Sunday, December 22, 2024

గట్టిగ మాట్లాడితే దేశద్రోహి అంటరా? బీజేపీకి కేసీఆర్ సూటి ప్రశ్న

 ‘‘వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ దేశద్రోహులా? చైనా ఆక్రమణ చేస్తోంది నిరోధించాలంటే దేశద్రోహి అయితడా? అబద్ధం పై బతికే పార్టీ బీజేపీ. బండి సంజయ్ ఇవ్వాళ వడ్ల గురించి తప్పు సొల్లు పురాణం చెప్తుండు. దేశంలో రైతులు నిరంతర సమ్మె చేస్తున్నారు. 600 మంది మృతి చెందారు. రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చిన్నపుడు కేసీఆర్ దేశద్రోహి కాదు. బీజేపీ దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులా? దేశద్రోహులు- అర్బన్ నక్సలైట్ స్టాంప్ బీజేపీ వేస్తోంది. ఎవరు దేశద్రోహులో తేల్చుకుందాం,’’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సోమవారంరాత్రి ప్రగతిభవన్ లో జరిగిన మీడియా గోష్ఠిలో ధ్వజమెత్తారు.

వరిధాన్యం కొనాలంటూ శుక్రవారం ధర్నా

‘‘వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం రోజున రాష్ట్రం అంతటా ధర్నా చేస్తున్నాం. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటదా? కొనదా? పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తదా? చెయ్యదా? బీజేపీ నేతలను రైతులు ఊరు ఉరా వడ్లు కొంటారా? లేదా అని అడగాలి. ఢిల్లీ నుంచి బండి సంజయ్ కు ఫోన్ రాగానే వడ్లు పక్కన పెట్టాడు. సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టము. చెరుకు వ్యాల్యూ పోయింది. వర్షాకాలంలో కోటి ఎకరాల్లో పత్తి వేసుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజలు వరి వెయ్యకండి- బీజేపీని నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఇప్పుడు యాసంగిలో చెనిగెలు వేసుకుంటే మంచి లాభం వస్తది. మిణుగులు- ఆవాలు రాష్ట్ర వ్యవసాయ శాఖనే కొంటది.’’ అని కూడాఅన్నారు.

KCR and Harish Rao at a media conference on Monday

‘‘రాయలసీమకు నీళ్లు రావాలని నేను బజాప్తా చెప్తా. తమిళనాడు ఎన్నికల్లో కావేరి అన్నరు- ఇప్పుడు ఆ మాట లేదు. ట్రిబ్యునల్ కు ఇయ్యమంటే ఏడేళ్ల నుంచి ఎందుకు ఇవ్వడం లేదు? పక్క రాష్ట్రాలకు వెళ్లి చేపల పులుసు తింటే తప్పా? సబ్జెక్ట్ లేని వ్యక్తులను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. యాసంగిలో వరి పండించండి అన్న మాటలు ఎక్కడ పోయాయి. 6 హెలికాప్టర్ లు పెడుతా బండి సంజయ్ – కేంద్రం రావాలి చూపిస్తా,’’        అని అన్నారు.  

తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ?

’’తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ కనిపించాడా? ఉద్యమ సమయంలో బండి సంజయ్ దేశానికి, రాష్ట్రానికి ఎవరో తెలీదు. ఉద్యమ సమయంలో పార్లమెంట్ అంటే ఏమిటో సంజయ్ కి తెలుసా? తెలంగాణ లో హనుమంతుడి గుడిలేని ఊరు లేదు- టీఆరెస్ పథకాలు అందని ఇల్లు లేదు. గొర్ల పైసలు కేంద్రం ఇచ్చినట్లు బండి సంజయ్ రుజువు చేస్తాడా? గొర్ల పంపిణీలో కేంద్రం రూపాయి చిన్నట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా,’’ అని సవాలు చేశారు.

‘‘రాష్ట్ర బిజెపి నాయకులకు సిగ్గు ఎగ్గూ లేదు. ఏడు మండలాలు గుంజుకున్న రోజు ఎక్కడ పడుకున్నారు? కేసీఆర్ ఎక్కడికి పోవాలో బండి సంజయ్ చెప్తడా? శుక్రవారం రోజు మాతో ధర్నాకు బండి సంజయ్ పోరాటం చేస్తాడా?’’ అని అడిగారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది ఎవరు?

‘‘జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆరెస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయా? తప్పుడు మాటలు చెప్పి జీహెచ్ఎంసీ లో నాలుగు సీట్లు సంపాదించారు. 2004 తరువాత కరీంనగర్- మహబూబ్ నగర్- గజ్వేల్ లో నేను గెలిచిన. బీజేపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇయ్యకపోను- ఉన్న ఉద్యోగాలను పోగొట్టారు తెలంగాణకు కేసీఆర్ ఎమ్ చేసాడో అనేది జోక్ ఆఫ్ ది మిలీనియం.తెలంగాణ కు కేసీఆర్ ఎమ్ చేసాడో కేంద్రమే చెప్పింది. తెలంగాణ కంటే మెరుగ్గా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ఉన్నాయా? కర్ణాటక లో ప్రైవేట్ టీచర్లను కరొనాలో ఆదుకోవాలని డిమాండ్ చేస్తే కొట్టి పంపారు.

క్యాబినెట్లో ఉద్యమకారులే ఉండాలని ఎక్కడా లేదు

‘‘నవోదయ పాఠశాలకు జాగాలు చూపించలేదు అనేది అవాస్తవం. దేశ ఖజానా ని అయ్యా సొత్తు కాదు. వ్యక్తిగత ఆరోపణలు- కక్షసాధింపు చర్యలు చేస్తారా? మాకు మనీ ల్యాండరింగ్ లు,…కేబినెట్ లో ఉద్యమకారులే ఉండాలి అనేది ఉందా? మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సిందియా ను కేంద్రమంత్రిగా ఎందుకు పెట్టుకున్నారు? ఇతర పార్టీలతో సీనియర్లు ఉంటే వాళ్ళను తీసుకోని- వాళ్ళ సేవలు ప్రజలకు అందిస్తాం,’’ అని అన్నారు.

‘‘నా ఫామ్ హౌస్ నా నియోజకవర్గంలో ఉంది. నా ఫామ్ హౌస్ దగ్గర అడుగుపెడితే ఆరు ముక్కలు అవుతవ్ కొడుకా. అది ఫామ్ హౌస్ కాదు- ఫార్మార్ హౌస్. వ్యవసాయం చేసుకోని బతకడం తప్పా?మేము బజాప్తా బతుకుతాం- బాజప్తా బతుకుతం. సిద్దిపేట లో భూమి అమ్ముకొని- గజ్వేల్ లో రెండున్నర కోట్లతో ఇళ్ళు కట్టుకున్నాం. మిగిలిన డబ్బుకు మూడున్నర కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టిన,’’ అంటూ వాదించారు.

ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తాం

‘‘రాజకీయంలో గెలుస్తాం ఒడుతాం- మాకు ప్రజలు ఏ పాత్ర ఇస్తే అక్కడ ఉంటాం. బీజేపీ లాగా దొంగ లెక్కలు టీఆరెస్ చేయడం లేదు. కర్ణాటక – మధ్యప్రదేశ్ లో దొడ్డిదారిలో ప్రభుత్వం నడిపిస్తున్నారు. టీఆరెస్ ప్రజల తీర్పుతో గెలిచాం- 107 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. బీజేపీ కి లొంగివుండి- అనుకూలంగా ఉంటే వాళ్ళు మంచోళ్ళు. వారం పది రోజుల్లో ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టొరేట్ , ఆదాయంపన్నుశాఖ దాడులు మొదలు పెడతారా? తెల్లారేసరికి కేసీఆర్ దేశద్రోహి అయిండా? మేము ఎలాంటి విచారణకు అయినా సిద్ధం,’’ అంటూ స్పష్టం చేశారు.

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. సీడ్ కంపిణీలతో టైయప్ ఉంటే వాళ్ళు పండించుకోవచ్చు. 570 టీఎంసీల నీళ్లు తెలంగాణ భూగర్భంలో ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు,’’ అని కేసీఆర్ అన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎప్పుడు చెప్పిన?

‘‘దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని నేను ఎన్నడూ అనలే. అనని మాటను పట్టుకొని సాగదీస్తా ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల దళితుడిని ముఖ్యమంత్రి చేయలేకపోయినం. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినం. షబ్బీర్ అలె చెప్పిండు దళిత ముఖ్యమంత్రిని మేమే చెయ్యనియ్యలేదు అని. పునాది లేని, అడ్రస్ లేని పార్టీ బీజేపీ మాటలకు సమాధానం చెప్పనక్కరలేదు.

దళితబంధు బరాబార్ అమలు చేస్తాం. అసలు దళిత బంధు ఆలోచన ఎట్లా వచ్చిందో బీజేపీ నాయకులకు తెలుసునా? హుజురాబాద్ లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తాం- మిగిలిన నాలుగు మండలాల్లో వంద శాతం ఇస్తాం. ఈ మార్చ్ లోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఇస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20వేల కోట్లు బడ్జెట్ లో పెడుతాం,’’అని వివరించారు.

రెండు-మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో భేటీ ఉంది. ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. కాంగ్రేస్ పంజాబ్- ఛత్తీస్ ఘడ్- రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు. తెలంగాణలో దశలవారీగా వ్యవసాయదారుల రుణాలు మాఫ్ చేశామని చెప్పుకొచ్చారు.

మేము యుద్దవీరులం, బెదరం

‘‘మేము యుద్ధ వీరులం. మేము అవినీతి చేస్తే ఉద్యమంలో అణచివేసేవాళ్ళు. పదవులను చించిపారేసి విసిరేశాం. ప్రపంచానికే గుణపాఠం నేర్పిన చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉంది’’ అని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు మొరుగుతే తన్ని బుద్ధి చెప్తామ్ . సెస్ విత్ డ్రా చేస్తరా? సస్తరా? ప్రాజెక్టులు కట్టకపోతే కట్టలేదంటారు. కడితే కమిషన్ల కోసం కట్టారంటారు. దేశవ్యాప్తంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే కట్టిర్రా? మీలాగా మందిని బ్లాక్ మెయిల్ చెయ్యం,’’ అని అన్నారు.

‘‘పెట్రోల్- డీజిల్ వాహనాలు పోయి విద్యుత్ వాహనాలు రాబోయే ఐదారేళ్లలో డిమాండ్ ఎక్కువగా వస్తది. దేశానికి కెపాసిటీ ఉన్న విద్యుత్ లో సగం కూడా దేశం వాడటం లేదు. 65వేలకు పైగా టీఎంసీల నీళ్లు ఉంటే- 35వేల టీఎంసీలు కూడా వాడటం లేదు. దేశంలో 40 కోట్ల ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఇచ్చినా 20 టీఎంసీల నీళ్లు కూడా పట్టవు. దేశ పరిస్థితి గమనించి ఆలోచన సరళి మరాల్సిన అవసరం ఉంది. 1980 లో కూడా చైనా డీజీపీ ఇండియా కంటే తక్కువ. ఇప్పుడు చైనా చాలా ఎదిగింది. ఇండియా సంస్కరించబడవల్సిన అవసరం ఉంది. ఇండియా కు కొత్త ఎకనామిక్ పాలసీ రావాల్సి ఉంది’’ అని అన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయిన తర్వాత వారం రోజులు కేసీఆర్ జాడలేదు. ఆదివారంనాడు మొదటి మీడియా గోష్ఠి నిర్వహించారు. సోమవారంనాడు వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజూ మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. ఎంత గంభీరంగా మాట్లాడినా కేసీఆర్ లో బెరుకుదనం మొట్టమొదటిసారి కనిపిస్తోందని మీడియాగోష్ఠిలో పాల్గొన్న మీడియా ప్రతినిధులు జనాంతికంగా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరుపవచ్చుననీ, వచ్చుసంవత్సరం డిసెంబర్ లో మళ్ళీ ఎన్నికలు జరగవచ్చుననీ అంటున్నారు. మొత్తంమీదికి తెలంగాణ రాజకీయం వేడెక్కుతున్నది. పరిస్థితులు క్రమంగా, వేగంగా మారిపోతున్నాయి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles