Thursday, November 7, 2024

ఇది జనసాగర హృదయం : కేసీఆర్

  • ఎండనక, వాననక రాత్రింబవళ్ళు పని చేసిన ఇంజనీర్లకూ, ఇతరులకూ శాల్యూట్
  • ప్రత్యేక తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్
  • దేశాన్నిరుజుమార్గంలో పెడతా
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్  బుధవారంనాడు (ఫిబ్రవరి 23) జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్ఛాన్ చేసి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును ప‌రిశీలించారు. మల్లన్నసాగర్ మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు.

మల్లన్న సాగర్ తో 8 లక్షల ఎకరాల ఆయకట్టు

కొమురవెల్లి మల్లన్న స్వామికి పూజ

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 535 మీటర్లు. అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో పాత మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించనున్నది. మల్లన్నసాగర్‌ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-13 కింద మల్లన్నసాగర్‌ నుంచి 8.733 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ-17, 18, 19 కింద 11.670 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 11.525 కిలోమీటర్ల టన్నెల్‌ ఆపై మరో 2.505 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది. ఆపై 34 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్‌ సమీపంలోని ముదిమానిక్‌ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ-19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్‌ నుంచి 8.175 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్‌ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి జలాల్ని తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్‌కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ-16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో పోస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ-14 కింద 4.850 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 8.950 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్‌ సమీపంలో మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. పాములపర్తి దగ్గర కూడా కేవలం 89 మీటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.

ఇది తెలంగాణ జ‌ల‌ హృద‌యం సాగ‌రం – సీఎం కేసీఆర్

ఇది తెలంగాణ హైదయసాగరం

ఒక మ‌ల్ల‌న్న సాగ‌ర్ కాదు.. తెలంగాణ జ‌ల‌ హృద‌యం సాగ‌రం.. తెలంగాణ మొత్తాన్ని జ‌లాల‌తో అభిషేకించే సాగ‌రం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవ‌డం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మ‌నం క‌ల‌లు క‌న్న తెలంగాణ రాష్ట్రంతో పాటు స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌ను చూస్తున్నాం. నూత‌న తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ‌బ‌డ్డ అతి భారీ జ‌లాశ‌యం మల్ల‌న్న సాగ‌ర్‌ను ప్రారంభించుకోవ‌డం హ‌ర్షించుకోద‌గ్గ ఘ‌ట్టం. ఈ మ‌హాయజ్ఞంలో పని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు 58 వేల మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. అక్క‌డ్నుంచే మ‌న రాష్ట్ర చీఫ్ జ‌స్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవ‌నాడి.. ఉన్న‌తంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాల‌ని కోరాను. ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్టుపై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 600 పైచిలుకు కేసులు వేశారు. ఇంజినీర్లు ప‌ద‌వీ విర‌మ‌ణ అనంతరం కూడా ఈ ప్రాజెక్టు కోసం ప‌ని చేశారు. ఇంజినీర్లు అంద‌రికీ సెల్యూట్. ఎండ‌న‌క‌, వాన‌న‌క, రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారు. భ‌యంక‌ర‌మైన క‌రువు నేల‌లో ప్ర‌జ‌లకు న్యాయం చేసేందుకు పోరాడాం. కొంద‌రు దుర్మార్గ‌మైన ప‌ద్ధ‌తుల్లో ప్ర‌గ‌తి నిరోధ‌క శ‌క్తులుగా మారారు. గోదావ‌రి నీళ్లు తెచ్చి కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న పాదాల‌ను క‌డుగుతామ‌ని చెప్పాం. గోదావ‌రి జ‌లాల‌తో అభిషేకం చేయ‌బోతున్నాం. ఎంతో మ‌న‌సు పెట్టి ముందుకు పోయాం. హ‌రీశ్‌రావు సేవ‌లు కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా ప‌ని చేశాం. ఇది ఒక మ‌ల్ల‌న్న సాగ‌ర్ కాదు.. తెలంగాణ జ‌న హృద‌యం సాగ‌రం. తెలంగాణ మొత్తాన్ని జ‌లాల‌తో అభిషేకించే సాగ‌రం. సింగూరు ప్రాజెక్టును త‌ల‌ద‌న్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేట‌కే కాకుండా హైద‌రాబాద్ న‌గ‌రానికి శాశ్వ‌తంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను త‌న క‌డుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు అని కేసీఆర్ పేర్కొన్నారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసితీరుతా

జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. త‌ప్ప‌కుండా ఆరునూరైనా స‌రే వంద‌కు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకిచ్చిన శ‌ర్వ‌శ‌క్తులు, స‌క‌ల మేథోసంప‌త్తిని ఉప‌యోగించి, చివ‌రి ర‌క్తపు బొట్టు ధార‌పోసి అయినా స‌రే ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ దేశం కూడా దారి త‌ప్పి పోతోంది. చాలా దుర్మార్గ‌మైన వ్య‌వ‌స్థ న‌డుస్తోంది. దేశంలో ఉన్నం కాబ‌ట్టి వంద శాతం మ‌నం ముందుకు పోవాలి. అస‌హ్యం పుట్టే ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌త‌క‌ల్లోలాల‌ పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. పిల్ల‌లు క‌ర్ణాట‌క వెళ్లి చదువుకోవాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి. బెంగ‌ళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది. మ‌న హైద‌రాబాద్ రెండో స్థానంలో ఉంది. హైద‌రాబాద్ నుంచి ల‌క్షా 50 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమ‌తులు జ‌రుగుతున్నాయి. అంత‌ర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్ర‌తి రోజూ 580 వ‌ర‌కు విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. తెలంగాణ‌లో ఎక్క‌డా పోయినా ఎక‌ర భూమి 20 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంది. మ‌న రైతులు ధ‌నికుల‌య్యే ప‌రిస్థితి ఉంది. అద్భుత‌మైన ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇత‌ర రంగాల్లో ఉద్యోగ క‌ల్ప‌న జ‌రుగుతోంది. భార‌త‌దేశంలో అతి త‌క్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు.రాష్ట్రాలు బాగు ప‌డాలంటే కేంద్రంలో కూడా ధ‌ర్మంతో ప‌ని చేసే ప్ర‌భుత్వం ఉండాలి. కులాలు, మ‌తాల పేరు మీద చిచ్చు పెట్టొద్దు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలోనే ప‌రిశ్రమలు వ‌స్తాయి. మ‌త‌క‌ల్లోలాల ఉంటే ప‌రిశ్ర‌మ‌లు రావు. మ‌త‌క‌ల్లోలాలు చాలా దుర్మ‌రార్గం.. ఇవి దేశానికి ప్ర‌మాదం, మంచిదికాదు. దాన్ని సంహించ‌కూడ‌దు. ఆ క్యాన్స‌ర్‌ను విస‌ర్తించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఈదేశం నుంచి ఎక్క‌డిక‌క్క‌డ‌నే త‌రిమికొట్టాలి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలి. ప్ర‌జ‌ల‌కు చేటు చేసే వారిని నిల‌దీసి ఎదుర్కోవాలి. క్ష‌మించి ఊరుకోవ‌ద్దు. మ‌నంద‌రం పురోగ‌మించాలి. జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నాను. త‌ప్ప‌కుండా ఆరునూరైనా స‌రే వంద‌కు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకుచ్చిన శ‌ర్వ‌శ‌క్తులు, స‌క‌ల మేథోసంప‌త్తి ని ఉప‌యోగించి, చివ‌రి ర‌క్తం బొట్టు ధార‌పోసి అయినా స‌రే ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతాను ముందుకు పోతాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles