‘మహాకవి’ శ్రీశ్రీ మొదలు సామాన్యుడు వరకూ అందరూ కాళీపట్నం రామారావును ‘కారా మాస్టారు’ అనే పిలుస్తారు. కేవలం ఆయన మాస్టారుగా ఉద్యోగం చేయడం వల్లనే ఆ పిలుపు రాలేదు. ఆయనను చూస్తే, కథల పాఠశాలకు మాస్టారులా అనిపిస్తారు. బహుశా అందుకేనేమో ఆయన పేరులో మాస్టారు అనే మాట అంత సహజంగా ఒదిగిపోయింది. ఇంతగా కథా సారస్వతంలో ఒదిగిపోయిన కాళీపట్నం రామారావు తన 97వ ఏట ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు ఎందరో గొప్ప కథకులు తెలుగునేలపై వికసించారు, విజృంభించారు. కవిపరంపరలో, ” నేను కూడా అంతో ఇంతో సందడి చేసినవాడాయను” అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్లు, కారా మాస్టారు కూడా తన కథాకేళితో కొంతకాలం సందడి చేశారు. కథలతో జీవితాంతం సందడి చేశారు. రాశిలో రచనలు తక్కువే ఉండవచ్చు. కానీ, ప్రతి రచనలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది.
Also read: సప్తప్రతిభాశాలి బాల సుబ్రహ్మణ్యం
అగ్రతాంబూలం అందుకున్న కథారాజం ‘యజ్ఞం’
ఇక “యజ్ఞం” చేసిన సంచలనం అంతాఇంత కాదు. కారామాస్టారు రచనల్లో బాగా వాసికెక్కిన రచన “యజ్ఞం.” ఎన్నో పురస్కార, సత్కారాలను పొందడమే గాక, దశాబ్దాల చర్చలకు వేదికగా నిలిచి, ఇప్పటికీ చర్చనీయాంశంగా పేరుకెక్కిన “యజ్ఞం” కారామాస్టారును అగ్రపీఠంపై కూర్చో పెట్టింది. తాను స్వయంగా కథలు రాయడంలో కంటే రాయించడానికి, కథలన్నింటినీ ఒక చోట నిలబెట్టడానికి, ఆ ప్రక్రియను వ్యాపింప చేయడానికి ఎక్కువ మక్కువ చూపించారు. అందుకే, కథకుడుగా ఎంత మంచిపేరుందో “కథానిలయం” స్థాపకుడిగా అంత గొప్పపేరు వచ్చింది. సహజంగా సాత్వికుడు, మంచివాడు. పల్లెసీమల నుంచి వచ్చినవాడు, పట్టణాల తీరును చూసినవాడు, రావిశాస్త్రి, శ్రీశ్రీ వంటివారితో బాగా మెలిగినవాడు, చదవడంలోనూ, సమాజాన్ని, మనుషులను చదవడంలోనూ ఎక్కువ కాలాన్ని వెచ్చించినవాడు. చిన్నా పెద్దా భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించినవాడు, ప్రోత్సహించినవాడు, తన గురించి చెప్పుకోవడం కాక మిగిలిన కథకులు, రచయితల గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. ఇన్ని స్వభావాల చేత, కారా మాస్టారు చరమాంకం వరకూ మంచిపేరుతో అందరికీ తలలో నాల్కలా జీవించారు. పల్లెల్లో కరణీకం వాతావరణాన్ని బాగా చూసినవాడు, భూస్వామ్య పోకడలు బాగా ఎరిగిన వాడు. వర్గాల సంఘర్షణలను పరిశీలించినవాడు, అనుభవించినవాడు. కాబట్టే, ‘యజ్ఞం’ వంటి గొప్ప రచన చేయగలిగాడు.
Also read: మరపురాని మహానాయకుడు
అభ్యుదయవాది
సమాజాన్ని చూసిన నేపథ్యంలో నుంచి అభ్యుదయ భావాలను పెంచుకున్నవాడు.తన పాఠక, రచనా పరిణామాలన్నింటినీ చివరి వరకూ మదిలో నిలుపుకున్నవాడు. అందుకే తన పరిధిని దాటి ఎప్పుడూ వచించలేదు, రచించలేదు, ప్రవర్తించలేదు. 1924 నవంబరు 9వ తేదీన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా మురపాక అనే చిన్న గ్రామంలో కళ్ళు తెరిచాడు. భీమిలిలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని, టీచర్ వృత్తిని ఎంచుకొని, అందులోనే పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసికూడా దాదాపు నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది.రిటైర్ మెంట్ జీవితంలో రిలాక్స్ అవ్వకుండా “కథా సారస్వతం”లో తనను తాను అర్పణ చేసుకున్నారు. దానినే ‘యజ్ఞం’గా భావించి జీవించారు. సుమారు పదిహేను – పదహారేళ్ళ వయస్సులో రాసే ప్రయత్నం చేశారు. పదిహేడు, పద్దెనిమిదేళ్ల ప్రాయంలో 1943 ప్రాంతంలో, ‘ప్లాట్ ఫారమ్’ అనే కథ రాసినట్లు తెలుస్తోంది. బహుశా ఇదే ఆయన రాసిన తొలికథ అయిఉండవచ్చు. అప్పటి నుంచి చిన్నాచితకా పత్రికల్లో ఏవేవో కొన్ని కథలు రాశారు. 1948 నుంచి ఆంధ్రపత్రిక, భారతి, ఆనందవాణి, చిత్రాంగి మొదలైన అప్పటి ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురించ గలిగిన మంచి కథలను రాసే నైపుణ్యాన్ని సంపాయించారు. ఆ తర్వాత 1955వ దశకం నుంచి సుమారు 1963 వరకూ కథలు రాయడానికి విరామం చెప్పి, అధ్యయనం మీద బాగా దృష్టి సారించారు. ఈ అధ్యయన యజ్ఞం పూర్తిచేసి రచించడానికి మళ్ళీ ఉపక్రమించారు. ఆ సమయంలో ‘తీర్పు’ మొదలైన కథలు, కథానికలు రాశారు.ఆ ఒరవడిలో రాసినదే ‘యజ్ఞం’. అది తెచ్చిన పేరు, చేసిన సంచలనం చరిత్ర విదితమే. 1963 నుంచి సుమారు పదేళ్లపాటు రచనా స్రవంతిని కొనసాగించారు. ఆ తర్వాత, కథా రచనలు పెద్దగా చెయ్యలేదు.2006 ప్రాంతంలో రాసిన ‘అన్నెమ నాయిరాలు’ ఆయన ఆఖరి కథ. పుస్తక ముద్రణపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, ఆ కథను సరిగ్గా రాయలేకపోయాను అనే అసంతృప్తి ఆయనకు ఉంది.
Also read: మనసుకవికి శతవత్సర వందనం
కథా ప్రక్రియకు అంకితం
కథలు ఎన్ని రాశారు అనే లెక్కలను పక్కకు పెట్టి చూస్తే, కథా ప్రక్రియ కోసం ఆయన పడిన తపన, కృషి సామాన్యమైంది కాదు. గొప్ప కథకులు ఎందరో ఉన్నారు కానీ ఈ ప్రక్రియ కోసం ఇంతగా అంకితమైనవారు ఇంకెవ్వరూ లేరనే చెప్పాలి. ‘నేటి కథ’ పేరుతో ‘ఆంధ్రభూమి’ పత్రిక ద్వారా ఎందరో కథకులను ప్రోత్సహించారు. కథకులను తయారుచెయ్యాలని ఎంతగానో పరితపించారు. కారామాస్టారి సాహిత్యమంతా చాలా వరకూ ముద్రితమైంది. తన కథా రచనకు కొడవటిగంటి కుటుంబరావును తొలి స్ఫూర్తిప్రదాతగా భావిస్తారు. కథ ఎలా రాయకూడదో, లోపాలను ఎలా సరి దిద్దుకోవాలో రావిశాస్త్రి నుంచి తెలుసుకున్నానని కారామాస్టారు పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. ఇక ‘ కథా నిలయం’ గొప్ప ఆలోచన, గొప్ప కృషి, గొప్ప నిర్మాణం. తనకు వివిధ పురస్కార, సత్కారాల ద్వారా వచ్చిన సొమ్ముతో 22 ఫిబ్రవరి 1997న కథానిలయాన్ని స్థాపించారు. ఎక్కడెక్కడున్న తెలుగు కథలు, కథానికలను పోగు చేశారు. భారతి, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి, జాగృతి వంటి పాత పత్రికలను కూడా సేకరించి కథా నిలయంలో పెట్టారు.1944 నుంచి ‘భారతి’ పత్రికలు కూడా అక్కడ దొరుకుతాయి. కథలు చదువుకోడానికి, కథల గురించి తెలుసుకోడానికి, కథా రచయితల గురించి ఎరుకపొందడానికి, పరిశోధనలు చేయడానికి ఇటువంటి నిలయం ఎక్కడా లేదు. ఇంతటి కృషి ఎవ్వరూ చెయ్యలేదు, చెయ్యలేరు. ఈ కృషి ‘న భూతో న భవిష్యతి. 1910లో అక్కిరాజు ఉమాకాంత విద్యా శేఖరులు రాసిన ”త్రిలింగ కథలు” కూడా కథానిలయంలో దర్శనమవుతాయి. కథలతో పాటు నవలలను కూడా విరివిగా సేకరించారు. కొన్ని వేలమంది కథా రచయితలు ఉండగా, కొన్ని వందలమంది రచనలను మాత్రమే సేకరించగలిగాము అనే అసంతృప్తి కారామాస్టారుకు ఉండేది.
Also read: బుధజన బాంధవుడు బూదరాజు
మనిషి ఉన్నంతకాలం కథ ఉంటుంది
ఆదిమానవుడు తన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం కోసం భాష పుట్టింది, ఆ అనుభవాలను కొంచెం తమాషాగా చెబితే అదే కథ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కథ కొనసాగుతోంది. మనిషి ఉన్నంతకాలం కథకు ఢోకా లేదు అని ఒక సందర్భంలో కారామాస్టారు అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలు. కథ ఉన్నంత కాలం కథానిలయం ఉంటుంది. కారామాస్టారు ఉంటారు. కాళీపట్నం రామారావు కథ, జీవిత కథ ఎప్పటికీ కంచికి చేరవు. ఇతర భాషల నుంచి తెచ్చుకోవడం తప్ప, మనం ఇచ్చింది లేదు, కాబట్టి తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి విస్తృతం చేయడం ఎంతో మంచిదని కాళీపట్నం రామారావు ఇచ్చిన సందేశాన్ని పాటిద్దాం. కారామాస్టారి కథలు భారతీయ భాషల్లోకి, రష్యన్, ఇంగ్లిష్ లోకి అనువాదమై పాఠకుల హృదయాలను చూరగొన్నాయి. సరళ భాషలో రచనలు చేసి కథకుడుగా, రచయితగా, విమర్శకుడుగా, కథానిలయం స్థాపకుడుగా తెలుగు భాషా సాహిత్యాలకు అంకితమైన కాళీపట్నం రామారావు తెలుగు కథా క్షేత్రంలో చిరంజీవిగా నిలిచే వుంటారు. వీరి మృతికి అంజలి ఘటిద్దాం, స్మృతికి నీరాజనాలు పలుకుదాం.
Also read: పత్రికాలోకాని వేగుచుక్క కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు