నేడు కాశీనాథుని నాగేశ్వరావుపంతులు 154వ జన్మదినోత్సవం. తెలుగు పత్రికా ప్రపంచానికి ఇది మహోత్సవం. ” ఈరోజు జర్నలిజం ఇంత అభివృద్ధి చెందిందంటే, ముఖ్యంగా తెలుగు దినపత్రికలు అభివృద్ధిలోకి వచ్చాయంటే, అదంతా ఆయన చలువే”, అని కాశీనాథుని గురించి ప్రఖ్యాత జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు పదే పదే అంటుండేవారు. ఆ మాటలు అక్షర సత్యాలు. ప్రాతఃస్మరణీయుడైన కాశీనాథుని నాగేశ్వరావుపంతులు 1867, మే 1వ తేదీ నాడు కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ,బుచ్చయ్య. ఏప్రిల్ 11 వ తేదీ 1938లో ఆయన లోకం విడిచి వెళ్లిపోయారు. ఆంధ్రపత్రిక, భారతి వంటి గొప్ప పత్రికలను స్థాపించి,అమృతాంజన్ వంటి దివ్య ఔషధాన్ని లోకానికి అందించిన నిత్యస్మరణీయుడు నాగేశ్వరావుపంతులు. విలువలు, ప్రమాణాలు, నిష్పక్షపాతం, నిర్భీతి అనే పదాలు ప్రతిధ్వనించిన పత్రిక ఆంధ్రపత్రిక. నాగేశ్వరావుపంతులు చరిత్రలో అంతర్భాగం ఆంధ్రపత్రిక.
Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి
ఆంధ్రపత్రికతో పెనవేసుకున్న పంతులుగారి జీవితం
ఆంధ్రపత్రిక అంతర్వాహిని నాగేశ్వరావుపంతులు. అది విడదీయలేని అనుబంధం. తెలుగుజాతి వికాసంలోనూ ఆయన పాత్ర మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అనేక ముఖ్య పరిణామాల్లో కాశీనాథునివారి భాగస్వామ్యం ఎంతో విలువైంది. ముఖ్యంగా, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు అత్యంత కీలకమైన ఒప్పందం కాశీనాథునివారి విలాసమైన మద్రాస్ లోని ‘శ్రీబాగ్’ లో జరిగింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య జరిగిన ఒడంబడిక ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసింది. ‘శ్రీబాగ్ ఒప్పందం’ గా అది చరిత్ర విదితం. నాగేశ్వరావుపంతులు అంటే కేవలం ఆంధ్రపత్రిక, అమృతాంజనం కావు. ఆంధ్రచరిత్రలో అంతర్భాగం. ఆయన పాత్ర అనేకరంగాలతో పెనవేసుకుని సాగింది. దార్శనికుడు, దానశీలి, వ్యాపారవేత్త మాత్రమే కాదు సాహసుడు కూడా.
Also read: సకల సద్గుణ సంపన్నుడు హనుమ
దళితులంటే ప్రేమ
దళితులంటే ఆయనకు ఎనలేని ప్రేమ. హరిజన ఉద్ధరణకు ఆయనచేసిన పోరాటం సామాన్యమైంది కాదు. దళితులకు హాస్టల్ వసతులు తెచ్చిన మాజీమంత్రి వేముల కూర్మయ్య జీవితం నాగేశ్వరావు పంతులుతో ముడిపడి సాగింది. వేముల కూర్మయ్యను పాఠశాలలో చేర్చుకోడానికి అగ్రహారీకులు ఒప్పుకోలేదు. నిరాహారదీక్ష చేసి, వాళ్లందరినీ ఎదిరించి, కూర్మయ్యను పాఠశాలలో చేర్పించారు. మదన్ మోహన్ మాలవ్యాతో మాట్లాడి బనారస్ విశ్వవిద్యాలయంలో కూర్మయ్యకు ఉన్నత విద్యలు చెప్పించిన హరిజన పక్షపాతి నాగేశ్వరావుపంతులు. చరిత్ర, పరిశోధనలకు, విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి కాశీనాథుని స్ఫూర్తి, సహాయ సహకారాలు మరువలేనివి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వెంకటరమణయ్య వంటి ఉద్దండ చరిత్రకారులను ప్రోత్సహించి చరిత్ర రచన చేయించారు.
Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం
అది ఇది ఏమని అన్ని రంగముల….
ఖాదీ ఉద్యమంలో, గ్రంధాలయ విస్తరణలో ఆయన పాత్ర మరువలేనిది. దుర్గాకళామందిరం విజయవాడలో నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద వేదిక కల్పించారు. మహాత్మాగాంధీకి వీరంటే ఎనలేని మక్కువ. అపారమైన గౌరవం. కాశీనాథుని తైలవర్ణ చిత్రపటం ఆవిష్కరించడం కోసమే గాంధీ ప్రత్యేకంగా మద్రాస్ వచ్చారు. ఆరోజు సభలో నాగేశ్వరావుపంతులు గురించి మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం, మాట్లాడిన మాటలు చాలా గొప్పవి. తెలుగునేతలలో గాంధీ అభిమానాన్ని, ప్రేమను పొంది, హృదయాన్ని చూరగొన్నవారిలో నాగేశ్వరావుపంతులుదే అగ్రస్థానం. కాశీనాథునికి ‘దేశోద్ధారక’ బిరుదును గాంధీయే సమర్పించారు. రాజకీయాల్లో సాగినా, దేశభక్తితో కూడిన కాంగ్రెస్ సేనానిగా పాటుపడ్డారు.
Also read: అంతా ఆరంభశూరత్వమేనా?
పదవులకోసం అర్రులు చాచలేదు
పదవులకోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. ఒక సందర్భంలో మంత్రిపదవి తీసుకోమని జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానించినా కాశీనాథునివారు సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలలో అయన పాత్ర శిఖర సమానమైంది. తెలుగువారి తేజస్సుకు, చైతన్యానికి పత్రికలు చాలా అవసరమని గుర్తించిన దార్శనికుడు. 1908లో ‘ఆంధ్రపత్రిక’ వారపత్రిక, 1914లో దినపత్రికను స్థాపించారు. కాంగ్రెస్ ప్రచారం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకరాష్ట్ర సాధన, స్వాతంత్ర్య పోరాటం ముఖ్య లక్ష్యాలుగా పత్రికలను స్థాపించారు. కాశీనాథునివారు పత్రికలు స్థాపించాలని సంకల్పం చేసుకున్నప్పుడు ఆయన ఆర్ధిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. నిపుణులైన సిబ్బంది లేరు, వనరులు లేవు. అయినప్పటికీ ఎంతో ధైర్యంతో ముందుకు దూకారు.
Also read: భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం
పత్రికకోసం పాట్లు
పత్రికలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నది ఆయన తపన. దీని కోసం పడినపాట్లు ఆన్నీఇన్నీ కావు. ఆ కాలంలో రవాణా సదుపాయాలు పెద్దగా లేవు. టెలిఫోన్ సౌకర్యాలు లేవు. కరెంటు వసతి కూడా మద్రాస్ వంటి మహా నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల చాలా తక్కువగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లోనూ పల్లెలకు కూడా పత్రికలను చేర్చాలని ఆయన ఎంతో తపనపడేవారు. ఎలాగో కష్టపడి పల్లెలసీమలకు పత్రికలను పంపేవారు. అది కూడా, పాఠకులకు ఉచితంగానే ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశ్యం.దాన్ని అక్షరాలా ఆచరించి చూపారు.వ్యాసకర్తలకు కూడా డబ్బులు ఇచ్చేవారు. పత్రికారంగంలో ఈ సంప్రదాయానికి ఆయనే నాంది పలికారు.
తెలుగు ప్రజలకు ప్రాధాన్యం
జాతీయ వార్తలు, రాజకీయాలు, విజ్ఞాన, వినోద అంశాలు ఎన్ని ఉన్నా, సమాంతరంగా తెలుగురాష్ట్రాల అంశాలు, భాష, సాహిత్యం, సంస్కృతి, కళలకు ప్రత్యేక స్థానం కల్పించారు. నిరంతరం తెలుగుదనంతో నిండిఉండేవారు. ముందుగా బొంబాయిలో, ఆ తర్వాత మద్రాస్ లో , తదనంతర కాలంలో విజయవాడ, హైదరాబాద్ లలో పత్రికా కార్యాలయాలను విస్తరించారు. కేవలం సాహిత్యం కోసమే 1924లో ‘భారతి’ పత్రికను స్థాపించారు. అందులో కవిత్వం కానీ, వ్యాసం కానీ ప్రచురించారంటే అది గొప్ప గౌరవంగా ఆనాటి కవులు, రచయితలు భావించేవారు. తదనంతర కాలంలో లబ్దప్రతిష్ఠులైన ఎందరో కవులు, సాహిత్యవేత్తల రచనలు వారి తొలినాళ్ళలో ‘భారతి’లో ప్రచురణకు అనర్హంగా ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పండితులు, కవులు, కళా కారులు, సినిమా నటులు ఎందరో కాశీనాథుని వారి ఆర్ధిక సాయం, ప్రోత్సాహం పొందినవారే.
వార్తాప్రచురణలో సమదృష్టి
తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్ష పార్టీల వార్తలను , ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలను అంతే సమదృష్టితో ప్రచురించేవారు. తమ పార్టీ వ్యవహారాలలో, నాయకులలో ఉండే లోపాలు, తప్పులను అదే స్థాయిలో ఎండగట్టేవారు.ఆంధ్రపత్రిక గ్రూప్ లో పనిచేసే పాత్రికేయులు, సిబ్బంది ఎంతో స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనుభవించేవారు. ఇంతటి విలువలు కలిగిన పత్రికలో భాగస్వామ్యం కావడం వారికి అంతే వృత్తితృప్తినీ ఇచ్చేది. హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. భూస్వామ్య పోకడలు, పెత్తందారీ లక్షణాలు లేకుండా అందరి ప్రేమను పొందిన అజాతశత్రువు కాశీనాథుని నాగేశ్వరావు పంతులు. ఆయన నాయకత్వం, వ్యక్తిత్వం అంటే ఎన్. జి. రంగాకు చెప్పలేని ఇష్టం, గురుభావం. ఆంధ్రనాటక కళా పరిషత్ స్థాపించి, నాటక రంగానికి కాశీనాథునివారు చేసిన సేవ అజరామరమైంది. కేవలం పత్రికలను ప్రచురించడమేకాక, పాఠకులను పెంచడం, రచయితలను తయారుచేయడానికి నాగేశ్వరావుపంతులు ఎంతో కృషి చేశారు.
Also read: ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం
అక్షర తపస్వి
అక్షరాస్యత పెరగాలని అహరహం తపించేవారు.1938లో నాగేశ్వరావుపంతులు పరమపదించిన తర్వాత వారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆ విలువలు, ఆ ప్రమాణాలను కాపాడుతూ వారసత్వాన్ని నిలబెట్టారు. ఆ మహనీయుల దివ్య ఆశీస్సులతో, ఇప్పటికీ ఆంధ్రపత్రిక విజయవంతంగా విలసిల్లుతోంది. దేశభక్తుడు, పాత్రికేయుడు, వ్యాపారవేత్త, సంఘసంస్కర్త, గ్రంథాలయ ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, మహాదాత, దార్శనికుడు, సారస్వత పోషకుడు నాగేశ్వరావుపంతులు. ఇంతటి ప్రజ్ఞ, శీలం, ప్రగతి, పవిత్రత, పట్టుదల ఉన్న బహుముఖ ప్రముఖులు ప్రపంచ చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటారు. ఆయన భారతీయుడు కావడం మన భాగ్యం. తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఈ జాతి ఉన్నంతకాలం, అక్షరం ఉన్నంతకాలం ఆయన చిరంజీవిగా ఉంటారు. ఈ విశ్వదాతకు, ఈ విశిష్ట నేతకు, ఈ పవిత్ర పాత్రికేయ కులపతికి వందన సహస్రములు సమర్పిద్దాం.