- నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం షురూ
- మసైపోతారంటూ అల్లరి చేస్తున్నవారికి హెచ్చరిక
- అబద్ధాలు చెబితే ఓడగొట్టండి
- వెయ్యికోట్లతో దళిత సాధికారత పథకం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ కుడిఎడమల డాల్ కత్తులు మెరయగ అన్నట్టు నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన పెద్ద బహిరంగసభలో వాగ్యుద్ధానికి దిగారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగనున్న సందర్భంగానూ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రైతు ధన్యవాదాల పేరుతో నిర్వహించిన సభలో కేసీఆర్ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ను నిశితంగా విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవంటూ చేసిన ప్రకటనతో నిరాశానిస్పృహలకు గురైన రేతాంగానికి ఆశకల్పించే ఉద్దేశంతో, వారి విధేయతను తిరిగి సొంతం చేసుకునే ధ్యేయంతో హాలియా సభకు రైతు ధన్యవాద సభ అని నామకరణం చేశారు.
కొత్తబిచ్చగాళ్ళు పొద్దెరగరన్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారనీ, పదవులకు అమ్ముడుపోయే కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలితే ప్రజలు హర్షించబోరనీ కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పొలంబాట కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తున్నందకు కాంగ్రెస్ ఉద్యమం చేస్తున్నదా అంటూ ప్రశ్నించారు.
Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం:
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తామనీ, నల్లగొండను నీటికుండగా మార్చుతామనీ, ఫ్లోరైడ్ వ్యాధిని తరిమికొడతామనీ కేసీఆర్ ప్రకటించారు. ఏడాదిన్నరలో ఎత్తిపోతల ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తామని చెప్పారు. ఆ విధంగా చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోమని అన్నారు.
వెయ్యి కోట్లతో దళిత సాధికార పథకం:
వెయ్యి కోట్ల రూపాయలతో దళిత సాధికారత పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అర్హులైనవారికి త్వరలో పింఛన్లూ, రేషన్ కార్డులూ లభిస్తాయనీ, సెలూన్లకోసం నాయీ బ్రాహ్మణులకు తలా లక్ష రూపాయలు చెల్లిస్తామనీ, మార్చి తర్వాత రెండు లక్షల కుటుంబాలకు గొర్రెలు మంజూరు చేస్తామని అన్నారు.
మసైపోతారు, జాగ్రత్త:
సభలో కొందరు నినాదాలు చేసిన సందర్భంలో కేసీఆర్ నిగ్రహం కోల్పోయారు. ‘మీ లాంటి కుక్కలు చాలామంది ఉంటారు. మీరు ఏమీ చేయలేరు. మీరు ఎంతమంది ఉన్నారు. మా వాళ్లు తలచుకుంటే మసైపోతారు జాగ్రత్త,’ అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు.
Also Read: ఇష్టంలేకుండానే కొనసాగుడా…?
కాంగ్రెస్, బీజేపీ పై ధ్వజం:
తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేననీ, తెలంగాణ పేరెత్తే అర్హత ఆ పార్టీకి లేదనీ కేసీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపి అంటూ కాంగ్రెస్ పార్టీని తూలనాడారు. ‘చాలామంది రాకాసులతో కొట్లాడినమనీ, ఈ గోకాసులు మా గోసి కిందకు లెక్క’ అంటూ బీజేపీని తుక్కుతుక్కుగా విమర్శించారు. దిల్లీవోడో, మరొకడో నామినేట్ చేసిన ప్రభుత్వం కాదిది. మాకు అధికారం ప్రజలిచ్చిండ్రు. పార్టీలూ, నాయకత్వాలూ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలె అంటూ ప్రతిపక్షాలకు ఘాటైన హెచ్చరిక చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు దేశంలో మరే రాష్ట్రంలోనైనా చేశారా అంటూ బీజేపీని ప్రశ్నించారు. ‘మంచిగున్నదాన్ని, మంచి చేసేటోళ్ళను, మంచి ప్రభుత్వాన్ని ప్రజలు నిలబెట్టుకోవాలె’ అని చెప్పారు. ‘నేను చెప్పే మాటల్లో ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ లో జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడగొట్టండి,’ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రైతుబంధు పథకం అమలు చేస్తుంటే కాంగ్రెస్ రాబందులాగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రైతుబంధు, పంటల బీమాతో రైతన్నలు ఆనందంగా ఉన్నారని ప్రకటించారు.