రాజకీయాల్లో అపార అనుభవం గల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు (కేసీఆర్ ) త్వరలో తన కొడుకు కె. తారక రామారావు (కేటీఆర్) ను సిఏం పీఠం పై కూర్చోబెట్టడం ఖాయమైంది. ఈ పరిణామాల్లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ పై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజానిజాలు పక్కన పెడితే రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా కేసీఆర్ వైఖరి ఉండబోతోందా? కేంద్రం లోని చాలామంది రాజకీయ నాయకుల వయసు కన్నా కేసీఆర్ వయసు చిన్నదే. ఆయన ఇప్పుడు కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టారన్న విషయానికి మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొడుకు పట్టాభిషేకానికి మాత్రమే పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఫలితాలు తెలంగాణ కు వరప్రదాయినిగా మారుతున్నాయి.
గోదావరీ, కృష్ణ జలాలను ఒడిసి పట్టుకోవడంలో కేసీఆర్ దీర్ఘ కాలిక వ్యూహాలు విమర్శకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకు ముందు చంద్రబాబు కూడా గోదావరి జలాలను హైదరబాద్ కు తరలించడం, కృష్ణా జలాలు పారిశ్రామిక అవసరాలకు హైదరాబాద్ కు రప్పించడం ఒక ఎత్తయితే, భారీ జలాశయాలు నిర్మించి వృధాగా సముద్రం పాలవుతున్న జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ మాగాణి భూములకు మళ్ళించడం కోసం అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర ముఖ్య మంత్రులను ఒప్పించి జల ముఖ్య మంత్రిగా కేంద్రం ప్రశంశల కూడా కేసీఆర్ పొందారు. అటువంటి నేపథ్యం కలిగిన కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నదనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: పద్దతి మార్చుకోండి…లేదంటే ?
ఇక రాష్ట్ర పరిణామాల్లో కేటీఆర్ ఎంతగా సమర్థుడని వంది మాగదులు పొగుడుతున్నారో వాళ్ళే ప్రతి బంధకాలుగా మారనున్నారనే వాస్తవం తండ్రి కేసీఆర్ కు తెలుసు! అయితే ఖమ్మం పర్యటనలో ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలనే మాటలు కేటీఆర్ నోటి వెంట రావడం తో రాష్ట్రం లో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టాయి. తన కంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని కేటీఆర్ తయారు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కొంత మందికి పార్టీ పదవులు ఇవ్వనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో నదీజలాల పై అధ్యయనం చేస్తున్నారని కూడా కొందరు సన్ని హితులు చెబుతున్నారు. కవితకు మంత్రి పదవి, హరీష్ కు మళ్ళీ నీటి పారుదల? కేసీఆర్ కలల పంట అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఆయన తర్వాత మళ్ళీ అంతటి అవగాహన ఉన్న వ్యక్తి హరీష్ రావు. కేసీఆర్ కేంద్రం లో మంత్రి అయితే…హరీష్ కు నీటి పారుదల మంత్రి పదవి ఇచ్చే ఆవకాశం ఉందని, ఇక కేసీఆర్ కూతురు కవితకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం ఖాయం అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈటల రాజేందర్ కు తిరిగి ఆర్థిక మంత్రి పదవి దక్కవచ్చు. ఇదిలా ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, పద్మారావు మంత్రులు అయినా ఆశ్చర్యం లేదు! మెదక్ పార్లమెంటు స్థానం నుండి కేసీఆర్ పార్లమెంట్ కు వెళ్ళనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోవడం మాత్రం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: స్వామి భక్తిలో తరిస్తున్న టీఆర్ఎస్ నేతలు