Sunday, December 22, 2024

కాపుల రాజకీయ, ఆర్థిక చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కులం, ప్రాంతం (region) ప్రభావితం చేసినంత వీరే ఏవి చేయలేదు. స్త్రీవాదం, మత రాజకీయాలు ఈ మధ్య చాలా చురుకుగా రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి గాని, ఇదివరకు కులం, ప్రాంతం మాత్రమే ఉండేవి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ కులానికి చెందిన ఎన్‌టీ రామారావు తన తెలుగుదేశం పార్టీతో జోక్యం చేసుకునే వరకు రెడ్ల ఆధిపత్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్థిరంగా ఉందని చెప్పవచ్చు.1980ల నాటికి రెడ్డి-కాంగ్రెస్, కమ్మ-టిడిపి మిగతా ఇతర కులాలను పోలరైజ్ చేసే రాజకీయ పార్టీలుగా మారాయి. ‘పార్టీ చరిత్ర’ అంటే ‘ఒక నిర్దిష్ట సామాజిక వర్గ చరిత్ర’ (గ్రామ్‌స్సీ 1971) అన్న మాట రెడ్డి కాంగ్రెస్, కమ్మ టీడీపీలకు సముచితంగ వర్తిస్తుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల కంటే ముందు బ్రాహ్మణులదే ఆధిపత్యం. మద్రాసు ప్రెసిడెన్సి కాలంలో బ్రిటీషు ప్రభుత్వంతో సత్సంభంధాలు, జస్టిస్ పార్టీ, నాన్-బ్రాహ్మణ్ ఉద్యమాల ద్వారా కమ్మలు ఆర్థికంగా, రాజకీయంగ బ్రాహ్మణులను సవాలు చేస్తున్నందున, రైతు కులమైన కమ్మలను ఎదుర్కోవడానికి బ్రాహ్మణులు మరొక రైతు కులమైన రెడ్డిలను నైపుణ్యంగా ప్రోత్సాహించారు. చారిత్రాత్మకంగా, రెడ్డిలు కోస్తా ఆంధ్రలో రెడ్డిరాజ్యం కాలం నుండి, అలాగే రాయలసీమలో పోలగార్ వ్యవస్థ ద్వారా అనేక శతాబ్దాల పాటు రాజ్యాధికారాన్ని అనుభవించారు. కాలక్రమేణ, ఈ భూస్వామ్య ధోరణి ఇతర కులాలపై సామాజిక అధికారాన్ని, దొరతనాన్ని తెచ్చిపెట్టింది. రాజకీయ శాస్త్రవేత్త కెరొలిన్ ఇలియట్ (1970) మాట్లాడుతూ, రెడ్డిలు భూములు, వివాహ పొత్తుల ద్వారా బలమైన సామాజిక నెట్‌వర్క్‌ను స్థాపించి, రాజకీయ అధికారాన్ని, ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీని కూడ నియంత్రించగలిగారు. బ్రాహ్మణులు ఆచారాలు, అలవాట్ల ద్వారా సామాజిక గౌరవాన్ని పొందితే, రెడ్డిలు భూమి ద్వారా, కమ్మలు ‘ఆర్థిక శక్తి’ ద్వారా సమాజంలో గౌరవాన్ని పొందారు. 

కాంగ్రెస్, టీడీపీ కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి, అందులో కులం పాత్ర కూడ ఉంది. 1940ల చివరి నుండి రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల సామాజిక పునాది ఎక్కువగా కోస్తా ఆంధ్రలోని కమ్మ కులానికి, అలాగే రాయలసీమ, తెలంగాణలలో రెడ్డిల సామాజిక స్థావరం. కమ్యూనిస్ట్ పార్టీలపై వీరి సామాజిక ఆధిపత్యంపైన పలు విమర్శలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది (కొంచం ఘాటైనది కూడ) రాజకీయ శాస్త్రవేత్త, సెలిగ్ హరిసన్ కామ్రేడ్ పదానికి కమ్మ+రెడ్డి అన్న వక్రభావం కూడా ఇచ్చాడు. 

1980ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక, రాజకీయ రంగాలలో సమూల మార్పులు జరిగాయి. ఒకటి, కమ్మలు అధికారంలోకి రావడం, రెండవది, తెలంగాణ జిల్లాలో OBCలు, కోస్తా, రాయలసీమ జిల్లాలలో బలిజ, కాపు, తెలగ (BKT) కులాలు ఒక cluster రూపం తీసుకొని రాజకీయంగ చైతన్యం పొందడం. తూర్పు కోస్తాలోని తూర్పు కాపులు కూడ ఈ కాపు జాతి clusterలో చేరారు. 1980వ దశకం చివరిలో ముద్రగడ పద్మనాభం, వంగవీటి మోహన రంగా ఇద్దరు కలిసి కాపుల సామాజిక చైతన్యాన్ని రగిలించారని చెప్పాలి. గోదావరి,క్రిష్ణా నది పరివాహక ప్రాంతాల నుండి వచ్చిన వీరు రెండు పనులను ఏకకాలంలో చేయడానికి ప్రయత్నించారు. ఒకటి గోదావరి, క్రిష్ణా జిల్లాలలోని ఆర్థికంగా బలంగా ఉన్న కాపులను ఏకం చేయడం, రెండు-మిగతా జిల్లాల్లో కాపులుగ భావిస్తున్న వారిని (బలిజ, తెలగ, తూర్పు కాపులు, విభజనకు ముందు తెలంగాణలోని మున్నూరు కాపులను కూడ) ఏకతాటిపై తేవడానికి ప్రయత్నించారు. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తునిలో జరిగిన రైలు దుర్ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న, అలాగే ఈ మధ్య పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్న ముద్రగడ పద్మనాభంకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ 1989 మేలో తిరుపతిలో “తెలుగునాడు పార్టీ” అనే పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 80లలో ఎన్ టీఆర్ నీ, టీడీపీనీ ఎదిరించి నిలబడడం అంత చిన్న విషయమేమి కాదు, అలా చేసినందుకు ముద్రగడకు కాపులే కాకుండా అనేక ఇతర వెనుకబడిన కులాలు, వర్గాలు కూడా అండగా నిలిచారు. అయితే ఆ సమయములో కొంత హడావిడి చేసినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక ఆ పార్టీ చివరకు కాంగ్రెస్‌లో విలీనమైంది. అందుకే, రాజకీయ స్థాయిలో కాపుల ఉనికి పీఆర్పీని, జనసేనలను తొలి అడుగులుగ కాక మలి అడుగులుగ మాత్రమే పరిగణించాలి. అంటే పీఆర్పీ, జనసేన ఏర్పాటులను గతంలో కాపు కులాల నాయకులు చేసిన అనేక ప్రయత్నాలకు కొనసాగింపు లాగానే చూడాలి. ముద్రగడ పద్మనాభం, వంగవీటా మోహన రంగా, గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నియో-రిచ్ క్లాస్ సహకారంతో కాపు జాతుల గుర్తింపును రాష్ట్రమంతటా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు, అలాగే ప్రాంతీయ వైరముతో కమ్మ పెట్టుబడిదారులను కూడ  వారు సవాలు చేసారు. అయితే కాపు ఉధ్యమం పతాకస్ధాయిలో ఉన్నప్పుడు  రంగా  హత్య జరిగాక, ముద్రగడ ఒక్కడే అయిపోయి స్ధబ్ధుగ ఉండిపోయాడు. 

ఎన్ టీ ఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కమ్మ, రెడ్డి కులాలకు ఎలా అయితే సమ్మిళిత బిందువులయ్యారో, అలా కాపు కులాలకు కూడ ఒక ప్రతినిధి అవసరం అయ్యాడు. తొలినాళ్ళలో రెడ్లు తర్వాత కమ్మల ఆధిక్యంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో కాపైన చిరంజీవి మెగాస్టారై ఆ ప్రతినిధి పాత్రలోకి చాలా సులువుగా ప్రవేశించడం జరిగింది. అయితే రెడ్లకున్న భూబలం గాని (బాలగోపాల్ గారి మాటల్లో దొడ్డదొరతనం), కమ్మ కులానికున్న ఆర్ధిక బలం గాని, కాపులకు లేదు. అందువలన, అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు సంఖ్యాబలన్ని ముందుకు తెస్తున్నారు. “ఎన్ని ఓట్లుంటే అన్ని సీట్లు” అనే ఈ మాట డెల్టా జిల్లాలో, ముఖ్యంగా, కాకినాడ, విజయవాడ వీదుల్లో ఏ చిన్న గోడపైనైన బులుగు రంగులో విరివిగా కనిపించే మాట. సీట్ల సంఖ్య తేలాలంటే ముందు ఓట్ల సంఖ్య తేలాలి. ఓట్లంటే జనాభా ఎంతో తేలాలి. 

అప్పటి మద్రాస్ ప్రసిడెన్సిలో 1931 లో జరిగిన కుల గణన ఆధారంగా జోసెఫ్ ష్వార్జ్ బర్గ్ ఒక అట్లాస్ తయారు చేశాడు. అందులో కాపు అనే పేరుతో మద్రాసు ప్రెసిడెన్సి (అప్పటి) ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు, మధ్య, ధక్షిణ కోస్తా ప్రాంతాల్లో, అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడాను చాలా మంది నివసించినట్లు అందులో చూపించాడు. అప్పట్లో వీరి సంఖ్య  12.5 నుండి 25% వరకు ఉండేది. అయితే కాపు అనేది ఒక విశాల పదం, రైతు లేదా వ్యవసాయం చేసుకునే వారందరూ కాపులేనని Castes and Tribes of Southern India అనే పుస్తకంలో బ్రిటీషు చరిత్రకారుడు Edgar Thurston వివరించాడు. అంటే ఆ రోజుల్లో వ్యవసాయం చేసుకునే ప్రతి కులం పేరు కాపు. అయితే జోసెఫ్ ష్వార్జ్ బర్గ్ తయారు చేసిన అట్లాస్ లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని ఆంధ్ర ప్రాంతంలో కమ్మలు తప్ప వేరే ఏ కుల ప్రస్తావన లేదు. అప్పట్లో కులగణన జరిగినప్పడు సామాజిక స్పృహ ఉన్న వ్యవసాయం చేసుకుంటున్న సమూహాలు కులాల రూపంలో గణన పరిగణనలోకి వెళ్తే, ఆ స్పృహ లేని వారు కాపు అనే విశాల వర్గంగా మిగిలిపోయారు. ఇప్పుడున్న వ్యవసాయ కులాలు గాని, వెనుకబడిన వర్గాలు (OBCs) కూడ కాపు అనే విశాల వర్గం వచ్చిన వారేనని చెప్పవచ్చు. అలా చూడటం వలన కాపుల జనాభా కలగా పులగంగా ప్రశ్న గానే మిగిలిపోయింది. అది కొందరికి లబ్దికూడ చేసింది. 

ఆ కొద్ది మందే అప్పట్లో పీఆర్ పీ ఇప్పుడు జనసేన ఏర్పడటానికి కారణమైన, ‘రాజకీయంగా 

పైకి ఎదగాలనే చైతన్యం’ (upward social mobile) ఉన్న గోదావరి జిల్లాలలోని కాపులు. క్రిష్ణ, గుంటూరు జిల్లాలో కమ్మలు, రాయలసీమలో రెడ్లు ఎలాగైతే రాజకీయ బలంతో వ్యాపారాన్ని, కులాన్ని కాపాడుకుంటున్నారో (protection) అలాగే గోదావరి జిల్లాలలోని కాపులు తమ వ్యాపారాలను, కులాన్ని కాపాడుకునేందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలాగే, సరళీకరణ అనంతర కాలంలో, భూమి, విద్యుత్, వైద్యం, సాఫ్ట్ వేర్, కళాశాలలు, రియల్ ఎస్టేట్ మొదలైన వాటి కేటాయింపులు వంటి అన్ని ప్రయోజనాలను ఒక నిర్దిష్ట కులానికి మాత్రమే అందించినందున, అది కూడ ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే అందినందున కాపులు కూడ అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రాంషి మాటలలో, “ఏదైనా పార్టీ చరిత్ర సమాజం, రాష్ట్ర సమగ్ర చిత్రణ నుండి మాత్రమే ఉద్భవించగలదు” (1971) అన్న మాట ఆంధ్రప్రదేశ్ లోని కుల, ప్రాంత, రాజకీయాలకు చక్కగా వర్తిస్తుంది. కాపులకన్న ముందు వ్యవసాయ కులాలైన కమ్మ, రెడ్డి అధికారం సంపాదించిన పద్ధతులు(వివాహాలు, భూమి, వ్యాపారాలు, వినోదాత్మమక, సృజనాత్మక), అలాగే దళిత కులాల సామాజిక చైతన్య పద్ధతుల్లో కాకుండా, కాపులు జనాభా ప్రాతిపదికతో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఇక్కడ ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. ముందుగా, పీఆర్ పీ గాని జనసేన గాని, కాపు జాతులను జాతి క్లస్టర్‌ (jati cluster) లోకి ఏకీకృతం చేయలేకపోవడం. 80లలో రంగా, ముద్రగడ పద్మనాభం చేసిన ప్రయత్నాలు ఆ తర్వాత కాలంలో విస్తరించలేదు. వారు కాపులను సమీకరించడానికి ‘కమ్మ’ అనే శత్రువు (enemy) ను తయారు చేసి కాపు కులాల సమీకరణకు ప్రయత్నించారు. క్రిష్ణ, గోదావరి కాపులు చేసిన ఈ ప్రయత్నాలను మిగతా కాపు కులాలైన తూర్పు కాపులు, ఒంటరి, బలిజ, తెలగ కులాలు నమ్మలేదు. క్రిష్ణ, గోదావరి కాపులు పోషిస్తున్న పెద్దన్న పాత్ర ఒకటైతే, రెండవది కాపు కుల సమీకరణాలు కేవలం రాజకీయ పరిధిలోనే జరగడం, అది దాటి సామాజికంగా, సాంస్కృతిక పరమైన అంశాల్లో సమీకరణ ప్రయత్నాలు జరగకపోవడం, అది వ్యక్తుల ద్వారా గాని పార్టీల ద్వారా గాని జరగకపోవడం ఒక సమస్య. 

