వోలేటి దివాకర్
పవిత్ర కార్తిక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం గోదావరీతీరం లక్ష దీప కాంతులతో దేదీప్యమానమైంది. శివ నామ స్మరణతో మారుమోగింది. దీపారాధనలు, హారతులతో గోదావరి స్నాన ఘట్టాలు భక్తి కాంతులు వెదజల్లాయి. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు భక్తితో కార్తీక దీపాలు వెలిగించారు. గోదావరిమాతకు హారతులు పట్టారు. ఇందుకు రాజమహేంద్రవరం గోదావరి తీరంలోని ప్రాచీనమైన కోటిలింగాల ఘాట్ ప్రధాన వేదికైంది. గోదావరి నది తీరాన ఉన్న మెట్లపై పేర్చిన దీపాలు భక్తులు, సందర్శకులకు కన్నులపండువగా దర్శనమిచ్చాయి.
Also read: పార్టీ ఒకటే కానీ … వారి పంథాలే వేరు!
హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ సోమవారం శివకేశవులకు అత్యంత ప్రీతికరం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం ద్వారా జీవితంలో కమ్ముకున్న చీకట్లను పారద్రోలుతాయని భక్తుల నమ్మకం. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్, పంతం సత్య నారాయణ చారిటబుల్ ట్రస్ట్,కాలభైరవ గురు సంస్థాన్, జ్ఞాన సరస్వతి పీఠం, గొందేశి పూర్ణచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని కన్నుల పండువగా వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కె.మాధవీ లత, కమిషనర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ , జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
Also read: రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!
గత పదేళ్లుగా పంతం కొండలరావు ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గత సోమవారం చంద్ర గ్రహణం ఏర్పడింది. దీంతో ఈఏడాది దీపోత్సవ నిర్వహణపై సందేహాలు కలిగాయి. కొండలరావు ఈకార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలన్న సంకల్పంతో చివరి సోమవారం నిర్వహించారు.
Also read: పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?