Sunday, December 22, 2024

దశరథుడిపై కౌసల్య హృదయవేదనాభరిత వాగ్బాణాలు

రామాయణమ్ – 42

సుమంత్రుడు తిరిగి వచ్చాడు. రాముడు గంగదాటి అడవులలోకి వెళ్ళిపోయాడనే వార్త అయోధ్య ప్రజలలో హాహాకారాలు పుట్టించింది. మరొక్కసారి రోదనలు మిన్నుముట్టాయి.

సుమంత్రుడు మెల్లగా రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు. అక్కడ సర్వమూ కోల్పోయినవాడిలా దీనుడై, దుఃఖితుడై, కాంతిహీనుడై చతికిలపడి కూర్చున్న దశరథుడిని సమీపించాడు‌.

Also read: వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పర్ణశాల నిర్మాణం

రాజుకు నమస్కరించి రాముడి వనప్రవేశ వృత్తాంతము వినిపించాడు.

అది మౌనంగా విని ఒక్కసారిగా మూర్ఛిల్లి నేలమీద దబ్బున పడిపోయాడు మహారాజు.

కౌసల్యా సుమిత్రలు పరుగుపరుగున వచ్చి ఆయనను లేవదీసి మంచముమీద పరుండబెట్టి ‘‘ఓ రాజా, ఎందుకంత మౌనంగా ఉన్నావయ్యా! జరుగరానిది జరిగిపోయింది. ఇప్పుడు నీవు బాధపడి ఏం ప్రయోజనం! అదుగో సుమంత్రుడు వచ్చాడు రాముడి వార్తలు చెపుతాడు లేచి వినవయ్యా’’ అంటూ దుఃఖము వలన చపల అయిన కౌసల్య డగ్గుత్తికతో మాట్లాడుతూ తాను కూడా నేలపై ఒరిగిపోయింది.

కొంతసేపటికి తేరుకున్న దశరథుడు సుమంత్రుని పిలిచి, ‘‘నా రాముడు ఎలా ఉన్నాడు? ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకున్నాడు? అడవి అంతటా క్రూరమృగాలు, కృష్ణసర్పాలతో నిండిఉన్నది గదా. వారు ఎలా ప్రయాణిస్తున్నారు. సుకుమారి సీత ఈ కష్టాలు ఎలా ఓర్చుకుంటున్నది?’’  అని అంటూ రాముడి గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

Also read: భరద్వాజ మహర్షి ఆతిథ్యం, మార్గదర్శనం

సుమంత్రుడు రాముడు తండ్రి క్షేమమే కోరుకుంటున్నాడు అన్న విషయము, భరతునిపట్ల ఆయనకు గల ప్రేమను కూడా మహారాజుకు తెలిపి లక్ష్మణకుమారుడి కోపం గురించి కూడా తెలియచేసినాడు.

’’ప్రభువుగా ముందువెనుకలు ఆలోచించకుండా ఏ నేరమూ చేయని రాముని అడవులకు వెళ్ళగొట్టడము తెలివితక్కువవాడు చేసేపని. నేను ఇకనుండీ ఆయనను తండ్రిగా పరిగణింపను. నాకు సోదరుడైనా, బంధువైనా, హితుడైనా, రాజైనా, తండ్రి అయినా రాముడే అని లక్ష్మణుడు చెప్పాడు ప్రభూ!’’

‘‘మహా ఇల్లాలు సీతమ్మ మాత్రము ఏ పలుకూ లేక మౌనంగాఉన్నది మహారాజా! మన అయోధ్య అంతా కళావిహీనమై, కాంతినికోల్పోయి ఆనందశూన్యమై ఎడారిని తలపిస్తున్నది ప్రభూ.’’

సుమంత్రుడి ఈ మాటలు విని ‘‘అయ్యో నేనెంత తెలివితక్కువ వాడను! ఒక స్త్రీ మాట విని ఎవరినీ సంప్రదించకుండా, వృద్ధులతో విచారించకుండా, మంత్రులతో సమాలోచనలు చేయకుండా, వర్తకులతో మాటైనా చెప్పకుండా ఒక్క ఆడుదానిమాట విని ఏకపక్షముగా తొందర పాటుతో ఎంత పాడు పని చేశాను? సుమంత్రా ఇప్పటికి కూడా నా ఆజ్ఞ చెల్లుబాటు అవుతున్నట్లయితే నన్ను వెంటనే నా రాముడి వద్దకు తీసుకొనిపో! ఆజానుబాహువు, అరవిందదళాయతాక్షుడు, మణికుండలభూషితుడూ, మూపున పెనువిల్లు ధరించి మనోహరంగా కనపడే నా రాముడు నా ఎదుట లేకపోతే నాకీ బ్రతుకు ఎందుకు? వాడిని చూడని ఈ కనులెందుకు? వాడి గాఢపరిష్వంగానికి నోచని ఈ శరీరమెందుకు?

Also read: కల్లోల సాగరమై, తేరుకొని, దృఢమైన రాముడి మనస్సు

‘‘ఓ కౌసల్యా! నేను శోకమనే మహాసముద్రంలో మునిగి పోతున్నాను. రామ శోకమే దీని వైశాల్యము. సీత దగ్గర లేకపోవడమే ఆవలి ఒడ్డు.

