ప్రఖ్యత క్రికెట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ యాంజియోప్లాస్టీ తర్వాత రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి ఆదివారంనాడు డిశ్చార్జ్ అయ్యారు. 61 సంవత్సరాల కపిల్ అర్ధరాత్రి గుండె నొప్పి వచ్చి గురువారం (తెల్లవారితే శుక్రవారం) దిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ లో చేరారు. వెంటనే డాక్టర్ అతుల్ మాథుర్ కపిల్ దేవ్ కి యాంజియోప్లాస్టీ చేశారు. గుండె ధమనులలో ఏర్పడిన నెత్తురు గడ్డలను తొలగించి రక్తప్రసారాన్ని యథావిధిగా పునరుద్ధరించే ప్రక్రియను యాంజియోప్లాస్టీ అంటారు.
లండన్ లో 1983లో వెస్టిండీస్ పై గెలుపొంది ప్రపంచ క్రికెట్ సాధించిన భారత జట్టుకు నాయకుడైనా కపిల్ చరిత్ర సృష్టించారు. చరిత్రలోకి ఎక్కారు. అదే సిరీస్ లో జింబాబ్వేపైన జరిగిన మ్యాచ్ లో 175 పరుగులు చేసి అజేతగా నిలిచిన కపిల్ దేవ్ ఆల్ రౌండర్ గా అద్భుతాలు సాధించారు. ఐదురోజుల ఆటలో 400కు పైగా వికెట్లు తీసుకొని 5000లకు పైగా పరుగులు తీసిన ఒకే ఒక ఆల్ రౌండర్ గా క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ మిగిలిపోయారు.
కపిల్ దేవ్ తెలుగువారికి సుపరిచితులు. ఆయన ఇటీవల గుంటూరు, హైదరాబాద్ నగరాలను సందర్శించి రామినేని ఫౌండేషన్ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత జట్టుకు కోచ్ గా కూడా కపిల్ పని చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ హాల్ ఆప్ ఫేమ్ లో 2010లో కపిల్ ను చేర్చారు.