Thursday, December 26, 2024

మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం

తెలుగు రచయిత, సంఘసంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు: ‘‘కార్యశూరుడు వీరేశలింగం/కదం తొక్కి పోరాడిన సింగం/దురాచారాల దురాగతాలను/తుదముట్టించిన అగ్నితరంగం’’- ఇది కందుకూరివారి 174వ జయంతి (16 ఏప్రిల్ 1848 – 27 మే 1919).

‘‘ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చావు’’ అని అధికారి అడిగాడు. అందుకు వీరేశలింగం చెప్పిన సమాధానం  అధికారి నోరు మూయించింది. ‘‘అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెబుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే – అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది!’’ అని తాపీగా సమాధానం ఇచ్చారు వీరేశలింగం.

Also read: సెంగోల్:  రాజ్యాంగం పై సర్జికల్ స్ట్రైక్

ఈ విషయం ‘‘మూఢనమ్మకాలపై నా పోరాటం’’అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు (పే.24). అభిరుచి ఉన్నవారు ఆ పుస్తకం సంపాదించి, క్షుణ్ణంగా చదవడం మంచిది. అందులో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. అందులో ఒకటి ‘శకునాలు’ అనే శీర్షికతో ఉంది. ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా పొందుపరుస్తున్నాను. సున్నిత హాస్యం, వ్యంగ్యం మేళవించి ఎంతో మనోరంజకంగా రాశారు గమనించండి!

కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం చెయ్యాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు. పైగా ఘడియ ఘడియకీ ముహూర్తాలు చూసుకునే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ ఉండేవారు. ఆ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొచ్చారు. ఇన్నిన్ని చాదస్తాల మధ్య ఆ కాలం మనుషులు ఎలా బతికారబ్బా? అని ఆశ్చర్యపోవాల్సివస్తుంది కూడా!

*****                                              *****                              *****

ఆడవాళ్ళను తీసుకుని మంచీచెడ్డా విచారించకుండా దూరాభారం ఎలా బయలుదేరనండీ? పోనీ అమావాస్యకు మందే బయలుదేరుదామంటే దోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పినారు. అమావాస్య వెళ్ళిన పాడ్యమి ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు. విదియనాడు బయలుదేరుదామంటే, ఆ రోజు శుక్రవారం అయ్యింది. అక్కడికీ మొండిగా చొదవచేసి, బయలుదేరుదామని అనుకునేంతలో ఎవర ‘‘హాచ్చ్’’ మని తుమ్మినారు. అటువంటి అపశకునం అయిన తర్వాత ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికి మానేశాం. శనివారం ఉదయమా దుర్ముహూర్తం! పిల్లలను తీసుకుని ఎలా బయలుదేరడం? ఆ మధ్యాన్నమేమో వర్జ్యం వచ్చింది. వర్జ్యం వెళ్ళిన తరువాతి రాత్రి బండికోసం కబురు చేయబోతుంటే గుడ్లగూడ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా? ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏ మాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా?

Also read: ‘జైహింద్’ ఆలోచన మన హైదరాబాదువాడిదే!

తరువాతి రోజు పంచమి. బయలుదేరాలి. కానీ, ఉదయాన నక్షత్రం మంచిది కాదు. అదీ కాకుండా వర్జ్యం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదేరుదామని భోజనం చేసి పచార్లు చేస్తూ ఉంటే, మాలబల్లి మీదపడింది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి, దీపం పెట్టుకుని శాంతీ గీంతీ చేసుకునేప్పటికి దీపాల వేళయ్యింది. రాత్రి భోజనాలు చేసి బయలుదేరుదామంటే, పెద్దలందరూ చుక్క ఎదురు వెళ్ళకూడదన్నారు. సరే – ఆ మరుసటి రోజు షష్ఠి. ఒక్క షష్ఠి మాత్రమే అయితే ఎలాగయినా బయలుదేరుదును. కానీ ఆరోజు పిడుగువలె మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికి తోడు  ఆ రోజు  వట్టి పాడు నక్షత్రం. ఇక సప్తమీ బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ ఆ రోజు మా చిన్న కుర్రవాడి పుట్టినదినం.  ఆ పండుగ ముగించుకుని భోజనాలు చేస్తేగాని బయలుదేరేది లేదని ఇంట్లొ ఆడవాళ్ళు పట్టుపట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానికే దొంగలమర్రి దాటిపోయేవాళ్ళం. దొంగలమర్రి అంటే దారిదోపిడి దొంగలు పొంచి ఉండే చోటు. కానీ, భోజనాలు కాగానే బయలుదేరుదామని బండి కట్టించి తీరా ఎక్కబోయే సరికి వెధవముండ ఎదురుగా వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి అర్ధగంట సేపు ఆగినాము. అప్పుడు బయలుదేరినా దీపాలు పెట్టకముందే దొంగలమర్రి దాటేసేవాళ్ళం.

కానీ విధి గుమ్మంలోకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్ళి కొంతసేపు ఆగినాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవరూ నడవకుండా జాగ్రత్తపడి పొరుగింట్లో నుంచి ఒక ముత్తయిదువును ఎదురు రమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరినాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా – ఆ వెధవముండ ఎదరుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి పది గంటలకు మేము జడుస్తూనే దొంగలమర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకుపోయారు. మేం మంచి శకునం చూసుకుని బయలుదేరడం వల్ల – ప్రాణాలు కాపాడుకోగలిగాం- మొన్న ఓ సారి జాతకం చూపించుకుంటే – నాకు ధన నష్టం ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే  కదా? జ్యోతిష్యం తప్పలేదు.

Also read: గుర్తిస్తే, మానవవాదులు మన‘లోనే’ ఉన్నారు!

****                                                     ****                          ****

జ్యోతిషాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్ళీ పట్టుకుని వేళ్ళాడుతారు. ఒక విధంగా జ్యోతిషం చెడిపోయిన గడియారం లాంటిది. రోజుకు రెండు సార్లు ఆగిపోయిన గడియారం కూడా సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిషాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెపితే, అందులో కొంత మేరకు నిజమయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇక పోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికినవాళ్ళు ‘ఆ దేవుడి దయవల్ల బతికామ’ని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయినవారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలికదా? కానీ చెప్పరు. ఒక వేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది – ‘‘కారు బ్రేకులు ఫెయిల్ అయి, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృతి చెందారు’’- అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు.

ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం – తప్పు  బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం – ఏమైనా బాగుందా?తప్పు దేవుడిపైన పెట్టి ఆయనే చంపేశాడని అనుకునే ధైర్యం ఉండదు. ప్రజల ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్లకదా దేవుడు, జ్యోతిషం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాల సమాజంలో సజావుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉంది?  మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజానిజాలు బయటపడతాయి!‘‘దైవాన్నీ, జ్యోతిషాన్నీ నమ్మేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధివిధానాలని మార్చుకుంటూ ఉంటారని’’ – వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూడనమ్మకాల్లో పడిపోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి! ఇక ప్రస్తుత పరిస్థితుల్లోకి వద్దాం.

Also read: తొలి భారతీయులు ఎవరు?-1

‘‘మహాభారత కాలంలోనే శాటిలైట్, ఇంటర్నెట్ ఉంది’’ అని అన్నాడు త్రిపుర ముఖ్యమంత్రి. నిజమే! ఆయన ఊహ ప్రకారం ఆ రోజుల్లో చాలా చాలా జరిగేవేమో – బహుశా ఆ ‘‘ఊహలు’’ ఇలా ఎందుకు ఉండకూడదూ? ఊహలకు పరిధి ఏముంటుందీ? ఎలాగైనా ఉండొచ్చు. ఉదాహరణకు ఇలా కూడా ఉండొచ్చు-

(యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు భయానక యుద్ధచిత్రాల్ని ట్విట్టర్ లో అప్ డేట్స్ పెడుతుండేవాడు. అర్జనుడు వాటిని ఫాలో అవుతూ ఇన్ స్టాగ్రామ్ లో తన సైనిక బలగాలకు సూచనలిస్తుండేవాడు. ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాల్ని ఆన్ లైన్ ఎఫ్.ఎం. రేడియోలో వినేవాడు. పాండవులు తమ ‘ఐఫోన్’లో సెల్ఫీలు దిగేవారు. కౌరవులు తమ వాట్సప్ గ్రూపుల్లో ఉత్సాహభరితంగా సందేశాలు పంపుకునేవారు. తమ సైనికుల సాహసోపేతమైన దృశ్యాల్ని షేర్ చేసుకునేవారు. యుద్ధాన్ని మొత్తం ఫేస్ బుక్ లో ప్రసారం చేసేవారు. బీబీసీ, యస్.యన్.ఏ, 24 ఫ్రాన్స్, వియాన్, ఇండియాటుడే, యన్డీటీవీలలో యుద్ధ వ్యూహాలపై విశ్లేషణ జరిపేవారు…)

-ఇలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న దేశభక్తుల్నిమనం ఎద్దేవా చేయడం కాదు. వాళ్ళకు వాళ్ళే, వాళ్ళేమిటో నిరూపించుకుంటున్నారు. లేకపోతే అర్ధసత్యాలతో, అబద్ధాలతో తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెపుతాడా? ‘నేడే చూడండి’- అంటూ ఊళ్ళల్లో ఓ మైకు రిక్షా తిరుగుతూ ఉండేది. ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ (PARZANIA) పూర్తి హిందీ సినిమా యూట్యూబ్ లో ఉంది. అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేతగాకే భాషణ్ లిస్తుంటాడని సగటు భారతీయుడికి అర్థమైంది. ఇటీవల పెరిగిన పెట్రోలు, డిజిల్ ధరలతో సామాన్యుల నుండి భారత ప్రభుత్వం వసూలు చేసిన టాక్స్ 26.51 లక్షల కోట్లు. గతంలో కార్పొరేట్లకు ఇదే ప్రభుత్వం చేసిన రుణ మాఫీ 10.86 లక్షల కోట్లు.

మూఢనమ్మకాలు, జ్యోతిషం, వాస్తు, ఆవుపేడ, ఆవుమూత్రం వంటి వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని ‘‘హిందూరాష్ట్ర’’గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచుతున్నారు. దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?’’ అని దేశ ద్వితీయ పౌరుడైన (లోగడ) తెలుగువాడు ప్రశ్నిస్తుంటే-మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక సాధారణ శకానికి పూర్వకాలంలో ఉన్నామా? అని అనుమాన పడాల్సి వస్తోంది. ఇప్పుడు బంతి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాల కోర్టులో ఉన్నది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గలసామాన్య పౌరులు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే- ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి ఉంటుంది.

Also read: తొలి భారతీయులు ఎవరు? -2

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles