వోలేటి దివాకర్
రైల్వే, కమ్యునికేషన్, ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ వినయ్ కుమార్ త్రిపాఠి లింగంపల్లి -వికారాబాద్ సెక్షన్‌లోని గుల్లగూడ ` చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య ‘కవచ్’ (భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రయిన్ ప్రొటెక్షన్) వ్యవస్థపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దాని పనితీరును పరిశీలించారు. మానవ రహిత కవచ్ వ్యవస్థ కలిగిన రైలు రెడ్ సిగ్నల్ దాటడాన్ని ఎలా ఆపుతుందో, లూపు లైన్లు దాటేటప్పుడు రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా ఎలా తగ్గిస్తుందో, ఎదురెదురు రైళ్లు ఢీకొనకుండా ఎలా నిరోధిస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించారు.
భారతీయ రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. న్యూడిల్లీ – ముంబాయి, న్యూ డిల్లీ -హౌరా వంటి రద్దీ మార్గాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 2000 కి.మీ.లకు కవచ్ రక్షణ వ్యవస్థను విస్తరించాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని అదనంగా 4000 నుండి 5000 కిమీలకు విస్తరిస్తామన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన కవచ్ వ్యవస్థ అభివృద్ధికి కోసం ప్రతి కిలోమీటర్‌కు 40, 50 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. అదే యూరోపియన్ మోడల్స్ కోసం సుమారుగా ప్రతి కిలోమీటర్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
దక్షిణ మధ్య రైల్వేలో 1200 కిలోమీటర్లకు ‘కవచం’
భారతీయ రైల్వే భద్రత పెంపులో భాగంగా ప్రపంచ స్థాయి సాంకేతికతతో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. భారతీయ రైల్వే సమర్థవంతమైన మరియు విశ్వసనీయతమైన రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తూ వేగంగా విస్తరిస్తుంది. రైళ్ల నిర్వహణలో భద్రత పెంపు కోసం ఆధునిక సాంకేతికతపై రైల్వే ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డిఎస్‌ఓ) దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ ‘కవచ్’ అభివృద్ధి చేశారు. భారతీయ రైల్వే పరిధిలో రైళ్ల నిర్వహణలో భద్రత అంశం ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచినప్పటి నుండి అమలు చేయడం వరకు అనేక ప్రయోగాత్మక ట్రయిల్స్ ను నిర్వహించింది. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనుటను నివారించే రక్షణ వ్యవస్థను ‘కవచ్’ కలిగివుంది. ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు రైలు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోతే రైలులో బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. దీనికి అదనంగా, ‘కవచ్’ వ్యవస్థ పనితీరుతో ఎదురెదురుగా వచ్చే రెండు లోకోమోటివ్‌లు ఢీకొనుటను కూడా నివారిస్తుంది.
ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచే దశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి -వికారాబాద్ ` సనత్‌నగర్ -వికారాబాద్ ` బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిమీల మేర కవచ్‌ను అమలు చేశారు. ఇకముందు అదనంగా 936 కిమీలకు, మొత్తం 1200 కిమీల మేర కవచ్‌ను ఏర్పాటు చేస్తారు.