- ఆర్నెళ్ళు నిండని బసవరాజు బొమ్మయ్ పదవికి అప్పుడే ఎసరా?
- కుదరుకొని పాలనాయంత్రాంగంపై పట్టు సాధించే అవకాశం ఇవ్వరా?
- ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ మంత్రులే వ్యాఖ్యానించడం ఏమిటి?
- కర్నాటకలో జరుగుతున్న రాజకీయ నాటకం ఎటు దారితీస్తుంది?
“ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కావు” అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన సొంత నియోజకవర్గం షిగ్గాన్ లో మొన్న ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కర్ణాటకలో మళ్ళీ ముఖ్యమంత్రిని మారుస్తారనే వార్తలు కొన్నిరోజుల నుంచి గుప్పుమంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్నిస్తున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. నిజానిజాలు ఎలా ఉన్నా కర్ణాటక రాజకీయాల్లో కొత్త వేడి మొదలైంది. షిగ్గాన్ లో కిట్టూరు రాణి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత చేసిన ప్రసంగంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ మాటలు వెలువడ్డాయి. ప్రజలతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యారు. ఈ విషయం అటుంచగా, ఆయన మోకాళ్ళ సంబంధమైన సమస్యలతో కొన్నాళ్ల నుంచి బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉందనీ చెప్పుకొస్తున్నారు. పార్టీలో పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, తన నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమ ఆన్నీ కలిసి ఒక్కసారిగా ఆయన హృదయంపై ప్రభావం చూపించడం వల్లనే ఇటువంటి వ్యాఖ్యలు చేసిఉంటారని కొందరు భావిస్తున్నారు. ఇటీవల జులై 28 వ తేదీ నాడు ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రిని మార్చాలని బిజెపి అధిష్టానం అనుకుంటే అంతకు మించిన అనుచితమైన చర్య ఇంకొకటి ఉండదని ఎక్కువమంది వ్యాఖ్యానిస్తున్నారు.
Also read: అజయ్ మిశ్రాపైన వేటు అనివార్యం
యడ్యూరప్పలాగా స్వంతంత్రుడు కాడు బసవరాజు
ప్రభుత్వ పాలనపై, పార్టీపై పట్టు తెచ్చుకోడానికి ఆయనకు సరిపడా సమయం ఇవ్వడం ధర్మం. పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చి, పెద్ద సంచలన నిర్ణయాలు తీసుకొని, ప్రభుత్వానికి పెద్దస్థాయిలో చెడ్డపేరు తెచ్చిన దాఖలాలు కూడా లేవు.ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. అదే విధంగా, అద్భుతమైన పరిపాలన ఇస్తున్నారని అనలేము. నత్త నడకన సాగుతోందన్నది వాస్తవమే. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, పార్టీపై పట్టును సాధించడం తన రాజకీయ భవిష్యత్తుకు ఎంతో అవసరం. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప వలె బసవరాజు బొమ్మై సర్వ స్వతంత్రుడు కాడు. ప్రారంభంలో తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మై వెనకాల, నిన్నటి వరకూ యడియూరప్ప వెనకాల నడచిన నాయకుడుగా రాష్ట్ర ప్రజలకు ఆయన పరిచయం. సౌమ్యుడని పేరున్నా, సమర్ధుడని పేరు తెచ్చుకోవాల్సిన సమయం, సందర్భం వచ్చాయి. యడియూరప్ప ఎదురులేని నాయకుడు. ఆయన శైలి,తీరు,అనుభవం వేరు. పార్టీపై గట్టి పట్టుందనే పేరు తెచ్చుకున్నా, వివాదాస్పదమైన నాయకుడుగా యడియూరప్పకు చెడ్డపేరు వచ్చింది. ఆయన కుమారుడు విజేయంద్ర షాడో ముఖ్యమంత్రిగా ఆన్నీ తానై చక్రం తిప్పాడనే విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రికి వారసుడుగా ముఖ్యమంత్రి పదవిని కూడా అధిరోహించే ప్రయత్నాలు తీవ్రంగా చేశాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. నేటి బసవరాజు బొమ్మై పాలనలోనూ విజయేంద్ర హవా నడుస్తోందని ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో యడియూరప్పను తప్పించాల్సి వచ్చిందని అందరికీ తెలిసిందే. తర్వాత నియమించే ముఖ్యమంత్రి కూడా ఆయనకు పూర్తి అనుకూలమైన వాడే అయిఉండాలనే ఉద్దేశ్యంతోనే, యడియూరప్పకు అనుచరుడుగా పేరున్న బసవరాజు బొమ్మైను కొత్త ముఖ్యమంత్రిగా అధిష్టానం నియమించింది. ఈ సంవత్సరం జులై నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై మార్పుపై వస్తున్న వదంతులు దుమారం రేపడం ఆ రాష్ట్ర బిజెపి రాజకీయాల్లో దురదృష్టకరమైన పరిణామం. సొంత మంత్రులే ముఖ్యమంత్రి మార్పుపై మాట్లాడుతున్నారని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి కె శివకుమార్ రెండు వారాల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీ ఎం మారతాడని మంత్రి ఈశ్వరప్ప చెబుతున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. మరో మంత్రి మురుగేశ్ నిరాణి కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని డి కె చెబుతున్న మాటల్లో నిజానిజాలు ఎలా ఉన్నా, బిజెపికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న వేళ, అధికార బిజెపికి చెందిన ఎమ్మెల్యే అరవింద్ లింబావలి సొంత ప్రభుత్వంపైనే విరుచుకు పడ్డారు.రోడ్లు ప్రమాదాలకు దారి తీస్తున్నా, నేతలకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొత్త ముఖ్యమంత్రి పరువు తీసాయి. ఈ సంఘటన జరిగి ఇంకా వారం కూడా పూర్తవ్వలేదు. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దక్షిణాదిలో పార్టీ ఎదుగుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కర్ణాటక అంతర్గత అంశాలపైన కొందరు ముఖ్యులతో ప్రధాని మాట్లాడినట్లు సమాచారం.
Also read: ఉద్యమబాట వీడని రైతులు
మంత్రివర్గంలో మార్పలూచేర్పులూ
బసవరాజు బొమ్మై పార్టీపైన పట్టు తెచ్చుకొనే క్రమంలో, తొలిసారిగా, ఆగస్టులో మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. యడియూరప్ప మంత్రి వర్గంలో లేని ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి తనయుడు విజయేంద్రకు చోటు ఇవ్వలేదు. మళ్ళీ మరోమారు ఈ ప్రక్రియపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. 2023లో గెలుపును లక్ష్యంగా చేసుకొని, పాతవారిలో కొందరికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి చేసే మార్పుల్లో విజయేంద్రకు చోటు కల్పించే విషయంపై బొమ్మై తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. ఈ అంశాలన్నీ కొత్తగా ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్న బసవరాజుకు సవాళ్ళుగా ఎదురొస్తున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఆర్ధికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలో వర్గపోరు ఊపందుకుంటోంది. మంత్రి పదవులు అందని నేతల నుంచి అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఆశావహుల నుంచి వత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. పరిపాలన ఇంకా గాడిలో పడలేదు. సరిహద్దు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. అధికార సుఖాలు, భోగాలు, ముఖ్యమంత్రి పదవి తెచ్చిన కిక్కు ఎలా ఉన్నా, పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడాలంటే బసవరాజు బొమ్మై ఇంకా రాటు తేలాల్సిన అవసరం ఉంది. సభల్లో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరమూ ఉంది. లేకపోతే ఇటువంటి విమర్శలే ఎదురవుతాయి. కర్ణాటకలో ఇంత తొందరగా ముఖ్యమంత్రిని మార్చే పని బిజెపి అధిష్టానం చెయ్యదనే అనుకోవాలి.
Also read: నిలిచి గెలిచిన రైతు