Sunday, December 22, 2024

రాముడి మాట విని కుప్పకూలిన కౌసల్య

రామాయణమ్26

సుమిత్రానందనుడికి పట్టరాని కోపం వచ్చింది. నేత్రాలు అశ్రుపూర్ణములయినాయి. ఎర్రబడ్డకన్నులతో అన్నను అనుసరించాడు లక్ష్మణుడు!

అభిషేకసామాగ్రికి శ్రద్ధాపూర్వకమైన దృష్టితో ప్రదక్షిణము చేసి మెల్లగా వెళ్ళాడు రాముడు.

రాముడి సౌందర్యాన్ని, ముఖకాంతిని ఏ మాత్రం తగ్గించలేకపోయింది పినతల్లి కోరిక. సుఖదుఃఖాలకు అతీతుడయిన యోగిలాగ ఏ విధమైన చిత్తవికారము లేకుండా తల్లి మందిరం వైపుగా సాగిపోయాడు!

Also read: తండ్రి ఆనతిని రాముడికి తెలియజేసిన కైక!

రాజలాంఛనాలన్నీ అక్కడనే వదిలివేశాడు. మానసికంగా ఆయన అరణ్యంలోనే ఉన్నట్లుగా అయిపోయాడు. పొంగిపొరలే దుఃఖాన్ని మనసులోనే అణిచివేశాడు. ఇంద్రియాలను పూర్తిగా తన అధీనంలో ఉంచుకొన్నాడు. తనను కలువ వచ్చిన పౌరులను, మిత్రులను పంపివేశాడు. వారెవరికీ కూడా రామునిలో ఏ విధమైన మార్పు కనపడలేదు. తన సహజ సిద్ధమైన స్మితభాషణాన్ని విడువలేదు. అదే ప్రియభాషణము. అదే మృదుత్వం.  అదే నవ్వు. అదే ప్రశాంతవదనం!

రాముడు కౌసల్యా మందిరంలో అడుగుపెడుతున్నాడు! ఆ మందిరమంతా కోలాహలం.  సంతోషం. తన మనసులోని భావాలు రవ్వంతకూడా కనపడనీయలేదు రాముడు. కౌసల్య ఆ సమయంలో మంగళకరమైన వేషధారణతో అగ్నిలో హోమం చేస్తున్నది. ఆ సమయంలో రాముడచటికి వచ్చి దేవతాస్త్రీ వలే ప్రకాశించే తల్లికి పాదాభివందనం చేశాడు!

అప్పుడామే రాముని కౌగలించుకొని శిరస్సుపై వాసనచూసి, ‘‘నాయనా నీకు శుభమగుగాక. నీతండ్రి మాట తప్పడు నేడే నీ పట్టాభిషేకము. నీ వంశ ధర్మమును చక్కగా పాలించు తండ్రీ’’ అని పలికింది.

Also read: కృద్ధుడైన తండ్రిని చూసి వేదన చెందిన రాముడు

‘‘నాయనా రా, భోజనము చేద్దువుగాని!’’ అని పలికిన తల్లి పలుకులకు రాముడు , ‘‘అమ్మా నేటినుండీ నేను కందమూల ఫలములు తినవలసియున్నది. ఈ రాజాసనములు విడిచి దర్భాసనములపై కూర్చొనవలె. ఈ రాజ ప్రాసాదాలు, నగరాలు విడిచి జనశూన్యమైన అడవులలో తిరుగాడవలే. భరతునకు రాజ్యమీయవలే. ఇది తండ్రిగారి ఆజ్ఞ!’’

రాముని మాటలకు ..ఒకేవేటుకు నేలకూలిన సాలవృక్షంలాగా. స్వర్గంనుండి భూపతనమయిన దేవతలాగా ఒక్కసారిగా దబ్బున నేలపైబడింది కౌసల్య!

నేలపైబడిన తల్లిని లేపి పొదివిపట్టుకొని తల్లికన్నీరు తుడిచాడు రాఘవుడు!

Also read: కైక కోరిన రెండు వరాలు: భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం

‘‘రామా! నీవు నాకు పుట్టకపోయినా బాగుండేదిరా నాయనా ఈ శోకం తప్పేది! నాకు దుఃఖము కలిగించటానికే పుట్టావు నాయనా నీవు. గొడ్రాలికి ఒకటే శోకం  పిల్లలులేరే అని.  మీ తండ్రి గారి ఏలుబడిలో నేను ఏ మంగళముగానీ ,సుఖముగానీ ఎరుగను. నీ అధికారములో అవి అనుభవించవచ్చులే అని నా ఆశ! నా కేం తక్కువ? అయినా సవతులచేత మాటలుపడ్డాను. కైక పెట్టిన అవమానములు భరించాను. ఆవిడ మాటలు విని నీ తండ్రి నన్ను చిన్న చూపు చూసినా అన్నీ నీవున్నావులే అనే ఆశతో సహించాను. ఓపిక పట్టాను. ఇక ముందు నా గతి ఏమి కాను? భరతుని చూసి భయముతో అందరూ నన్ను కనీసం పలకరించనైనా పలకరించరు. రామా ఈ వార్త విని నా గుండె బ్రద్దలవటం లేదేమిరా? ఇంత రాయి అయినదేమిరా నాయనా ఇది! నాకు యమలోకములో కూడా చోటులేదు’’ అని అంటూ కొడుకుకు కలిగిన కష్టాన్ని తలుచుకుంటూ పరిపరి విధాలుగా రోదించి రోదించి కంట కన్నీరు కూడా ఇంకిపోయిందామెకు.

Also read: కోపగృహంలో కైక, ప్రాధేయపడుతున్న దశరథుడు

పెదతల్లి రోదనలు వింటున్న లక్ష్మణుడు దీనంగా, ‘‘అన్నా! ఒక ఆడుదాని మాటకు గౌరవమిచ్చి నీవు అడవులకు వెళ్ళటమెందుకు? ముసలివాడైన రాజుకు ఇంకా కోరిక చావక కామంతో కళ్ళుమూసుకుపోయి అనాలోచితంగా అనుచితమైన కోరిక కోరాడు. బుద్ధిగలవాడెవడయినా సద్గుణాలప్రోవు అయిన కుమారుడిని పోగొట్టుకుంటాడా? మతిభ్రమించిన రాజాజ్ఞను నీవు పాటించనక్కరలేదు. అన్నా పద! ఇప్పుడే ఈ క్షణమే ఈ రాజ్యాన్ని మనము చేజిక్కించుకుందాము!  రాజా! బూజా! తరాజా! ఎవడైననేమి? వాడి అంతు చూద్దాము! అవసరమయితే బుద్ధి లేని రాజును వధించనయినా వధిస్తాను. భరతుడి పక్షము వారెవరెవరయినా అడ్డువస్తే చీల్చి చెండాడతాను. అనుజ్ఞ ఇవ్వన్నా! ఏ బలం చూసుకొని రాజు నీతో వైరం పెట్టుకున్నాడు. ఎదిరించి నిలువగలడనేనా?. నధనుస్సు మీద, సత్యము మీద, నేను చేసిన దానయజ్ఞాలమీద, అవి ఇచ్చిన ఫలాల మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. రాముడు అగ్నిలో దూకాల్సివస్తే ఆయన కన్నా ముందే దూకుతాను. రాముని కష్టాన్ని తొలగించలేని నా పరాక్రమము బూడిదలో పోయటానికా?’’ తీవ్రమైన ఆగ్రహావేశాలతో కన్నుల నుండి విస్ఫులింగాలు రాలుతున్నాయి. ముఖము కందగడ్డలా మారిపోయింది. క్రోధంతో ఊగిపోతున్నాడు లక్ష్మణుడు.

కానీ ఆయన క్రోధ సముద్రము రాముడు అనే చెలియలికట్ట దాటలేకుంది.

Also read: కైక మనసు నిండా విషం నింపిన మంథర

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles