ఏడవ రోజు పాశురంలో కేశి రాక్షస సంహారం కథ ప్రస్తావిస్తారు గోదమ్మ వారు. గుఱ్ఱం రూపం లో ఉన్న కేశి అనే రాక్షసున్ని సంహరించినవాడు.
కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతులు పెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. కేశి రాక్షసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఏ ఆయుధమూ ప్రయోగించలేదు. కేవలం చేయిని ఉబ్బిస్తూపోయాడు. ఉబ్బిన చేయి శరీరంలో ఇమడక, ఆ పరిమాణాన్ని భరించలేక ఆ అశ్వరూపాసురుడి నోరు పనిచేయదు.
Also read: తిరుప్పావై-4: అది జ్ఞాన వర్షం, ఆమేఘం ఆచార్యుడు
స్వార్థంతో మింగడానికి తప్ప,అజ్ఞానంతో నోరుమూసుకుని ఉండి, మూర్ఖంగా తెరవడానికి ఇష్టపడని, స్వామిని నుతించని వారి నోళ్లను తెరిపిస్తాడు.
కేశవుడంటే క అనే పరబ్రహ్మ స్వరూపం, అ అంటే విష్ణు స్వరూపం, ఈశ అంటే రుద్ర రూపం. త్రిమూర్తుల సమ్మేళనం కేశవుడు. అయిదు ఇంద్రియాలు శరీరం అనే రథానికి కట్టిన గుఱ్ఱాలు మనను అయిదు వైపులా లాగుతుంటాయి. మనస్సు అనే కళ్లాన్ని బుద్ధి అనే సారథి చేతులో పెట్టగలిగితే రథం సక్రమంగా సాగుతుంది. లేకపోతే ముక్కలైపోతుందని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఇంద్రియాలను చంపడు కాని అదుపులో పెట్టుకుని మారేట్టు చేయడం గురించి భగవంతుడు వివరిస్తాడు.
చాణూర ముష్టికుల వధ
ఇంకా కౌమారం దాటక ముందే, బలరామ కృష్ణులు భయంకరులైన మల్ల విశారదులు చాణూర ముష్టికులను ఎదుర్కొని ఓడించారు.చాణూరుడు క్రోధానికి కోపానికి పాపానికి ప్రతీక. కామం కోపం పోవాలంటే గురువు అనుగ్రహం కావాలి. చాణూర ముష్టికులను అవలీలగా సంహరించిన వీరులు. మదజలం స్రవించే కువలయాపీడము అనే మత్తగజంతో పోరాడి, మావటిని చంపి దాని రెండు దంతములు పెఱికి భుజాన మోస్తూ రామ కృష్ణులిద్దరూ కంసుని సభలో ప్రవేశించి మల్ల వీరులను మట్టి కరిపిస్తారు. మంచెల మీద ఉన్న రాజులు ఆశ్చర్యభయోపేతులవుతూ ఉంటే కంసుని సింహాసనం దగ్గరికి వెళ్లి, ఒక్క ఉదుటున కిందపడవేసి పిడి గుద్దులతో చంపేసిన కృష్ణుడు అప్పడికి ఇంకా యువకుడుకూడా కాదు. నూనుగు మీసాల కౌమార దశస్కుడు. ముష్టికాసురుడు అంటే ఎంత తిన్నా ఇంకా కావాలనే వాడు కామములు తీరని వాడు. చాణూరుడు క్రోధానికి ప్రతీక. కామక్రోధాలను జయించాలి. అందుకుభగవంతుడు ఆచార్యుని ద్వారా అనుగ్రహించాలి.
Also read: గోదా గోవింద గీతం తిరుప్పావై 6
మనకు అద్భుతాలగా కనిపించే ఈ లీలలన్నీ శ్రీకృష్ణుడికి గుర్తుండవు. తలచుకోడు. మనమే ఆ భయానక సంఘటనలు తలచి భీతిల్లి శ్రీకృష్ణలీలలు గా పాడి, మంగళాశాసనాలు చేస్తుంటాము.
