ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో చర్చించారు. దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. సమావేశం అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. రేగ కాంతారావు మాట్లాడుతూ 5న సీఎం కేసీఆర్ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారన్నారు. దేశ ప్రజలు, యువతా సీఎం కేసీఆర్ రాక కోసం చూస్తున్నారని, కొన్ని పార్టీలు విలీనం కావడంతో పాటు మరికొన్ని పార్టీలు కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నింటిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ వివరిస్తారన్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశమై.. పార్టీలో అందరితో చర్చించి తీర్మానం పెట్టనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేస్తారన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు.
దేశప్రజల తలరాతలు మార్చే గొప్ప నిర్ణయం
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ మేధస్సును భారత ప్రజలంతా కోరుకుంటున్నారని, కనుకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ నెల 5న గొప్ప నిర్ణయాన్ని ప్రకటించనున్నారన్నారు. భారతదేశ ప్రజల తలరాతను మార్చే గొప్ప నిర్ణయం దసరా రోజు ప్రకటిస్తారన్నారు. సమావేశంలో భారతదేశ రాజకీయాల్లోకి రావాలని తామును సీఎంను కోరినట్లు కవిత తెలిపారు. తెలంగాణ బిడ్డలు అందుకుంటున్న అభివృద్ధి ఫలాలను.. యావత్ దేశ ప్రజలకు అందించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు పేర్కొన్నారు. బీజేపీ మొండి వైఖరి కారణంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదని, రాష్ట్ర యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు.