- బ్రిస్బేన్ గబ్బాలో నేథన్ లయన్ టెస్టుల సెంచరీ
- 13వ ఆస్ట్రేలియాక్రికెటర్ నేథన్ లయన్
ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ ,33 సంవత్సరాల నేథన్ లయన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. బ్రిస్బేన్ గబ్బా వేదికగా భారత్ తో ప్రారంభమైన ఆఖరిటెస్టు బరిలోకి దిగడం ద్వారా 100 టెస్టుల మైలురాయిని చేరుకొన్నాడు.
గతంలో ఇదే ఘనత సాధించిన స్టీవ్ వా,జస్టిన్ లాంగర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్, బోర్డర్, మెక్ గ్రాత్, క్లార్క్, డేవిడ్ బూన్ తో సహా మొత్తం 12 మంది కంగారూ క్రికెటర్ల సరసన నిలిచాడు. సాంప్రదాయటెస్ట్ క్రికెట్ చరిత్రలో 100 టెస్టులు ఆడిన ఆరో స్పిన్నర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.
స్పిన్ దిగ్గజాల సరసన…
వందటెస్టులు ఆడిన స్పిన్ దిగ్గజాలలో ముత్తయ్య మురళీధరన్ ( 133 టెస్టుల్లో 800 వికెట్లు), షేన్ వార్న్ ( 145 టెస్టుల్లో 708 వికెట్లు ), అనీల్ కుంబ్లే (132 టెస్టుల్లో 619 వికెట్లు), హర్భజన్ సింగ్ (103 టెస్టుల్లో 417 వికెట్లు ), డేనియల్ వెట్టోరీ (113 టెస్టుల్లో 362 వికెట్లు ) ఉన్నారు.ప్రస్తుత సిరీస్ లోని సిడ్నీ టెస్ట్ వరకూ 99 మ్యాచ్ లు ఆడిన లయన్ 396 వికెట్లు సాధించాడు. బ్రిస్బేన్ వేదికగా తన 100వ టెస్ట్ మ్యాచ్ ద్వారా 400 వికెట్ల రికార్డు పూర్తి చేయాలన్నపట్టుదలతో లయన్ ఉన్నాడు.
ఇదీ చదవండి: కంగారూల కోటలో భారత్ పాగా ?
10 సంవత్సరాలు…396 వికెట్లు…
2011 సీజన్లో శ్రీలంక లోని గాల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన లయన్ ఆ తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు. నిలకడగా రాణిస్తూ కంగారూజట్టులో తన స్థానం నిలుపుకొంటూనే వస్తున్నాడు.
గత దశాబ్దకాలంగా ఆస్ట్రేలియా క్రికెట్ కు ప్రధాన స్పిన్నర్ గా సేవలు అందిస్తున్న లయన్ టెస్టుమ్యాచ్ ల సెంచరీ పూర్తి చేసిన 16వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు…షేన్ వార్న్, మెక్ గ్రాత్ ల తర్వాత వందటెస్టులు ఆడిన మూడో ఆస్ట్రేలియన్ టెస్ట్ బౌలర్ గా నిలిచాడు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార జాడ్యం