చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఝార్ఖండ్ రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారు.
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరేన్ తో కలిసి వారి అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందజేయనున్నారు.
చైనాతో జరిగిన ఘర్షణలో మన రాష్ట్రానికే చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నది. అదే సందర్భంగా అమరులైన 19 మంది ఇతర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆర్థిక సహాయం అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారు.