్ తో పాటు కెనడా, యునైటెడ్ స్టేట్స్,యూకె మొదలైన దేశాలలో ‘ఖలిస్థాన్’ ప్రతిధ్వనిస్తూనే ఉంది. కెనడాలో ఎక్కువమంది మద్దతుదార్లు ఉన్నారని వినిపిస్తోంది.

Also read: లంకలో అఖిలపక్ష ప్రభుత్వం

స్వాతంత్ర్యం రాకముందే వేర్పాటువాదానికి బీజాలు

స్వాతంత్య్రం రాకమునుపే, బ్రిటిష్ కాలంలోనే 1940ల్లో ఈ వేర్పాటువాద ఉద్యమానికి బీజాలు పడినట్లు చరిత్ర చెబుతోంది. 1970-80 ప్రాంతంలో రాజుకున్న ఈ ఉద్యమం 1980ల్లో అంబరాన్ని అంటింది. 1990ల్లో సద్దుమణిగింది. సద్దుమణిగినట్లు కనిపించినా పొగమాటున పొయ్యి అలాగే ఉంది. ఊదేవారి సంఖ్య, నిప్పు సామాగ్రి,గాలివాటం జతచేరితే మళ్ళీ భగ్గుమనే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి దాకా దేశరాజధాని, సరిహద్దుల్లో జరిగిన భీకర రైతు ఉద్యమం వెనకాల ఖలిస్థాన్ ఉగ్రవాదులు, మద్దతుదారులు ఉన్నారని బిజెపి పదే పదే నినదించింది. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, హరియాణాలో జరిగిన తాజా సంఘటన అటువంటి అనుమానాలను రేకెత్తిస్తోంది. ఖలిస్థాన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండ సంపూర్ణంగా ఉందనే ప్రచారం ఎట్లాగూ ఉంది.  ప్రస్తుతం పంజాబ్ లో పరిస్థితులు గతంలో కంటే భిన్నంగా ఉన్నాయి. సిక్కుల మధ్య ఐక్యత కూడా దెబ్బతింది. ఇప్పటి వరకూ గడచిన చరిత్రను బట్టి చూస్తే ఈ ఉద్యమం పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. ఒకప్పటి పంజాబ్ పోలీస్ బాస్ కెపీఎస్ గిల్ వంటివారు నడిపిన పోలీసింగ్ ఈ ఉద్యమ తీవ్రతను గణనీయంగా తగ్గించింది.ఈ ఉద్యమానికి స్ఫూర్తిని కలిగించగల నేతలు కూడా ప్రస్తుతం పెద్దగా ఎవ్వరూ లేరు. పంజాబ్ కు చెందిన సిక్కు వర్గాల నుంచి కూడా ఉద్యమకారుల పట్ల విశ్వాసం, గౌరవం, సానుభూతి కరిగిపోయాయనే చెప్పాలి. సిక్కులలోని జాట్ల మధ్య కూడా ఐక్యత లేదన్నది మరో వాదన. రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలతో వారు రకరకాలుగా విడిపోయారని చెబుతారు. ప్రభుత్వ ఏజెన్సీల నిఘా కూడా గట్టిగా ఉంది.రక్షణా వలయం కూడా బలంగా ఉంది. ఇటువంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం భారత్ లో ‘ఖలిస్థాన్ ఉద్యమం’ ఎక్కడా కనిపించడం లేదు. విదేశాల్లో మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం హరియాణాలో వెలుగులోకి వచ్చిన విషయాలతో పాటు, నిఘా వర్గాల సమాచారాన్ని క్రొడీకరించుకుంటూ,  విదేశాలలోని కదలికలపై పెద్ద నజర్ వేయాల్సిన అవసరం ఉంది.ఉగ్రవాదం ఉగ్రరూపం దాల్చకుండా, కొత్తనెత్తురు చిందకుండా, చూసుకోవాల్సిన, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పాలకులదే.

Also read: ప్రజల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న మరో ప్రపంచయుద్ధం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles