- అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ రాజ్యం రావడంతో ఉగ్రవాదానికి ఊతం
- పాకిస్తాన్, చైనాల మద్దతుతో కశ్మీర్ పైన పెరుగుతున్న దాడులు
- పండితులూ, సిక్కులూ లక్ష్యంగా హత్యాకాండ
కశ్మీర్ పండితుల వలస మళ్ళీ మొదలైంది. కశ్మీర్ లోయలో హింస, ప్రతిహింసలతో మరణమృదంగ ధ్వనులు మళ్ళీ వినిపిస్తున్నాయి. కొన్ని నెలల నుంచి జమ్మూ-కశ్మీర్ లో కల్లోల వాతావరణం అలుముకుంటోంది. జమ్మూలో వరుసగా ఆ మధ్య జరిగిన డ్రోన్ల దాడుల ఘటనలు కొత్త భయాన్ని సృష్టించాయి. తాజాగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు దారుణ మారణకాండ చేపట్టారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రభుత్వ పాఠశాలలో చొరబడిన ముష్కరులు ప్రిన్సిపాల్, టీచర్ ను దారుణంగా కాల్చి చంపారు.
Also read: కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ
5 రోజుల్లో 7 మంది దారుణ హత్య
మరో ఘటనలో ముగ్గురు పౌరులను హత్య చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఏడుగురు సామాన్య పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారు. సామాన్య పౌరులతో పాటు పండిట్స్ (పండితులు /బ్రాహ్మణులు) ను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ దమనకాండ మళ్ళీ గతకాలపు రక్తచరిత్రను గుర్తుచేస్తోంది. సిక్కులు కూడా లక్ష్యంకావడం కొత్త పరిణామం. ఈ ఘోరకలిని నిరసిస్తూ కశ్మీర్ పండిట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ భయానక వాతావరణ ప్రభావంతో కశ్మీర్ పండిట్ల వలసలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. దయచేసి వెళ్లిపోకండంటూ… ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు కశ్మీర్ పండితులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. హత్యకు గురయినవారిలో స్కూల్ ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్ సిక్కు మతస్తుడు.ఈ నేపథ్యంలో, వందలాది సిక్కులు శ్రీ నగర్ వీధుల్లో నిరసన ప్రదర్శన చేయడం కూడా గమనార్హం. 370 ఆర్టికల్ ను రద్దు చేయడం, స్వయంప్రతిపత్తికి తిలోదకాలివ్వడం మొదలైన కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే మళ్ళీ ఈ ప్రమాదం ముసురుకుందని విపక్షాలు బిజెపిపై యుద్ధాన్ని పునః ప్రారంభించాయి. ఆ విధంగా, విపక్షాల చేతికి కేంద్రం ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. కేంద్రం ఇప్పుడు చేపట్టిన పనుల వల్ల భవిష్యత్ లో ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి తాజా పరిణామాలు అద్దంపడతాయానే విమర్శలు పలు రంగాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎవ్వరూ భయపడనవసరం లేదు, రక్షణ కల్పిస్తామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇస్తున్నా కశ్మీర్ పండిట్స్ కు నమ్మకం కుదరడం లేదు. కొందరు తాత్కాలిక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారు. పాకిస్థానీ ఉగ్రమూకల ప్రోద్బలంతోనే దాడుల పర్వం ప్రారంభమైందని అందరికీ తెలిసిందే. అఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ మళ్ళీ శక్తివంతులు కావడం కూడా ప్రమాదకరమైన పరిణామామే. వారికి తోడు ఇస్లామిక్ స్టేట్ అఫ్ ఇరాక్ ముఠా కూడా తయారయ్యింది. గతంలో జమ్మూలో జరిగిన డ్రోన్ల దాడుల్లో లష్కరే హస్తం ఉందని మన పోలీసులు సైతం అనుమనించారు.
Also read: రక్తసిక్తమైన రైతు ఉద్యమం
భీకరమైన ఎన్ కౌంటర్
జమ్మూ-కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో తాజాగా (ఈ సోమవారం) భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది. అందులో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. బందిపొరా జిల్లా గుండ్ జహంగీర్, అనంత్ నాగ్ లోని ఖాగుండ్ లో వేర్వేరుగా నిర్వహించిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. ఈ దాడులు, ప్రతి దాడులలో మనం జవాన్లను కోల్పోతున్నాం. కొత్తగా మళ్ళీ మొదలైన ఉగ్రవాద వీరంగంతో సామాన్య పౌరులను పోగొట్టుకోవడం నుంచి ఏలికలు ఏం పాఠాలు నేర్చుకుంటారో? విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దమనకాండ శృతిమించి సాగింది. కశ్మీర్ పండిట్ల వలస పెద్ద ఎత్తున అప్పుడే జరిగింది. బలహీనమైన అధికారపక్షం, మిగిలిన పార్టీలపై ఆధారపడడం వల్ల ఆయన కూడా అసమర్ధ నాయకుడైపోయారు. అప్పటి నుంచి సుమారు 2010 దాకా కశ్మీర్ బ్రాహ్మణుల వలసలు సాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మొదలు దేశంలోని అనేక ప్రాంతాలకు వాళ్ళు వలస వచ్చేశారు. విపి సింగ్ తర్వాత మారిన ప్రభుత్వాల నుంచి కొంత భరోసా కలగడం వల్ల కొందరు తిరిగి కశ్మీర్ ప్రాంతానికి వెళ్లిపోయారు. ముఖ్యంగా పీవీ నరసింహారావు ” ఆకాశమే హద్దు”.. (స్కై ఈజ్ ది లిమిట్ ) అంటూ,అవకాశాల కల్పన,ధైర్యం,రక్షణ కల్పించడంపై విశ్వాసం కలిగించారు. వాజ్ పెయి కూడా ఆ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కు కూడా కొంత సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు ఇతోధికంగా కృషి చేశారు. తాజా పరిస్థితులు మళ్ళీ అగ్గిని రగులుస్తున్నాయి. తాలిబాన్ ప్రధాన స్రవంతిలోకి రావడంతో పాకిస్తాన్ కు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. దీనిని ఆయుధంగా తీసుకొని పాకిస్తాన్, ఉగ్రవాద మూకలు చెలరేగిపోతున్నాయి. అటు తాలిబాన్ మూకకు -ఇటు పాకిస్తాన్ కు చైనా అండనివ్వడం మరింత పెరిగింది.భారతదేశం ఉభయ దేశాలకు శతృరాజ్యంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదలైన కల్లోలానికి కశ్మీర్ మళ్ళీ వేదికయ్యింది. రావాణాసురిని కాష్టం వలె, కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో చెప్పలేము. ఈ దమనకాండ పెరగకుండా దౌత్యం నెరపడం ఒక పరిష్కార మార్గం. పూర్తి శాంతి లభించాలంటే అది కాలపరీక్షలోనే తేలాలి.
Also read: వక్రబుద్ధి చైనా