చక్కని చిత్రకారులు శ్రీ కరుణాకర్ గారు మనల్ని వదిలి వెళ్లి పది సంవత్సరాలు అవుతోంది. సెప్టెబరు పన్నెండు 2013 న ఆయన బొమ్మలు చాలించారు. అప్పట్లో ఆయన గురించి వ్రాసింది. మళ్ళీ ఇక్కడ, ఇప్పుడు, ఈ రోజు.
తెలుగు కథకు కళను అద్దిన చివరి సంతకమది- పేరు కరుణాకర్. ఆ సంతకం వెంట నడుస్తూ దానిపై అల్లుకున్న నీటిరంగు పూల అల్లికతో సాగిన జీవితం, ఆగిన జ్ణాపకం ఇది.
తెలుగు పత్రికా చిత్రకళ రేఖ, రంగు, రూపం మా తరం తలకెక్కుతున్న రోజులు… 1990 ల మొదలు… పత్రిక పేజీల నిండా నిలువుగా, అడ్డంగా పలు కాలంస్ గా, పొట్టి ఫిల్లర్స్ గా అచ్చైన బొమ్మలు, అన్నిటా కరుణాకర్ బొమ్మలే ఐన రాజ్యం లో మా తరం ప్రయాణం మొదలైంది.
Also read: అజిత్ భాయ్ సాబ్ అమర్ హై!
తెలుగు బొమ్మల్లొ మహాను భావులు కొందరే అయినా శైలులు ఎన్నొ. సొగసైన బాపు బొమ్మ, నాజుకు లొలికే బాలి బొమ్మ, లొగుట్టులన్ని చంద్రకే ఎరుకున్న బొమ్మ, కుంచె వేగానికి బెదిరి పాఠకుడి వల్లో వాలబోతున్న గోపి బొమ్మ ఈ జంతర మంతరంలో నిడుగా, గుండె నిండుగా నిలబడి, నిలబెట్టి కవ్వింపుని రువ్వింది మాత్రం కరుణాకర్ కుంచే. తెలుగు కథకు గ్లామర్నిచ్చింది కరుణాకర్ బొమ్మే.
కరుణాకర్ బొమ్మ పొడవెంతో తెలుసు, ఆ కుంచె రాల్చిన అమ్మయి బరువెంతో తెల్సు, ఆ గుండ్రాలనిండా, పెద్ద కండ్ల నలుపులో నిలువునా ములిగిపోయి తేలలేక పొయిన పాఠకుల చరిత్ర తెలుసు. కరుణాకర్ గురించే బొత్తిగా తెలీదు. ఆయనక్కూడా పంజగుట్ట పెన్నా హోటల్ ఫస్ట్ ఫ్లొర్ లోని ఆధునిక స్టూడియో, సనత్ నగర్ ఎసార్టి 301 లోని తన ఇల్లు, నలభై పత్రికల ఫొన్ నంబర్లు తప్ప నలుగురు చిత్రకారుల ఫొన్ నెంబర్లు కూడ తెలీవు. ఇదే ప్రశ్న వోమధ్యాన్నపు టీ ముందు “ఎందుకని సార్ మీరు ఏ ఆర్టిస్ట్ తోనూ కలవరు, ఏ సభల్లోనూ కనపడరూ?” అని అడిగితే కాసింత చిరునవ్వును సిగరెట్ పొగతో కలిపి ఇలా అన్నాడు “ఎందుకబ్బా ఏ ఇద్దరు ఆర్టిస్ట్లు కలిసినా చేసే పని మూడో ఆర్టిస్ట్ ని తిట్టుకోవడమే కదా.” ఆయన 70 లలో బొమ్మలు మొదలుపెట్టారు, 2013 సెప్టెంబర్ 12 మధ్యాహ్నం వరకు ఆయనే బొమ్మలే వేశారు, రంగులే పూశారు. ఏ రెండో వాడి గురించి పొల్లు మాట అనిందీ లేదు, మూడో వాడి పైన నాలుక నూరిందీ లేదు. ఇదంతా వ్యక్తిగతం అయినా అది ఆయన వ్యక్తిత్వం.
