వ్యాసకర్త: సాదిక్, జర్నలిస్టు
కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తన లక్ష్య సాధన దిశగా ముందుకు అడుగుల వేగం పెంచారు. భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కలుసుకున్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌తోనూ చర్చలు జరుపనున్నారు. అయితే, దేశంలో కాంగ్రెసేతర, బిజెపియేతర సమాఖ్య కూటమి రావాలన్నిది కేసీఆర్ గట్టి నిర్ణయం. ఈ కూటమి ఏర్పాటుకు కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన మరింత ప్రధాన్యతను సంతరించుకుంటోంది. ఇదే అంశంపై కార్యాచరణ 2018 లోనే ప్రారభించారని చేప్పవచ్చు. ఆయన ఆ పనిలో దేశవ్యాప్తంగా పర్యటించారు. అప్పుడు కేసీఆర్ తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ (నాడు ప్రతిపక్ష నాయకుడు), బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేతలు అఖిలేశ్ యాదవలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత రాష్ట్రంలోనూ, దేశంలోనూ జరిగిన రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా అద్యయనం చేస్తూన్నారు కేసీఆర్. అందులో భాగంగానే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి అధినేత శరద్ పవార్ తోనూ సమావేశం జరిగింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో శరద్ పవార్ గట్టి మద్దతు అందించిన స్నేహం కేసీఆర్ అలోచనకు మరింత బలం చేకుర్చుస్తూందనే నమ్మకం ఉంది. కనుక ఆ అనుబంధాన్ని కేసీఆర్ వాడుకున్నారు. అంతేకాక నాడు తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపన వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ వరుస సమావేశాలు ఊపందుకోబోతున్నయని అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ భాగస్వామ్యంగాని, వెలుపలి నుంచి మద్దతుగాని లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమా, కాదా అనే అంశంపై తాజాగా దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది.
ప్రాంతీయ పార్టీలకు కలిసి 272 స్థానాలు వస్తాయా?
ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో 543 స్థానాలకుగాను కనీసం 272 స్థానాలు ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలతో కూడిన కూటమి ఏదైనా ఈ 272 మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలదా ? అన్నదే ప్రధాన ప్రశ్న వస్తోంది. బీజేపీ లేదా కాంగ్రెస్ గెలిచిన స్థానాల మొత్తం 272కు లోపు ఉండి, కనీస మెజారిటీ లేని పక్షంలో మిగతా పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పడగలదు అని నమ్మకం కూడ ఉంది. ఇక గతంలో విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య మంత్రులు జగన్, కేసీఆర్ హాజరు కాలేదు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మంచిదే, కానీ కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా అవరోధాలున్నాయని వారి అభిప్రాయం. ఫెడరల్ ఫ్రంట్ కి ఎవరు నాయకత్వం వహిస్తారు..? ఎజెండా ఏమిటి? భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం ఎలా? సుస్థిర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించడం ఎలా? ఎన్నికల తర్వాత కూడా భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉండగలగడం లాంటి అంశాల్లో కూటమికి సవాళ్లు ఎదురు కానున్నవి.
నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం
అందులో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ, బీఎస్‌పీ తదితర పార్టీల మధ్య రాజకీయ, విధానాల్లో తేడాలు ఉన్నవి. ఇవి ‘కూటమి’కి అడ్డంకి కావచ్చు అనేది కూడ చర్చ ఉంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, వాస్తవిక దృష్టితో చూస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ భాగస్వామ్యంగాని, మద్దతుగాని లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయడం సాధ్యంకాదన్న విశ్లేషణ కూడ ఉంది. నేషనల్ ఫ్రంట్(1989-91), యునైటెడ్ ఫ్రంట్(1996-98) ప్రభుత్వాలు బీజేపీ లేదా కాంగ్రెస్ వెలుపలి మద్దతుతోనే ఏర్పడిన విషయం తెలిసిందే. బీజేపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదో లోక్‌సభ(1989) నుంచి 15వ లోక్‌సభ(2009) వరకు ఏ పార్టీకీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాలేదు. తొమ్మిదో లోక్‌సభ, 11వ లోక్‌సభల కాలంలో మాత్రమే కాంగ్రెస్ లేదా బీజేపీ భాగస్వామ్యం లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా బీజేపీగాని, కాంగ్రెస్‌గాని ఆయా కూటములకు వెలుపలి నుంచి మద్దతు అందించింది. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ హయాంలో విపి సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రులుగా పని చేశారు.1989 నవంబరులో నేషనల్ ఫ్రంట్ సమావేశానికి ముందు వీపీ సింగ్, ఎన్‌టీఆర్, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి పాల్గొన్నారు. 1989 ఎన్నికల్లో 197 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 143 సీట్లతో జనతాదళ్, 85 సీట్లతో బీజేపీ, 33 సీట్లతో సీపీఎం, 12 సీట్లతో సీపీఐ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జనతాదళ్ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా 1989 డిసెంబరులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ, వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతు అందించాయి.1980 ఏప్రిల్లో జనతా పార్టీ నుంచి వేరుపడి బీజేపీ ఏర్పాటైన తర్వాత, ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ లభించని తరుణంలో ఏర్పడ్డ తొలి సంకీర్ణ ప్రభుత్వం వీపీ సింగ్‌దే. వామపక్షాలు, బీజేపీ మద్దతు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఇదే. నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ మూలస్తంభం. ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో వీపీ సింగ్ 1990 నవంబరులో లోక్‌సభలో బలపరీక్షలో ఓడిపోయి రాజీనామా చేశారు.
అనంతరం జనతాదళ్ నాయకుడు చంద్ర శేఖర్ ఆ పార్టీ నుంచి వేరుపడి, అదే పార్టీలోని మరికొందరు నాయకులతో కలిసి సమాజ్‌వాదీ జనతా పార్టీ(రాష్ట్రీయ) పెట్టారు. నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. చంద్ర శేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు అందించింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వామపక్షాలు చంద్రశేఖర్ ప్రభుత్వానికి కూడా మద్దతు అందించాయి.తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. చంద్రశేఖర్ పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదో లోక్‌సభ ఎన్నికలు జరిగిన దాదాపు రెండేళ్లకే మళ్లీ 1991లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి.
యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు
1991 లో రాజీవ్ గాంధీ మరణానంతరం ఎన్నికల్లో 232 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీవీ నరసింహారావు నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. పీవీ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగింది. అయితే, 1996 ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 13 రోజుల పాలన అనంతరం పడిపోయింది. కనీస మెజారిటీకి అవసరమైనంత మద్దతు లేకపోవడంతో వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ ప్రధానిగా బాధ్యతల తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సైతం కాంగ్రెస్ పార్టీ వెలుపల నుంచి మద్దతు ఇచ్చింది. కానీ లోక్ సభ బలపరీక్షలో ఓడిపోవడంతో దేవెగౌడ 1997 ఏప్రిల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
జనతాదళ్, తెలుగుదేశం పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, అస్సాం గణ పరిషత్, ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), తమిళ మనిల కాంగ్రెస్(జీకే మూపనార్), నేషనల్ కాన్ఫరెన్స్, ఇతర పార్టీలతో ఈ కూటమి ఏర్పాటైంది. జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా 1996 జూన్‌లో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ మినహా ఇతర వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. సీపీఐ కూడా ప్రభుత్వంలో చేరింది. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరితో విభేదాలు తీవ్రమవడం, తదనంతర పరిణామాలతో దేవెగౌడ బలపరీక్షను ఎదుర్కున్నారు. అందులో ఓడిపోవడంతో ఆయన 1997 ఏప్రిల్లో పదవికి రాజీనామా చేశారు. దేవెగౌడ స్థానంలో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో 1997 నవంబరులో గుజ్రాల్ కూడా రాజీనామా చేశారు.
బేరసారాలలో బలం కోసమేనా?
బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనని, కేసీఆర్ నమ్రతతో, ఓపిగ్గా వ్యవహరిస్తే ఇది సాకారమయ్యే అవకాశముందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇతర జాతీయ పార్టీలు అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని, అన్నీ కలిస్తే ఇది అసాధ్యమేమీ కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకొనేందుకు, ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బేరసారాలాడే శక్తిని ఎక్కువగా కలిగి ఉండేందుకే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం గురించి ఆయా ప్రాంతీయ పార్టీలు మాట్లాడుతున్నాయన్న వాదన కూడా ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు గరిష్ఠంగా చెరి 200లోపు సీట్లు మాత్రమే వస్తే ఈ కూటమే కీలకం కాబోతున్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రాథమ్యాలను, కార్యాచరణను నిర్ణయించడంలో ‘కూటమి’ నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నది. బీజేపీ కూటమి లేదా కాంగ్రెస్ కూటమితో బేరసారాలు సాగించగల స్థాయిలో ‘సమాఖ్య కూటమి’ సంఖ్యాబలం ఉండి, భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
ఇప్పుడు ఫెడరల్ ఫ్రంటా?
బీజేపీ, కాంగ్రెస్‌లపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యాసాధ్యాల చర్చను పక్కనబెడితే, ఫెడరల్ ఫ్రంట్ గణనీయస్థాయిలో సంఖ్యాబలాన్ని సాధిస్తే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడవచ్చు .ప్రస్తుత బిజెపి ప్రభుత్వం వలే రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించకుండా కేంద్రాన్ని కట్టడి చేయొచ్చు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను పలువురు మేధావులు స్వాగతిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామనడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ సైద్ధాంతికంగా చూస్తే మంచిదే. దేశంలోని వ్యవస్థల బలోపేతానికి ఇది దోహదం చేయగలదు. సహకార సమాఖ్య నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. అలాంటి బీజేపీని వ్యతిరేకించకుండా, ఆ పార్టీపై నిర్దిష్టమైన వైఖరి ప్రకటించకుండా, బీజేపీ, కాంగ్రెస్‌లను ఒకే గాట కట్టి, ఆ రెండు జాతీయ పార్టీలకూ ఫెడరల్ ఫ్రంట్ సమదూరం అనడం అర్థరహితమే కాదు, భారత సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యానికి విరుద్ధమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తృతీయ కూటమికి అవకాశాలు పరిమితమనీ, ఈ పరిణామాల వల్ల బీజేపీకే మేలు కలుగుతుందన్న వాదనా ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ సీట్లు కలిపి చూస్తే ఎప్పుడైనా 272 కన్నా తగ్గాయా? బీజేపీ ఆవిర్భావం తర్వాతి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు వచ్చిన సీట్లను కలిపి చూస్తే అన్నిసార్లు 272 పైనే ఉన్నాయి. 1989, 1996లలో కూడా ఈ రెండు పార్టీలకు కలిపి 272 పైనే సీట్లు వచ్చినప్పటికీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ఆధ్వర్యంలో తృతీయ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ అప్పుడు బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ కూటములకు బయటి నుంచి మద్దతు అందించడంతోనే ఇది సాధ్యమైంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య తేడాలను రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. నాడు బలంగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు బాగా బలహీనపడ్డాయనీ, ఇదో ముఖ్యమైన అంశమనీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్, జగన్ ఒకటేనా?
బీజేపీ పట్ల అసంతృప్తి, ఆగ్రహం ఉన్న పార్టీల ఉమ్మడి లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని, అయితే బీజేపీకి వ్యతిరేకంగా రెండు పక్షాలు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయన్న చర్చలు సాగుతున్నవి. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పేరుతో కాంగ్రెస్‌ను ఫెడరల్ ఫ్రంట్ కలుపుకొని వెళ్లడం లేదు.డీఎంకే, టీడీపీ లాంటి పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్తున్నవి. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర అంశం కూడా కనిపిస్తోంది. బీజేపీని గద్దె దించాలనుకున్న ప్రస్తుత తరుణంలో చాలా పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడుతున్నవి. గతంలో అత్యధిక సందర్భాల్లో కాంగ్రెస్‌ను గద్దె దించాలనుకున్నప్పుడు బీజేపీని కలుపుకొని పోవడానికి చాలా పార్టీలు మొగ్గు చూపలేకపోయాయి. మరో వైపు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరి తేలాల్సి ఉంది. కేసీఆర్ ఇప్పటే జగన్ మోహన్ రెడ్డితో స్నేహపూర్వక వైఖరే కొనసాగిస్తూన్నారు. నదీజలలా విషయంలో దాదాపు సయోధ్య కుదిరిందనే చేప్పాలి. కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే సంగమేశ్వరం (రాయలసీమ ఎత్తిపోతల) ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ఈ విషయంలో కేంద్ర బిజెపి వైఖరినే తప్పుపట్టారు తప్పా జగన్ మోహన్ రెడ్డి వైఖరిని కేసీఆర్ తప్పుపట్టలేదు. నదిజలాలు వివిధాలు కేంద్రం పరిష్కిరించడం లేదని కేసీఆర్ అంటున్నారు. ఇలా జగన్ మోహన్ రెడ్డితో ను పక్కరాష్ట్రంతో కేసీఆర్ మిత్రవైఖరే కొనసాగిస్తూన్నారు.అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ప్రతిపాదనలతో ఏకీభవిస్తారా? ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ తో కలిసి వస్తారా? అయన వైఖరి ఏంటి? అనేది కూడా తెలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పడు ఎన్నికల ముందు ఏ పార్టీ లేదా కూటమి ఏమి చెప్పినా, ఎన్నికల ఫలితాల అనంతర పరిస్థితులు, అధికార రాజకీయాలే తదనంతర పరిణామాలను నిర్ణయిస్తాయి.