అశ్వినీకుమార్ ఈటూరు
కన్నడ కంఠీరవ బిరుదాంకితుడు, కన్నడ సూపర్ స్టార్ స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పాలైనారు. పునీత్ శుక్రవారంనాడు జిమ్ లో ఉండగా గుండెపోటు వచ్చి అక్కడే కూలిపోయారు. మధ్యహ్నం 12 గంటలకు ప్రైవేటు ఆస్పత్రి విక్రమ్ లో చేర్చించారు. ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడే పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్ రంగనాథ్ నాయక్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఆస్పత్రికి వెళ్ళి నటుడుని చూసి పరిస్థితి తెలుసుకున్నారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్ళారు.
కన్నడ పవర్ స్టార్ గా ప్రఖ్యాంతి గడించిన పునీత్ ను అప్పు అని అభిమానులు పిలుచుకుంటారు. ఆయన 29 సినిమాలలో నటించారు. అయిదేళ్ళ వయస్సులోనే బాలనటుడిగా సినిమాలలో నటించారు. బెట్టాడ హూవు అనే సినిమాలో నటనకు 1985లోనే జాతీయ అవార్డు తెచ్చుకున్నాడు. రాజ్ కుమార్ కు పునీత్ మూడో కుమారుడు. రోజుకు మూడు నాలుగు గంటలు వ్యాయామం చేస్తారనీ, మంచి ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటారనీ, గుండెపోటు ఆకస్మికంగా వచ్చిందనీ అభిమానులు తెలియజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో విక్రమ్ ఆస్పత్రికి చేరుకోవడంతో గవర్నర్ రోడ్డు పైన భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సినిమాహాళ్ళను మూసివేశారు.
46 సంవత్సరాల పునీత్ గురువారం రాత్రి ఛాతిలో నొప్పిగా ఉన్నదని ఇంట్లోవారితో అన్నారు. పొద్దునే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పినవారి సలహాను పెడచెవిన పెట్టి జిమ్ కి వెళ్ళారు. జిమ్ లో ఎక్సర్ సైజు చేస్తూ ఉండగానే 9.30 గంటల ప్రాంతంలో విపరీతమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న రమణశ్రీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పెద్ద ఆస్పత్రి విక్రమ్ కి వెళ్ళారు. అప్పటికే పునీత్ ప్రాణం పోయిందనీ, ఉదయం గం.11.40 ని.లకే పునీత్ మరణించారని విక్రమ్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
పునీత్ హీరోగా నటించిన సినిమాలు చాాలా కమర్షియల్ గా హిట్ అయ్యాయి. అప్పు(2002), అభీ (2003), వీరకన్నడిగ (2004), మౌర్య(2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు(2007), మిలానా (2007), వంశీ(2008), రామ్ (2009), జాకీ (2010), హుడుగరు (2011), రాజకుమార (2017), అంజని (2017) వంటి సినిమాలు బాగా ప్రాచుర్యం పొందాయి. శాండల్ వుడ్ ఇండస్ట్రీలో పునీత్ మరణ వార్తా దావానలంగా వ్యాపించింది.
రాజ్ కుమార్ కీ, పార్వతమ్మకు పుట్టిన ముగ్గురు కుమారులలో పునీత్ ఆఖరివాడు. భజరంగి సినిమా విడుదలైన సందర్భంగా శుక్రవారం ఉదయమే అన్న శివరాజ్ కుమార్ కు ట్వీట్ పెట్టారు.భజరంగీ టీమ్ సభ్యులందరికీ అభినందనలు అంటూ సందేశం పంపించారు. అదే పునీత్ చివరి ట్వీట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వీరేంద్ర షెహవాగ్, వెంకటేష్ ప్రసాద్ వంటి క్రికెట్ దిగ్గజాలూ, తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి, మంచు లక్హి,తదితరులు సోషల్ మీడియాలో సంతాపసందేశాలు పంపించారు. పునీత్ చిక్కమగళూరుకు చెందిన అశ్వినీ రేవంత్ అనే అమ్మాయిని స్నేహితుల మధ్యవర్తిత్వంలో 1 డిసెంబర్1999న పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు – ధ్రితి, వందిత. కౌన్ బనేగా కరోడ్ పతి లాగానే కన్నడలో ‘కన్నడ కోట్యాధిపతి’ పేరుతో మొదటి సీజన్ కార్యక్రమానికి హెస్ట్ గా 2012లో పని చేశారు.