- రిజర్వేషన్లు ప్రకటించిన అమిత్ షా
- కశ్మీర్ లో దాడులు, మరణాలు తగ్గాయన్న దేశీయాంగమంత్రి
కేంద్ర హోం మంత్రి, బిజెపి ముఖ్య అగ్రనేత అమిత్ షా జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల భరోసా కల్పించడానికి, ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పాలనలో ఉన్న పార్టీలపై విరుచుకు పడుతున్నారు. ఆ నాయకులపై ప్రజల్లో మనసు విరిగేట్లు అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో, జైళ్ల శాఖకు చెందిన ఉన్నత అధికారి హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు బలయ్యారు. ఇంటి సహాయకుడి చేతిలో హత్యకు గురయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ ఎఫ్ ) అనే ఉగ్రసంస్థ ప్రకటించింది. పోలీసులు ఉగ్రకోణాన్ని ప్రస్తావించడం లేదు. అసలు నిజాలు వెలుగుచూస్తాయో లేదో చూడాలి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పటిష్ఠమైన చర్యల కారణంగా భద్రతా సిబ్బంది మరణాలు తగ్గుముఖం పట్టాయని అమిత్ షా అంటున్నారు. గతంలో సంవత్సరానికి 1200 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం ఆ సంఖ్య 136 కు తగ్గిపోయిందని హోంమంత్రి చెబుతున్నారు.క్షేత్ర వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని, ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని, కొత్త కొత్త ఉగ్రవాద సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయని, పండిట్లతో పాటు మిగిలిన వర్గాల వారు కూడా చావుభయంతో వణికిపోతున్నారని, అధికారికంగా చూపించే మరణాల సంఖ్యకు – అసలు మరణాల సంఖ్యకు పొంతనే లేదని కథనాలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికలు జరగాల్సివుంది.
Also read: పాదయాత్రలన్నీ జైత్రయాత్రలు కాగలవా?
పట్టుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బీజేపీ
ఎన్నికలు జరిపించి పాలనలో ప్రజాస్వామ్యాన్ని, సర్వ వర్గాల ప్రాతినిధ్యాన్ని పాదుకొల్పుతామని కేంద్రం ఎప్పటి నుంచో అంటోంది. అది ఇంకా ఆచరణకు నోచుకోలేదు. ఈ హడావిడి చూస్తుంటే త్వరలో ఎన్నికలు రావచ్చని అంచనా వేయవచ్చు. జమ్మూ-కశ్మీర్ లో రాజకీయాలను తద్వారా పాలనను శాసించాలని బిజెపి ఎప్పటి నుంచో చూస్తోంది. అక్కడ పర్యటనలో ఉన్న అమిత్ షా తాజాగా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతో పాటు పహాడీ సామజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పించి త్వరలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది మంచి నిర్ణయమే. కోటా ప్రయోజనాలు పరిశీలించేందుకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన ‘జస్టిస్ శర్మ కమీషన్’ సిఫారసుల మేరకు కోటాను అమలుపరుస్తామని అమిత్ షా అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ-కశ్మీర్ లోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అందించేందుకు మార్గం సుగమమైందంటూ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని మరోమారు సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. పహాడీలకు ఎస్టీ హోదా మంజూరైతే ఒక భాష మాట్లాడే సమాజానికి /సమూహానికి దేశంలో రిజర్వేషన్లు కల్పించడం ఇదే తొలిసారి కానుంది. కాకపోతే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. గట్టి సంఖ్యాబలం కలిగివున్న బిజెపి ప్రభుత్వానికి ఇది కష్టసాధ్యమైన విషయం కాదు. పహాడీలకు ఎస్టీ హోదా కల్పించే అంశం అక్కడి మిగిలిన రాజకీయ పార్టీల్లో అగ్గి రగిలిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో ముసలం మొదలైంది. వర్గపోరు రాజుకుంటోంది. ఎన్నికలు అయ్యే లోపు ఈ మంటలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. జమ్మూ- కశ్మీర్ లోని కొన్ని జిల్లాల్లో పహాడీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పహారీ అంటే కొండ ప్రాంతంలో నివసించేవారని ఒక అర్థం.
Also read: వీరవిధేయుడు ఖర్గేకే పార్టీ పగ్గాలు
అప్పుడే నిజమైన నజరానా
పహారీ భాషను మాట్లాడేవారని మరో అర్థం. ఎస్టీల్లో చేర్చాలని వీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. పహారీలను ఎస్టీల్లో చేర్చడానికి గుజ్జర్లు, బకేర్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో, అమిత్ షా బుధ,గురువారాల్లో పాల్గొనే బహిరంగ సభలకు పహాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమిత్ షా సభలను విజయవంతం చేసే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా వినపడుతోంది. జమ్మూ – కశ్మీర్ లో ఎన్నికల ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.పహారీలకు ఎస్టీ హోదా కల్పించడం బిజెపికి కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. వేర్వేరు భాషలు మాట్లాడుతూ పర్వత ప్రాంతాల్లో నివసించే సమూహాలు ఉత్తరాఖండ్ వంటి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. భాష ప్రాతిపదికన హోదాను కేటాయిస్తే మిగిలినవారికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అణగారిన వర్గాలను వృద్ధిలోకి తెచ్చే ఏ విధానమైనా స్వాగతీయమే. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయ స్వార్థంతో సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడితే అది క్షమార్హం కాదు. జమ్మూ- కశ్మీర్ లో అభివృద్ధి జరగాలి. శాంతి వెల్లివిరియాలి. ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవాలి. కొత్త సమస్యలు సృష్టించకుండా ఉండాలి. కశ్మీర్ పండిట్లు మొదలు అన్ని వర్గాల్లో ధైర్యాన్ని నింపాలి. ఉగ్రవాదం అంతమవ్వాలి. ఇవన్నీ జరిగితేనే పాలన సజావుగా సాగుతున్నట్లు. అదే జాతికి నిజమైన నజరానా.
Also read: కరవుకాలం దాపురిస్తోందా?