నిజానికి తెలుగులో ఇలస్ట్రేషన్ని మాత్రమే నమ్ముకుని జీవిక సాగించిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చేతి వేళ్ళన్నీ గుప్పిట మూసి రెండు వేళ్ళు మాత్రమే తెరవొచ్చు. మహా అయితే మరో వేలు. ఈ ఒకరిద్దరిలోనూ పక్కా ప్రొఫెషనల్ ఇలస్ట్రేటర్ అంటే కరుణాకర్ ఒక్కరే. ఆయన ఎంత ప్రొఫెషనల్ అంటే కథలో వున్న విషయం సాంఘీకమా, పౌరాణికమా, చారిత్రకమా అనే తేడా లేదు దేన్నైనా కుదిరించే వారు. ముఖ్యంగా కరుణాకర్ బొమ్మల్లొ పలికినంత ఎరోటిక్ ఎస్సెన్స్ మరెవరి బొమ్మల్లొ పలికేదికాదు. శృంగారం చిలికేది కాదు. కథలోని థీం ని కాకుండా, సన్నివేశాన్ని వున్నది వున్నట్టు వేయడమే ఆయన శైలి. ఇలస్ట్రెషన్ లో పెద్ద పేరున్న కరుణాకర్ కుదిరినప్పుడల్లా కార్టూన్లు వేశారు, చిట్టి పిల్లలకోసం పొట్టి పొట్టి బొమ్మల కథలు వేశారు, మరీ ముఖ్యంగా పురాణ కథల్ని కామిక్స్ గీసారు. ఆయన గీసిన కొన్ని పిల్లల పుస్తకాలు అమెరికాలో ప్రచురించబడ్డాయి కూడా.
Also read: అనగనగా ఒక పుస్తకం-1
పడుగలు వచ్చాయంటే పత్రికల ముఖచిత్రాలన్నీ ఆయన దేవతా మూర్తులతో, కావ్య నాయికలతో నిండిపొయేవి. పచ్చని ప్రకృతి, పిట్టల కిల కిల రవాలు కవర్ పేజి పైనుండి పలికేవి. సుతారమైన గీతంతో పాటు ఆయన బలం రంగులు. రంగులు లేకుండా కరుణాకర్ బొమ్మ వూహకు సాధ్యం కాదు, అవసరానికెప్పుడైనా నలుపు తెలుపుల్లొ బొమ్మ వేయాల్సి వచ్చినా కాసింత గ్రే వాష్ ని కుంచె కద్దుకుని అందులోనే సప్త వర్ణాలకు చోటు చూసుకునే వాడు.
ఏ చిత్రకారునికి రాకూడని పెరాలసిస్ స్ట్రోక్ ఆయనకు అంతకు పది సంవత్సరాల క్రితం వచ్చింది. ఆరోగ్యం కుదురుకునేంత వరకు ఆయనకు కుదురు లేకుండింది. కాస్త చేయి కదిలిందనిపించగానే మళ్ళీ పని మొదలు. ఆ సంధర్భం లో ఆయన్ని కలిస్తే స్ట్రోక్ వల్ల బ్రష్ స్ట్రోక్ సరిగా కుదరడం లేదు అందుకే పెన్ స్ట్రొక్స్ లో బొమ్మలేస్తున్నానన్నారు, అదృష్టవశాత్తు కొన్నాళ్ళకు పెరాలసిస్ స్ట్రోక్ పోయి ఆయన బ్రష్ స్ట్రోక్ ఆయనకు వచ్చేసింది. ఏది ఏమైనా ఏది ఆగదు అంటారు కాని. గత 30 ఏళ్ళుగా తెలుగులొ కల పెద్దా చిన్నా పత్రికలన్నిటికీ బొమ్మలను దాదాపు 90 శాతం కరుణాకర్ ఒక్కరే వేస్తున్నారు. ఆయన నిష్క్రమణతో ఖాలీ అయిన స్థానాన్ని భర్తీ చేయగల మరొక్క చిత్రకారుడు తెలుగు నాట లేడు కాక లేడు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనేది విషయం కాదు విషయమంతా బొమ్మ స్థాయి, సమయానికి అందించడం గురించి. కరుణాకర్ లోని మరో గొప్ప విషయం బొమ్మలు గీసినంత కాలం సమయానికి అందించడం రోజంటే రోజే, గంటంటే గంటే. చెప్పిన సమయానికి చెప్పినట్టు బొమ్మ ఇచ్చేవారాయన. ఇంతటి క్వాలిటీతో బొమ్మలు వేయగలవారెవరా అని గుడ్డి కన్నులతో ఎదురు చూడ్డమే ఇక చూడాల్సింది.