రాముని మునిభక్తి
దండకారణ్యంలో మునులంతా శ్రీ రాముడి వద్దకు వచ్చి అడవిలో రాక్షసుల బాధల నుంచి రక్షించమని కోరుతారు. అపుడు… అయ్యో నేను వచ్చి మీతో మాట్లాడాల్సింది పోయి మీరే నావద్దకు వచ్చేదాకా ఊరుకున్నానే అని బాధపడ్డాడు. భక్తులు ఇబ్బంది పడడం ఆయన ఓర్చుకోలేడు. తనకు శరణాగతి చేసిన భరతుడి ప్రార్థన నెరవేర్చలేకపోయినందుకు బాధపడ్డాడు. తనకోసం వచ్చిన గుహుని చూసి నాకోసం నడచి వచ్చావా, ఇంతకన్న ఏం చేయాలి అని రాముడు ఆలింగనం చేసుకున్నాడు. తనకంటూ సుఖదుఃఖాలు లేని నిర్వికారుడే అయినా ఇతరులకోసం ఆనందాన్ని ఆవేదనను పొందడం దోషం కాదు. ఇతరుల బాధలు చూసి బాధపడడం ఏ విధంగా సాధ్యమవుతుంది. కనుక త్వరగా బయలుదేరి వెళ్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో వెళితే తప్పక ఆర్తితో ఆదరిస్తాడాయన అన్నారామె. ఈ పాశురంలో హస్తగిరి నాథుడైన దేవాదిదేవుడు, అంటే కాంచీపురం వరదరాజస్వామిని కీర్తిస్తారు.
Also read: తిరుప్పావై5: చీకట్లు తొలగించు, కట్లు తెంచు శ్రీకృష్ణ ధ్యానము
జీయర్ చెప్పిన యాజ్ఞవల్క్యుడి కథ
యాజ్ఞవల్క్యుడు మహానుభావుడు, జ్ఞాని, జనక చక్రవర్తి గురువు. మైత్రేయి కాత్యాయని అని యనకు ఇద్దరు భార్యలు. ఆ తపస్వి వానప్రస్థాశ్రమ స్వీకారం కోసం తన ఆస్తిని ఇద్దరికీ పంచి ఇచ్చినాడు. కాత్యాయని సంపదలు తీసుకుని తృప్తి పడింది. ఆస్తి అంతా మాకిస్తున్నావంటే దానికన్న విలువైనదేదో పొందడానికి నీవు వెళ్తున్నావు. అదినాకు కావాలని మైత్రేయి వెంట బయలుదేరింది. ఆత్మజ్ఞానం కోసంబయలు దేరాను . అది నీకూ కావాలంటే ‘‘ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః మైత్రేయీ’’. లోపల ఉండే ఆత్మ ను స్పష్టంగా దృష్టవ్యః చూడాలి, చూడగలగాలంటే, దాని గురించి ముందు శ్రోతవ్యః వినాలి, వినాలంటే దాని గురించి పదేపదే ఆలోచించాలి మంతవ్యః, తరువాత దాని గురించే ఊహిస్తూ ఉండాలి నిధిధ్యసితవ్యః. అని జీయర్ చెప్పారు. ఈ విషయంలో పెద్దల సూచనలు స్వీకరించాలనే అంశాలను తిరుప్పావైలో చెప్పారు. పక్షుల అరుపులతో శ్రవణం మొదలు పెట్టి, శంఖ ధ్వని, పెరుగు చిలికే ధ్వని ఊహించి, తరువాత జ్ఞానుల సహవాసంతో మునుల వలె స్మరించి, వారి ఉపదేశం పొందితే ద్రష్టవ్యః దాకా వెళ్లగలుగుతాం. 6వ పాటలో కేట్టిలయో (శ్రోత్రవ్యః), 7వపాట లో కేట్టే కిడిత్తియో మంతవ్యః దాటి 8వ పాటలో నిధి ధ్యాసితవ్యః ను చేరుతున్నారు గోద.
ఇంతటి అద్భుతమైన భావాలను, పోలికలను, చర్చను, భగవద్గుణ విశ్లేషణాలను చిన్న పాశురంలో కూర్చడం విశేషం. ఆచార్యుడు శిష్యుడిని అంగీకరించే వరకే చీకటి, ఆ తరువాత అంతా వెలుగే అని సందేశం. భగవంతుడితో నీవాడినని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడని ఈ ఏడవ పాశురం సందేశం.