ఇంక రెండవ సమస్య, ముఖ్యమైనది, కాపు కులాల క్లస్టర్‌ (jati cluster)లో వెనుకబడిన కులాలు (backward castes) మరియు అగ్ర కులాల (forward castes) మధ్య విశ్వాసం లేకపోవడం. కాపులు  BC హోదా కోసం తమ వాదనలు వినిపించినప్పుడు, చాలా మంది BC కాపులు ఈ చర్యను వ్యతిరేకించారు. కాపులు ఆర్థికంగా బలంగా ఉన్నందున, కాపులను BC కేటగిరీ కింద చేర్చడం ద్వారా అన్ని ప్రయోజనాలను పొందుతారని, స్వాతంత్ర్యం ముందు, ఆ తర్వాత ప్రభుత్వాలు నీరు, భూమికి సంభంధించిన పధకాలు ద్వారా, ఏలేరు రిజర్వాయర్, రైలు, రోడ్డు వసతులు, మెు॥ వలన కాపులు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగ బలమైన స్ధాయిలోకి వెళ్ళారు. కాపుల ప్రయాణం కౌలుదారుల నుండి భూస్వాములు అవ్వడం, సన్న, చిన్నకారు రైతుల నుండి పెత్తందారీ తనం వరకు రావడం జరిగింది. అలాగే, డెల్టా జిల్లాలోని కాపులు ఎక్కువ మంది ‘నాయుడు’ అనే బిరుదును వాడుతున్నారు, ఇదంతా గమనిస్తే, కాపులు బూర్జువ, అగ్రకులాల వలే ప్రవర్తిస్తున్నారని అర్ధం అవుతుంది. అలాంటిది ఇప్పుడు కాపులు వెనుకబడిన కులాలుగా  (backward classes) గుర్తించమని ప్రభుత్వాన్ని అడగడం అన్యాయం, అప్రజాస్వామికం అని  కాపు జాతులైన తూర్పు కాపులు, బలిజలు, ఒంటరి, తెలగలు అంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యం చెలాయిస్తున్న కాపులను ఈ జాతులు విశ్వసించలేకపోతున్నాయి. అలాగే 1990లలో మండల్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడి ఇప్పుడు అందులోనే కలపమని అడగడం వలన, దానికి ‘సామాజిక న్యాయం’ సిద్ధాంతం అనే పేరు పెట్టడం వలన కాపులు మిగతా కులాల నమ్మకాన్ని కోల్పోయారు. 

ఈ అంతర్గత చిక్కును సామాజికంగ గాని రాజకీయంగ గాని పరిష్కరించలేకపోవడం ప్రధాన సమస్య. పీఆర్ పీ, జనసేన, రెండు కూడ ఈ రిజర్వేషన్ సమస్యను నిర్మాణాత్మక మార్గంలో పరిష్కరించలేకపోయారు. ఈ అస్పష్టత కాపు జాతి సమీకరణకు గుదిబండగా మారిందని చెప్పవచ్చు. గోదావరి కాపులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఇతర కాపు జాతులు గుర్తించారు. పైగా, ఈ జాతులు ప్రత్యేక కుల సంఘాలను ఏర్పాటు చేయడం, పాఠశాలలు, హాస్టల్‌లు, ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేయడం ద్వారా సమీకరణ మరింత కష్టతరం అయింది, దాని ప్రభావం రాజకీయాధికార సాధనపై కూడ పడుతుంది.

 
Satish Chennur
Satish Chennur
Satish has a PhD degree in Sociology from the University of Hyderabad. He is currently an assistant professor of Sociology at the Center for Studies in Social Sciences (CSSSC), Kolkata. He does research on topics such as the political economy of regions, the sociology of caste, and politics.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles