గాంధీయే మార్గం – 19
ఒక గృహస్తు – భార్యా ఇద్దరు కుమారులతో ఓడ దిగారు. అతనక్కడ మూడేళ్ళు ఉండి, తొలిసారి కుటుంబంతో ఆ నేల మీద కాలు మోపారు. ఓడలోనివారు దిగకూడదనీ, వెనుదిరిగి వెళ్ళాలనీ స్థానికుల ఆందోళన ఉధృతంగా ఉంది. అది 1896!
Also read: కరోనా వేళ గాంధీజీ ఉండి ఉంటే…
బతుకు తెరువు కోసం చీకటి ఖండానికి వచ్చిన వ్యక్తి అక్కడి భారతీయులకు బతుకు మీద ఆశ కల్పించి, విజయుడుగా స్వదేశం వెళ్తున్నారు. మిత్రులు దండిగా కానుకలు ఇచ్చారు. నలుగురు కొడుకులున్నారు, వారికి పెళ్ళిళ్ళు కాలేదు. కనుక కోడళ్ళకు ఇస్తే బాగుంటుందని ఒక నెక్లెస్ తీసి దాచుకుంది భార్య-భర్తకు చెప్పి. భర్తగారు ఎలా వచ్చినవి అలాగే మరొకరికి ఇచ్చేస్తున్నారు. భార్య కోరికను భర్త మన్నించలేదు. ఇష్టం లేకపోయినా వెనక్కి భార్య నెక్లెస్ ఇచ్చివేసింది. అది 1914 కి కాస్తా ముందు!
Also read: భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్- మీరాబెన్
మనం కస్తూరి బా, గాంధీజీల గురించి చెప్పుకుంటున్నామని మీకు బోధపడి ఉంటుంది. గాంధీజీ బోలెడు రాశారు, ఆయన గురించి బోలెడు మంది ఇంకా బోలెడు రాశారు. ఈ సమాచారంలో, అధ్యయనంలో, గందరగోళంలో ఒక అమృత మూర్తినీ, త్యాగశీలినీ, మౌనంగా గమనించి, పరీక్షించి, ఆకళింపు చేసుకుని చివరికంటా పాటించే నిత్య విద్యార్థినీ, గొప్ప స్ఫూర్తి పర్వతాన్నీ మనం గుర్తించలేము. ఆ మహాతల్లే కస్తూరిబాయి!
Also read: త్యాగానికీ, పట్టుదలకూ ప్రతిరూపం – మీరాబెన్
గాంధీజీ-కస్తూరిబాయి దంపతుల మధ్య వైరుధ్యాలనే సదా చర్చకు పెట్టి ఒక రకమైన ఆనందం పొందుతున్నాం. కానీ పోలికల మాట ఏమిటో మనం పట్టించుకోలేదు. గాంధీ మహాత్ముడితో సరితూగగల గొప్ప వ్యక్తిత్వం కస్తూరి బా కలిగి ఉంది. అయితే మనకు చూడగలిగే దృష్టీ, తెసుకోవాలనే జిజ్ఞాసా ఉండాలి.
Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!
మైత్రి బంధుత్వంగా మారింది
గుజరాత్ రాష్ట్రం సముద్ర తీర ప్రాంతపు పోరు బందరులో మోర్ బనియా కుటుంబాలుండే వీధిలో గోకుల్ దాస్ మకంజీ కపాడియా, కరమ్చంద్ గాంధీ కుటుంబాలు దగ్గర దగ్గరే ఉంటాయి ఒక ఇంటి నుంచి గట్టిగా కేక వేస్తే మరో ఇంటికి వినబడేటట్టు! గోకుల్దాస్, కరమ్చంద్ మంచి మిత్రులు. ఈ స్నేహాన్ని తమ పిల్లల పెళ్ళి ద్వారా బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. అలా 1876లో పిల్లలు కస్తూరి-మోహన్ ల పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. కస్తూరి అనే ఈ వధువు, వరుడు గాంధీ కన్నా 5 నెలల పై చిలుకు దినాలు పెద్దది కూడా! వారి పదమూడవ ఏట 1882లో పెళ్ళి జరిగింది.
Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?