మనిషి అంటే పని అని, పనికి మారుపేరు కరుణాకరని జీవితమంతా పని చేసి ఆ పని తాలుకు సౌరభాన్ని, సౌందర్యాన్ని తెలుగులో కొన్ని తరాలకు పంచిన కరుణాకర్ గుండె ఆగినపుడు, ఆయన దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన వారు కేవలం పదిమంది చిత్రకారులు, ఒక రచయిత, ఒక సంపాదకుడు. కడుపులో చల్ల కదలకుండా ఫేస్ బుక్ లో కొన్ని లైకులు మరి కొన్ని కామెంట్లు, రిప్పులు! నిజానికి తెలుగు నాట ఆయనతో తమ కథలకు బొమ్మ వేయించుకోని రచయిత లేడనే చెప్పాలి. ఆయనతో పని చేయించుకోని పత్రిక లేదనే వ్రాయాలి. అయినా సరైన చిన్న చివరి నివాళి లేక ఆ ఆగిన గుండె ఒక నివాళి కోసం మళ్ళీ కొట్టుకునే వుంటుంది. ఒక సినిమా వాడు వందో , అయిదు వందలో పాటలు వ్రాసిన బంగారు సంధర్భాన్ని, వేయి వెకిలి పాటలు పాడి తెలుగు జాతి నిండు గౌరవాన్ని నిలబెత్తిన క్షణాన్ని కళ్ళ కద్దుకుని రవీంద్రభారతిలో సంబరాలు జరుపుకునే మనం, ఏది కళ అవునో, దేని వల్ల సంస్కృతి సుసంపన్నం అవుతుందో దాని తాలూకు స్పర్శ జ్ణానం లేని జాతులు రెండుగా ఏమీ రెండువేల ముక్కలైనా దరిద్రం తీరునా?
Also read: త్రిపురకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
(కరుణాకర్ గారి బొమ్మలు ఇచ్చిన ప్రముఖ చిత్రకారులు హంపి గారికి కృతజ్ఞతలు)
4 ఆగస్ట్ 1953 న విశాఖపట్నంలో సూర్యప్రకాశ్, కస్తూరి దంపతులకు జన్మించిన కరుణాకర్ అమీర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, అనంతరం ఏపి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు. బొమ్మల్లో శిక్షణ ఎక్కడా పొందని కరుణాకర్ జె ఎన్ టీ యూ ఫైన్ ఆర్ట్ కళాశాల లో ఫొటొగ్రఫి లో బీ ఎఫ్ ఏ చేశారు. తెలుగులో ఆయన బొమ్మ అచ్చుకాని పత్రిక అంటూ దాదాపు గా ఏదీలేదు, లెఖ్ఖలు వేస్తే తెలుగు చిత్రకారుల్లొ కరుణాకర్ వేసినన్ని బొమ్మలు మరెవరూ చిత్రించి వుండక పొవచ్చు. కరుణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. సోమాజిగూడలోని ఆయన బొమ్మలు వేసుకునే స్టూడియో పేరు ఆధునిక. గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో మృతి చెందారు. ఆయన మరణం కుటుంబానికే కాదు పత్రికా ప్రపంచానికి తీరని లోటే – అన్వర్.
Also read: పేపర్ కూడా చదవబుద్ది కాలేదబ్బా!