నా నిట్టూర్పులే తరంగాలు. నా కన్నీళ్ళే నీటి సుడులు. కైకేయి ఈ సముద్రములో పుట్టిన బడబాగ్ని. మంధర అతిపెద్ద మొసలి. రామా,రామా,రామారామా నిను విడిచి ఉండలేనురా’’ అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు దశరథుడు.

..

తలచుకుంటూ ఉంటే హృదయం బరువెక్కిపోతున్నది కౌసల్యకు.

తన పుణ్యాలప్రోవు, తన వరాలమూట, జగదేకవీరుడైన రాముడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడనే ఆలోచన ఆవిడ గుండెల్ని పిండివేస్తున్నది!

Also read: గుహుడిని గుండెకు హత్తుకున్న రాముడు

దీనికి కారణం దశరథుడు!

తన భర్తయొక్క అనాలోచిత చర్య!

ఆవిడ బాధ అంతా దశరధుడి మీద కోపంగా మారిపోయింది.

‘‘రాజా, నీకు మూడు లోకాలలో కీర్తి ఉండిన ఉండవచ్చు కానీ నీవు చేసిన ఈ తెలివితక్కవ పనివలన అది అంతా తుడిచి పెట్టుకు పోయింది. నీ కొడుకులిద్దరూ నీ పనికిమాలిన కోరిక వలన అడవులపాలైనారే! కష్టమంటే ఏమిటో తెలియని రాకుమారులు అడవులలో క్లేశాలను ఎలా భరించగలరనుకొని పంపావయ్యా!

‘‘ఇంత వరకు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాదులతో బహుపసందైన భోజనమారగించే ఆ జనకుడి కూతురు అడవులలో దొరికే నివ్వరిధాన్యాలు, వెదురుబియ్యాలతో ఆకలి ఎలా తీర్చుకుంటుంది? సుప్రభాతవేళలో మంగళ వాయిద్యములను శ్రవణానందకరంగా వింటూ నిదురలేచే ఆ రాకుమారి నేడు అడవి అంతా ప్రతిధ్వనించే సింహశార్దూల గర్జనల భయంకరధ్వనికి ఉలిక్కిపడి నిదురలేవాలికదయ్యా! ఎంతటి దయమాలినవాడవయ్యా నీవు!  పట్టుపరుపులమీద మెత్తని దిండ్లు తలగడగా పెట్టుకొని హాయిగా నిదురించే నా కుమారుడు నేడు పరిఘవంటి తన బాహువులనే తలగడగా పెట్టుకొని నిదురించాలి గదయ్యా! ఎంత తెలివి మాలిన పనిచేశావయ్యా! నీవు సుఖం అనుభవించటానికి నాకొడుకులను సుఖానికి దూరంచేశావు కదా! రాముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అనుభవించిన రాజ్యలక్ష్మిని తాను తిరిగి చేపడతాడా? ఇంకొక మృగము ముట్టిన ఆహారము పెద్దపులి తాను ముట్టదు. నరశార్దూలము నా రాముడు! వాడు ఇంకొకరిచేత ఎంగిలి చేయబడ్డ కూడు ఆశించడు.

‘‘ఆత్మాభిమానము కల రాముడు ఈ అవమానం సహించడు. కేవలము తండ్రి అనే గౌరవముతో నిన్ను ఏమీ చేయలేదు. వాడికోపము ముల్లోకాలను ముంచెత్తగలదు! వాడి బంగరు బాణములు సకల భూతములను ప్రళయకాలములోని అగ్నిలాగా  దహించి వేయగలవు. వాడి శస్త్రాస్త్రాలు మహాసముద్రాలనే ఇంకింపచేయగలవు. వాడు కన్నెర్ర చేస్తే నీవెక్కడ ఉండే వాడివి? పెద్దపులి తోకను తాకితేనే తాకినవారిని నిలువునా చీల్చివేస్తుంది! ఈ అవమానము నా రాముడు భరింపగలడా? చేపలు తమపిల్లలను తామే తింటాయి. అలాగే నీ పిల్లల సౌభాగ్యాన్ని నీవే నాశనం చేశావు కదయ్యా! వాడు ఏ నేరము చేశాడో?

 ధర్మానికి కట్టుబడి నడుచుకోవటమే వాడి బలహీనత అయ్యింది నేడు!

‘‘ధర్మమూర్తికి ఉత్తపుణ్యానికి రాజ్యబహిష్కరణశిక్ష విధించి బికారిలాగ ఇంటినుండి వెడలగొట్టావు కదా!  ఇది శాస్త్ర సమ్మతమేనా?!  సనాతన ధర్మమేనా? ! పడతికి పతి, పుత్రుడు, జ్ఞాతి ఈ ముగ్గురే గతి! మొదటి గతి, నీవా ఉండీ నాకు లేనట్లే. నా కొడుకును చూసుకొని ఉందామంటే వాడిని అడవులపాలుచేశావు!  అన్ని విధాలుగా నన్ను గతిలేని దానిని చేశావు కదయ్యా’’  అంటూ తన హృదయ వేదనను బహిర్గతం చేసింది కౌసల్యాదేవి!

Also read: గంగానదీ తీరం చేరిన సీతారామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles