బెంగళూరు : కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎస్. ఎల్. ధర్మగౌడ అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఇంటినుంచి బయలు దేరి వెళ్ళారు. ఆయన శవం చిక్కమగళూరులోని కాడూరు దగ్గర రైలు పట్టాలపైన కనిపించింది.
కర్ణాటక కౌన్సిల్ ఇటీవల సంభవించిన దుమారంలో ధర్మగౌడను పట్టుకొని కాంగ్రెస్ ఎంఎల్ సీలు కుర్చీలోనుంచి లాగి వెల్ లోకి తీసుకొని వచ్చి అవమానించారు. 64 సంవత్సరాల ధర్మగౌడ మితభాషి. సంస్కారవంతుడు. 2018లో ఆయన కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైనారు. అప్పటి నుంచి శాసనమండలి ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు భోజగౌడ కూడా శాసనమండలి సభ్యుడే. భోజగౌడ జనతాదళ్ – సెక్యులర్ పార్టీ అధినేత హెచ్ డి కుమారస్వామికి సన్నిహితుడు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామనీ, ఇది కర్ణాటకకు తీరని నష్టమనీ మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ వ్యాఖ్యానించారు. నిజాయతీపరుడైన, నిబద్దత కలగిన ఒక నాయకుడిని కోల్పోయామని కుమారస్వామి అన్నారు.
సరపనహల్లి లక్ష్మయ్య ధర్మగౌడ 10 డిసెంబర్ 1956న చిక్కమగళూరు తాలూకా సరపనహల్లి గ్రామంలో జన్మించారు. 29 డిసెంబర్ 2020న ఆయన మృతదేహం రైలు పట్టాలపైన కనిపించింది. కాంగ్రెస్ ఎంఎల్ సీలు చేసిన యాగీ కారణంగా ధర్మగౌడ మరణం వివాదాలకూ, ఆరోపణలకూ దారి తీసే అవకాశం ఉన్నది. సెక్యులర్ పార్టీ అని పేరుపెట్టుకొని బీజేపీతో అవగాహనకు వచ్చి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక కావడంపైన కాంగ్రెస్ పార్టీ ధర్మగౌడపైన గుర్రుగా ఉంది.