- అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత వీరజవాన్లు
- రష్యాకి దూరమైనాం, అమెరికాకు దగ్గరైనాం
- ఆర్థికంగా ఎదిగినప్పుడే భారత్ చైనాకు సమవుజ్జీ
ప్రతి ఏటా జూలై 26 వ తేదీ దేశవ్యాప్తంగా ‘కార్గిల్ విజయ్ దినోత్సవం’ జరుపుకుంటాం. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ ఆనవాయితీ దిగ్విజయంగా జరుగుతునే ఉంది. పాకిస్థాన్ పై భారత్ సాధించిన ఘన విజయంగా దీనిని చెప్పుకుంటూ ఉంటాం. సైనికులలో వీర రసాన్ని, దేశభక్తిని నింపడానికి ఇది గొప్ప ఔషధం. అందులో సందేహం లేదు.శత్రువుపై సాధించిన గెలుపును పండుగగా జరుపుకోవడం ఒక ఆచారం. ఇవన్నీ కాదనలేని సత్యాలు. కార్గిల్ యుద్ధం జరిగి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం చేరువయింది కానీ, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సమసి పోలేదు. జమ్మూ-కశ్మీర్ లో శాంతి, స్వేచ్ఛ, సౌభాగ్యం ఇంకా వేళ్లూనుకోలేదు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను అతిక్రమించడంలో పాకిస్థాన్ వైఖరిలో ఇసుమంత కూడా మార్పు రాలేదు. ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన మార్పులను గమనిస్తే అమెరికాకు భారత్ కాస్త దగ్గరయిందనీ, రష్యాకు పాకిస్థాన్ కాస్త చేరువైందనీ చెప్పుకోవాలి. రష్యా – పాకిస్థాన్ బంధాలు దృఢపడడంలో,భారత్ – రష్యా అనుబంధాలు కాస్త తగ్గడంలో, అమెరికా- భారత్ స్నేహసంబంధాలు పెరగడంలోనూ చైనా పాత్ర, వైఖరి, విధివిధానాలు కీలకమైన ప్రభావాన్ని చూపించాయి.
Also read: బూస్టర్ డోస్ కు నో చెప్పకండి
చైనా పాకిస్థాన్ కి పెద్ద అండ
అన్ని రంగాల్లోనూ, పాకిస్థాన్ – భారత్ రెండూ గతం కంటే ఎంతో ఎదిగాయి. పాకిస్థాన్ ఎంత ఎదిగినా చాలా రంగాల్లో మనకంటే బలహీనంగానే ఉందన్నది వాస్తవం. సైనిక పరంగా,రక్షణ పరంగా చూసుకుంటే ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. పాకిస్థాన్ కున్న పెద్ద బలం చైనా. ఆర్ధికప్రయాణాన్ని మన కంటే చైనా కాస్త ముందుగా మొదలు పెట్టింది. మనల్ని దాటుకొని వెళ్లిపోయింది. జిన్ పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేశానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష బాగా పెరిగింది.పాకిస్థాన్ ను కలుపుకొని మనల్ని కవ్విస్తూనే ఉంది. సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు మార్చి మార్చి మనపై దాడి చేస్తున్నాయి. భారత్ తో జరిగిన అనేక ఒప్పందాలను ఈ రెండు దేశాలు ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. భారత్ – చైనా మధ్య పెద్దయుద్ధం సంభవిస్తుందనే వాతావరణం మొన్నామధ్య నెలకొంది. అలాగే, పాకిస్థాన్ -భారత్ మధ్య కూడా యుద్ధ వాతావరణం తొంగి చూసింది. కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే, కాస్త నిశ్శబ్దం ఆవరించుకొని వుంది. రక్షణ రంగంలో ఇప్పటికీ మనం రష్యా వంటి పరాయి దేశాలపైనే ఆధారపడి ఉన్నామన్నది చేదునిజం.ఆర్ధికంగానూ మనం సాధించాల్సినంత సాధించలేదు. చైనా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది. మనమింకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నాం. ఆర్ధికంగా మనం పుంజుకోనంత కాలం మనం ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. మన బలహీనతలను ఆయా దేశాలు సందర్భోచితంగా వాడుకుంటునే ఉన్నాయి, మనపై స్వారీ చేయడానికి ప్రయత్నం చేస్తునే ఉన్నాయి. విదేశాంగ,ఆర్ధిక విధానాలలో మనం ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహారించాల్సివుంది. సహజవనరులు,మానవ వనరులు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ప్రతిభ,మేధ మనవాళ్ల దగ్గర తక్కువేమీ లేదు.ప్రపంచంలోనే మనది పెద్ద మార్కెట్ కేంద్రం. మన బలాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే బలహీనతల నుంచి బయటపడతాం. చైనా మనతో చేసుకున్న ప్రతి ఆర్ధిక ఒప్పందంలోనూ ఎంతగానో లాభపడింది. కొన్ని రంగాల్లో బంగ్లాదేశ్ కూడా మనకంటే ముందంజలో ఉంది. మన సరిహద్దు దేశాలన్నింటికీ చైనా వల వేసింది. ఆ వ్యూహంలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఏర్పడడంలో భారత్ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. ఇప్పుడు అదే బంగ్లాదేశ్ మనకంటే చైనా వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తోంది. చైనా అండతో చివరకు నేపాల్ వంటి ఛోటామోటా దేశం కూడా మనతో ఆడుకోడానికి కుప్పిగంతులు వేసింది.
Also read: అటు పోరాటం, ఇటు ఆరాటం
భ్రష్టుపట్టిన శ్రీలంక
శ్రీలంక కూడా చైనాపక్షపాతిగానే మారిపోయింది. సరే! చైనాను నమ్ముకొని, పాలకులు అమ్ముడుబోయి శ్రీలంక భ్రష్టుపట్టింది.అది వేరే సంగతి. అటువంటి నేపథ్యంలోనూ, శ్రీలంకకు భారత్ అండగా నిలుచుంది. విలువలుకు, నైతికతకు,మానవీయతకు భారతదేశం పెట్టింది పేరనే పేరు ప్రపంచంలో ఉంది. అది మనకు గర్వకారణమే,కానీ… చైనా,పాకిస్థాన్ మనపై దొంగదెబ్బలు తీస్తూనే ఉన్నాయి. 1999లో జరిగిన కార్గిల్ మారణకాండ అందుకు గొప్ప ఉదాహరణ. అంతిమంగా, మనం వారిపై గెలిచి పైచేయిగా నిలిచాం. కానీ ఎంత నష్టపోయాం, ఎంత కష్టపడ్డాం,ఎంతమందిని పోగొట్టుకున్నాం. అఫ్ఘానిస్థాన్ ఇప్పుడు మళ్ళీ తాలిబన్ ఏలుబడిలోకి వచ్చింది. నిన్నగాక మొన్న జమ్మూలో డ్రోన్ల విన్యాసాలు కలవరపెట్టాయి. కశ్మీర్ ప్రాంతంలో ఏదో ఒకచోట పాకిస్థాన్ మద్దతుదార్ల చేతుల మీదుగా నరమేధం సాగుతూనే ఉంది. హిందువులతో పాటు సిక్కులు కూడా ఊచకోతకు గురవుతూనే ఉన్నారు. కశ్మీర్ లో కొత్త కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కశ్మీర్ పండిట్లు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.ఇవన్నీ ప్రమాదకరమైన ధోరణులే. అమెరికాతో స్నేహం చేస్తూనే రష్యాకు మరింత చేరువవ్వాలి. రష్యాకు దూరం కాకుండా చూసుకోవాలి. అదే సమయంలో అమెరికాను పూర్తిగా నమ్ముకోవడం కూడా తెలివైన చర్య కాదు. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలపై పాకిస్థాన్, చైనా ఇరుదేశాలకు దురాక్రమణ ఆశచావదు. ఆ ప్రాంతాల్లో ఆకాశమంత అభివృద్ధి జరగాలి.ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, శాంతి వికాసమానమవ్వాలి. అందరిలో ధైర్యం పెరగాలి. సమాంతరంగా అన్ని రంగాల్లో ‘ఆత్మనిర్భర్’ ప్రతిష్ఠ జరగాలి. మన దేశం అన్నింటా స్వయంప్రకాశమానమవ్వాలి. ప్రపంచపటంపై భారత విజయపతాక ఎగరాలి. మరువలేని,వెలకట్టలేని కార్గిల్ వీరులకు ఇచ్చే నిజమైన నివాళులు అవే! సైనికులను కోల్పోని పరిస్థితులు వచ్చిన నాడే అచ్చమైన అమృత ఘడియలు.
Also read: రాజరాజ పట్టాభిషేకం – నన్నయ సహస్రాబ్ది
జై హింద్!