కస్తూరి 11 ఏప్రిల్ 1869న జన్మించగా, మోహన్ అదే సంవత్సరం అక్టోబర్ 2న పుట్టారు. వారు బాల్యంలో అందరి లాంటివారే! మరేమీ ప్రత్యేకత లేదు. పెళ్ళి అంటే బాజాలు, స్వీట్లు అనే వారికి తెలుసు. పెళ్ళి అనగానే అందరి మగపిల్లలకు ఉండే ఉత్సాహం గాంధీకీ ఉండేది. గాంధీ స్కూలుకు వెళ్తున్నారు కానీ, కస్తూరి మిగతా ఆడపిల్లల లాగే ఇంటిలోనే పెరిగింది కనుక భర్త ఆమెకు పాఠాలు చెప్పాలని ప్రయత్నించారు. చదువు వస్తే తనను మిగతా వారు చిన్నచూపు చూస్తారనే బెరుకు ఆమెది. కస్తూరి, మోహన్ లు దంపతులుగా గొప్ప కీర్తి పొందినా కస్తూరి చదువు గురించి మనకు చాలాసార్లు తారసపడుతుంది. బార్దోలీ సత్యాగ్రహం సమయంలో పాత్రికేయులు వేసిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ – మీరు ఇలా ప్రశ్నలతో సతాయిస్తారనుకుంటే సరిగ్గా చదువుకునే ఉందును, గాంధీ చాలా శ్రమించారు – అని వివరించడం గమనించవచ్చు. ఇంగ్లీషు మాట్లాడటం, చదవడం నేర్చుకున్న కస్తూరిబా చివరిదశలో, తన 75వ సంవత్సరంలో ఆగాఖాన్ ప్యాలెస్ లో బంధించబడిన వేళ గాంధీజీ ఆమెకు పాఠాలు చెప్పారు. ఆ వయసులో కూడా ఆమెకు వ్యాకరణం, కవిత్వం, చరిత్ర, భూగోళం, సంస్కృతం గాంధీజీ బోధించారని మనం గమనించవచ్చు.
Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?
అత్తింట్లో అందరితో కలిసిపోయిన కస్తూరిబా
కస్తూరిబా బ్యాల్యం గురించి పెద్దగా వివరాలు లభ్యం కావడం లేదు. గాంధీజీ మనవడు అరుణ్ గాంధీ ఈ వివరాల కోసం అన్వేషించారు కూడా. 1930, 1940 సంవత్సరాల ప్రాంతంలో వచ్చిన తుపాన్లు చాలా ఆధారాలను నాశనం చేశాయని అతనికి బోధపడింది. 2019 జనవరిలో మేము పోరుబందర్ వెళ్ళినపుడు గాంధీజీ పూర్వీకులు ఇల్లు, దాని పక్కన నిర్మాణమైన కీర్తి మందిర్ ను చూశాం. గాంధీజీ ఇంటి నుంచి నాలుగైదు ఇళ్ళ తర్వాత కస్తూరిబా గాంధీ పూర్వీకుల ఇళ్ళు ఉందని కూడా గమనించాం.
Also read: వందశాతం రైతు పక్షపాతి
గాంధీ పెళ్ళి తర్వాత మొత్తం కుటుంబం 200 కిలో మీటర్లలోపు దూరంలో ఉండే రాజ్ కోట్ కు తరలి వెళ్ళింది. కరమ్చంద్ గాంధీ, పుతలీబాయి దంపతులకు మోహన్ నాలుగవ, చివరి సంతానం. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక అక్కయ్య ఉన్నారు. మెట్టినింట కస్తూరి తన అత్తకు, తోడి కోడళ్ళకు తోడుగా ఉండగా భర్త స్కూలుకు వెళ్ళేవారు. 1895 నవంబరులో తొలిబిడ్డ పుట్టి కొన్ని దినాలలోనే మరణించాడు. అదే సంవత్సరం కుటుంబ పెద్ద కరమ్చంద్ గాంధీ గతించడం కుటుంబానికి పెద్ద దెబ్బ. మోహన్దాసు గాంధీ ఇద్దరు అన్నల చిన్న చిన్న ఉద్యోగాల ఆదాయం కుటుంబానికి సరిపోయేది కాదు. కనుక చిన్న కుమారుడు చదివి, డిగ్రీ సంపాయించి, తండ్రిలాగా దివాను ఉద్యోగం అయినా పొందాలని ఆ కుటుంబం ఆశించింది.
Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప
రాజ్ కోటకు 90 మైళ్ళ దూరంలో ఉండేచోటుకు గాంధీ చదువుకోసం 1888 జనవరిలో వెళ్ళారు. అదే సంవత్సరం జూన్ లో హరిలాల్ జన్మించాడు. చదువు సరిగా సాగక గాంధీజీ తక్కువ మార్కులతో వెనక్కి వచ్చారు. భవిష్యత్తు అయోమయమైంది. దిక్కుతోచని పరిస్థితిలో జ్యోతిష్యుడిని అడిగితే లండన్ వెళ్ళి లా చదవమనే సలహా ఎదురైంది. కస్తూరి నగలు కుదువ పెట్టి గాంధీ లండన్ వెళ్ళాలని నిర్ణయించారు.
Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు
తల్లికి హామీ ఇచ్చిన గాంధీ
మద్యాన్ని, మగువను, మాంసాన్ని తాకనని తల్లికి గాంధీ ప్రమాణం చేసి, 10 ఆగస్ట్ 1888న బొంబాయి బయలుదేరారు. బంధువుల ఇంటినుంచి ఇంగ్లాండు వెళ్ళే ముందు కులస్తులు విదేశీయానంపై బయలుదేరిన గాంధీని బహిష్కరించారు. దానిని పెడచెవిన పెట్టి గాంధీజీ సెప్టెంబర్ 4న ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కానీ దీనికి మ్యూల్యం కస్తూరి చెల్లించింది. దీని కారణంగా తన పుట్టింటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మూడేళ్ళకు గాంధీజీ బారిష్టరుగా వెనక్కి వచ్చారు. పాశ్చాత్య పోకడలు – ఆహారం, దుస్తులు, బూట్లు తన ఇంటిలో ప్రవేశపెట్టారు గాంధీజీ.
Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?
గాంధీజీ తల్లి 1891లో మరణించింది. 1892 అక్టోబరులో రెండవ కొడుకు మణిలాల్ జన్మించాడు. గాంధీ ప్రాక్టీసు బాగా సాగలేదు. దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేసే పోర్బందరు ముస్లిం దాదా అబ్దుల్లా కోర్టు వ్యాజ్యాల్లో తోడుగా ఉండమని గాంధీని కోరారు. అలా 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళారు.
మరికొంతకాలముంటానని గాంధీజీ రాసిన ఉత్తరం ఆనందం కల్గించింది. కానీ ఎంతకాలమని భర్తకు దూరముండటమని చింతించింది కూడా. మూడు సంవత్సరాల తర్వాత 1896లో గాంధీజీ వెనక్కి వచ్చారు. ఆరు నెలల తర్వాత 12 డిసెంబరు 1896 న ఇద్దరు పిల్లలు, భార్యతో దక్షిణాఫ్రికాలో దిగారు. అప్పట్లో బొంబాయిలో కలరా బాగా వ్యాపించి ఉంది. అలాగే డర్బన్ లో భారతీయ సంతతి వారి జనాభా బాగా పెరిగింది. ఈ రెండు కారణాలతో ఓడలోనివారు దిగ కూడదని తెల్లవారు ఆందోళన చేశారు. గాంధీజీ ఓడనుంచి బయటకు రాగానే దాడి జరిగింది. దేశం కాని దేశం, తమ సంస్కృతికి దూరంగా – దిగగానే ఇలాంటి స్వాగతం. అప్పటికి కస్తూరిబా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! వారి జీవితం గడుస్తోంది. గాంధీజీ సిద్ధాంతాలు, భావనలు రూపు దాలుస్తున్నాయి.
ఇంట్లో నుంచి బయటికి కస్తూరిబాని గెంటివేసిన గాంధీ
1898 సంవత్సరం ఒక సంఘటన జరిగింది. వారింటికి భారతీయ క్రైస్తవుడు అతిథిగా వచ్చారు. ఆయన తల్లిదండ్రులు నిమ్నజాతివారు. తన మలమూత్రాల కుండను తనే శుభ్రం చేయాని ఆయనకు తెలియదు. కస్తూరిబాను శుభ్రం చేయమని గాంధీజీ కోరారు. కస్తూరికి నచ్చలేదు. గాంధీ దీనిని వ్యతిరేకించారు. మాటా మాటా పెరిగింది. ఇద్దరూ పట్టింపు ఉన్నవారే! నీ ఇంట్లో నువ్వే ఉండు, నే వెళ్ళిపోతా అన్నది కస్తూరి. గాంధీజీ వెళ్ళమని ఆమెను లాగి, బయటకు తోసి గేటు వేశారు. అప్పుడు కస్తూరి ఎదిరించిన తీరు గాంధీజీని పూర్తిగా మార్చివేసింది. భార్య పట్ల అలా ప్రవర్తించినందుకు జీవితాంతం గాంధీజీ చింతించారు.
Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా
మొదటి తరగతి బోగీ నుండి గాంధీని తోసివేయబడటం ఎంత కీలకమైందో ఇదీ అంతటి విశేషమైంది. అయితే, ఈ సంఘటనను చాలామంది గమనించలేదు, నమోదు చెయ్యలేదు, విశ్లేషించలేదు. కనుకనే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తేదీకి సంబంధించిన వివరాలు మనకందుబాటులో లేవు. నిజానికి మహిళలను నిరాదరించి నిర్లక్ష్యం చేసే ధోరణి మనలో స్థిరపడింది. గాంధీజీ గురించి ఎన్ని రచనలున్నా ఈ కోణంలో వాటన్నిటినీ అసంపూర్తిగానే మనం ఇప్పుడు భావించాలి.
1897లో మూడవ కుమారుడు రామ్దాస్ జన్మించాడు. 1900లో నాల్గవ కుమారుడు దేవదాసు పుట్టాడు. దేవదాసు పుట్టుక సమయంలో గాంధీజీ మంత్రసానిగా కూడా సేవలందించారు. రక్తహీనత, బ్రాంకైటిస్ తో ఇబ్బంది పడే కస్తూరి బా ప్రసవ సమయంలో ఎంత యాతనకు లోనవుతుందో నేరుగా చూశారు గాంధీజీ. దాంతో 1900 సంవత్సరం లో సెక్స్ కు దూరంగా ఉండాని నిర్ణయించుకున్నారు. అప్పటికి వారిద్దరి వయసు మూడు పదులు మాత్రమే! 1906 నుండి కఠోర దీక్షగా బ్రహ్మచర్యాన్ని పాటించాడు గాంధీ. దీనికి కస్తూరి సహకరించింది.
Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
భారతీయ సంతతి పోరాటం
అదే సంవత్సరం దక్షిణాఫ్రికా భారతీయ సంతతి పోరాటం ఉధృతం అవడం – ఆ సమయంలో సత్యాగ్రహ భావనతో గాంధీజీ ఉద్యమాన్ని నడపటం విశేషంగా గమనించాలి. దానికి కొంతకాలం ముందు 1904లో ఫీనిక్స్ సెటిల్మెంట్ కు వచ్చినా, 1906లో కస్తూరిబా అక్కడికి తరలి వెళ్ళింది. ఆ చెరకు తోటల మధ్య కేవలం ఆరు కుటుంబాలు మాత్రమే ఉండేవి. రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఉద్యమంలో భాగంగా గాంధీజీ బయటికి వెళ్ళినపుడు కస్తూరి ఒక్కర్తే పిల్లలతో ఇంట్లో ఉండేది. 1908 లో గాంధీజీ తొలిసారి జైలుపాలయినపుడు కస్తూరి ఒక్కతే పిల్లలతో ఇంట్లో ఉండేది. ఆ సమయంలో గాంధీజీ జైలులో ఎలాంటి ఆహారం తీసుకునేవారో అలాంటి ఉడకబెట్టిన మొక్కజొన్నలు మాత్రం తీసుకునేది కస్తూరి.
Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం
దక్షిణాఫ్రికాను పాలించే ఇంగ్లాండుతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఉద్యమం సాగుతోంది. చివరి అస్త్రంగా 1913 సెప్టెంబరులో సత్యాగ్రహం పెద్ద ఎత్తున మొదలైంది. గాంధీజీ వారించినా కస్తూరిబా వినలేదు. సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాయ్యారు.
గాంధీజీ ఆశయాల్లో ఆకాంక్షల్లో మేలిమి సగభాగమైన కస్తూరిబా గాంధీని మించిన పోరాటశీలి. ఆ రకంగా గాంధీజీ తొలుత ఇంట గెలిచి, పిదప రచ్చ గెలిచాడు. మహిళలు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడానికి కస్తూరిబా గొప్ప ప్రేరణ శక్తి అవుతుందని అప్పటికి గాంధీజీ కూడా వూహించలేదు. దక్షిణాఫ్రికాలో ఈ దంపతులు సాధించిన విజయం భారతదేశంలో మహిళలు సాంప్రదాయ శృంఖలాలు ఛేదించుకోవడానికి ఎంతగానో దోహదపడింది.
Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం
(ముగింపు వచ్చే వారం)
డా. నాగసూరి వేణుగోపాల్, హైదరాబాద్
మొబైల్: 9440732392