ఉగ్రవాదుల దాడిలో హతుడైన కశ్మీరీ పండిట్
- ఘాతుకాన్ని వీడియో తీస్తున్న హంతకులు
- మతతత్త్వ మారణకాండను గుర్తు చేయడమే లక్ష్యం
- ఇంతవరకూ సత్ఫలితాలు ఇవ్వని మోదీ ప్రయోగాలు
కశ్మీర్ పండిట్లు లక్ష్యంగా ఉగ్రవాదుల ఊచకోత యదేచ్ఛగా సాగుతోంది. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్నవారిలో ఇద్దరు కశ్మీర్ పండిట్లను వేరు చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తాజా దుష్ట సంఘటన తీవ్రమైన ఆవేదన పుట్టిస్తోంది, ఆగ్రహం రగిలిస్తోంది. కాల్పులకు గురైనవారిలో ఒకరు ఇప్పటికే మరణించారు. వేరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడమే కాక ఆ దృశ్యాన్ని మొబైల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటువంటివి ఉగ్రవాద చర్యలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. అల్ -బదర్ ఉగ్రమూక ఈ ఘోరకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పుకుంటూ వస్తున్నారు.
Also read: లంకలో చైనా పాగా!
కేంద్రం ప్రవచనాలకూ, ప్రవర్తనకూ మధ్య అంతరం
ప్రత్యేకంగా కశ్మీర్ పండిట్లపై కక్ష పెట్టుకుని కాల్పులు జరపడం వెనకాల వారి లక్ష్యాలు అర్థమవుతున్నాయి. జమ్మూ,కశ్మీర్ లో మేము ఏదైనా చేయగలమనే సంకేతాన్ని ఇవ్వడమే కాక, మతతత్త్వ మారణకాండను మరోమారు గుర్తు చేయడం లక్ష్యంగా ఉగ్రముఠాలు కదులుతున్నాయి. లడ్డాఖ్, కశ్మీర్, జమ్మూలో స్వేచ్చా వాతావరణం కలిపించి, అభివృద్ధి చూపించి, ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పుతాం, మిగిలిన రాష్ట్రాల వలె వ్యవహరించే పరిస్థితులను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. త్వరలో ఎన్నికలు కూడా నిర్వహిస్తామంటోంది. ఆ మధ్య ఆ రాష్ట్రాల విపక్షాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రభుత్వ పెద్దలు కలిసి మంతనాలు కూడా జరిపారు. ఆర్టికల్ 370 రద్దు, స్వయంప్రతిపత్తిని తీసివేయడం, విపక్ష నేతల గృహ నిర్భంధాలు మొదలైనవన్నీ జమ్మూకశ్మీర్ లో పెద్ద కలకలం సృష్టించాయి. కశ్మీర్ సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామనే విశ్వాసాన్ని నింపడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. అవ్వేమీ ఇప్పటి వరకూ పెద్దగా ఆచరణకు నోచుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పైపెచ్చు కశ్మీర్ లో ఉగ్రహింస మరింత పెరుగుతోంది. ఆ మధ్య జమ్మూలో డ్రోన్ల విన్యాసాలు కలకలం రేపాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఉగ్రదాడుల్లో కశ్మీర్ లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 21కు చేరుకున్నట్లు అధికారికమైన లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు. వీరిలో కశ్మీర్ పండిట్లతో పాటు మిగిలినవారు, పంజాబీలు కూడా ఉన్నారు.
Also read: స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు
పండిట్లతో పాటు పంజాబీలపైనా తూటాలు
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో అక్కడ నివసిస్తున్న పంజాబీలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని కాల్చి చెబుతున్నారు. పంజాబీలలో హిందువులతో పాటు సిక్కు మతస్తులు కూడా ఉంటారు. ఇలా హిందూయేతర మతస్తులను కూడా మేము వదలమనే సంకేతాన్ని ఉగ్రవాదులు అందిస్తున్నారు. కశ్మీర్ లో పెట్రేగిపోతున్న ఉగ్రతీరుపై స్థానికులు ఆందోళన బాట పట్టారు. “హిందూ, ముస్లిం, సిక్కుల ఐక్యత వర్ధిల్లాలి… అమాయకుల ప్రాణాలను తీయడం అంగీకరించం” అంటూ నినాదాలు చేస్తున్నారు. గతంలో కశ్మీర్ పండిట్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరు చొప్పున చెల్లాచెదురై పోయారు. కొందరు పక్కనే ఉన్న జమ్మూకు వెళ్లిపోయారు. మళ్ళీ వారందరు స్వక్షేత్రాలకు తిరిగి వచ్చే సుహృద్భావ వాతావరణం కలిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అగ్రనాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కానీ, అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇటీవల కూడా కశ్మీర్ లో నివసిస్తున్న పండిట్లు కొందరు మళ్ళీ వలసబాట పట్టారని కథనాలు వచ్చాయి. పీవీ నరసింహారావు, వాజ్ పెయి పరిపాలనా కాలంలో కశ్మీర్ విషయంలో ప్రజాస్వామ్యయుతంగా కొన్ని చర్యలు చేపట్టారు. ఇప్పుడు అటువంటి ప్రజాస్వామ్య వాతావరణం లేదన్నది పరిశీలకుల అభిప్రాయం. ఈ అపప్రధను పోగొట్టుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉంది.
Also read: గజం మిధ్య, పలాయనం మిధ్య
కొత్త సమస్యలు తలెత్తరాదు
గతంలోని ప్రధానమంత్రులకు భిన్నంగా నేటి ప్రధాని నరేంద్రమోదీ సమస్యల పరిష్కారానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అవి భవిష్యత్తులో వికటించే ప్రమాదం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్యకు పరిష్కారం కనిపెట్టకపోగా కొత్త సమస్యలు తలెత్తే పరిస్థితులు కల్పించవద్దన్నది వారి హృదయం. కశ్మీర్ ప్రాంతాలలో కొత్త ఉగ్రవాద సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. దీనిని బట్టి, ఉగ్రవాదం తగ్గకపోగా పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో ఇస్లామిక్ ఉగ్రవాదం మరింత తీవ్రరూపం ఎత్తే శకునాలే కనిపిస్తున్నాయి. భారతదేశానికి కొత్త శత్రువులు కూడా పుట్టుకొస్తున్న కాలంలో మనం ఉన్నాం. అత్యంత సున్నితమైన మతపరమైన అంశాలు, అతి ప్రమాదకరమైన ఉగ్రవాదం నడుమ పాలన కత్తిమీద సాము వంటిది. దేశ అంతర్గత భద్రత అత్యంత కీలకమైంది. కశ్మీర్, లడాఖ్ విషయంలో పాకిస్థాన్, చైనా మనల్ని ఇరుకున పెట్టడానికి అన్ని మార్గాలు అవలంబిస్తున్నాయి. సమాంతరంగా అభివృద్ధిని సాధిస్తూ, శాంతిని స్థాపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూ, జమ్మూ,కశ్మీర్, లడాఖ్ వాసులకు మనోధైర్యం కల్పించడం అత్యంత కీలకం. భయ కంపితులవుతున్న కశ్మీర్ పండిట్లలో ఆశాకిరణాలు వెలిగించడం ప్రభుత్వ కనీస బాధ్యత.
Also read: బాబోయ్ బీహార్!