ఆకాశవాణిలో నాగసూరీయం –12
రాజీవ్ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో జిల్లాస్థాయి ఆకాశవాణి కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కనుకనే, 1990, 1991 ప్రాంతంలో తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం, నిజామాబాద్, వరంగల్, కొత్తగూడెం వంటి ఎఫ్. ఎమ్. కేంద్రాలు మొదలయ్యాయి. తొలిదశలో ఈ జిల్లా ఆకాశవాణి కేంద్రాలు రేడియో సెట్లు లేకుండా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కున్నాయి. అంతవరకు రేడియో ప్రసారాలు మీడియం వేవ్, షార్ట్ వేవ్ పైనే నడిచేవి. అయితే వాతావరణ పరిస్థితుల మార్పులను కూడా అధిగమించే ఎఫ్.ఎమ్. ప్రసారాలు వినడానికి హాయిగా వుంటాయి. 30 ఏళ్ళ క్రితం ఎఫ్.ఎమ్. రేడియో కావాలంటే రేడియో రిపేరు షాపులో ఒక అదనపు భాగం ఏర్పాటు చేసే పరిస్థితి వుండేది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో యాప్ లో అన్ని కేంద్రాలు అందుబాటులోకి రావడంతో, రేడియో సెట్ దొరకడం కష్టం, రేడియో రిపేరు కావడం ఇంకా కష్టం!
Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!
విజయవాడకు బదిలీ
చేసే ఉద్యోగం ఒకే కేడర్ అయినా అది ఊరు బట్టి, ప్రాంతం బట్టి విభిన్నంగా వుండాల్సిన అవసరం వుంటుంది. సంస్కృతీపరంగా, ఆర్థికపరంగా వైవిధ్యం ఉన్నప్పుడు అవకాశాలు కూడా చూడగలిగితే విశేషంగా గోచరిస్తాయి. 1996 సంవత్సరం మధ్యప్రాంతంలో అనంతపురం నుంచి విజయవాడ ఆకాశవాణికి బదిలీపై వచ్చాను.
ఎంతోకాలంగా శ్రీరామనవమికి భద్రాచలం రాములవారి కల్యాణానికి విజయవాడ ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేసేది. కొత్తగూడెం ఆకాశవాణి పరిధిలోకి భద్రాచలం గుడి, శ్రీరామనవమి ప్రత్యక్ష వ్యాఖ్యానం వెళ్ళిపోయాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం అప్పటి నిర్దేశకులు డా. ఆర్. అనంతపద్మనాభరావు కొంత విభిన్నంగా ఆలోచన చేసి , విజయదశమికి కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం చేద్దామని నిర్ణయించారు. అలా 1996 విజయదశమి నుంచి అది మొదలైంది. నేను అక్కడ పనిచేసిన ఐదున్నర సంవత్సరాల కాలంలో ఆరు తెప్పోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యాన పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాను.
Also read: జంట ప్రసంగాల కదంబం – బొమ్మా, బొరుసా
తెప్పోత్సవానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం
తొలిదశ కనుక కొన్ని విధివిధానాలు స్థిరపడ్డానికి కొంత ప్రత్యక్ష అనుభవం అవసరం. ఇంద్రకీలాద్రి కొండమీద నుంచి అమ్మవారు విజయదశమి రోజున దిగివచ్చి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలో బయలుదేరి, ప్రకాశం బ్యారేజ్ దాకా కృష్ణానదిలో పయనించి, అక్కడ మూడు చుట్లు తిరిగి మళ్ళీ ఒడ్డు చేరడం ఈ తెప్పోత్సవం!
దీనిని నేరుగా చూసే అవకాశం లేనివారికి , ఆ అనుభవాన్ని చెవుల ద్వారా అందించే ప్రయత్నమే ప్రత్యక్ష వ్యాఖ్యానం! దీనికోసం గట్టున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరం నుంచి ఆకాశవాణి కామెంటేటర్లు ఆ ఉత్సవ కార్యక్రమ వివరాలు, సందోహాన్ని శ్రోతలకు తమ వాక్ధారలతో అందిస్తారు. ఇలా ఇద్దరు వ్యాఖ్యాతలు ఒకరితర్వాత ఒకరు, మూడు నాలుగు నిమిషాలకి ఒకసారి పరస్పరం మార్చుకుంటూ మొత్తం దృశ్యాన్ని మనముందుంచుతారు. మొవ్వా వృషాద్రిపతి, రాళ్ళబండి కవితాప్రసాద్, జంధ్యాల మహతీ శంకర్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, మైలవరపు శ్రీనివాసరావు, పద్దిపర్తి పద్మాకర్, మొదలైన పండితులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలై విజయవంతంగా నిర్వహించారు.
ప్రత్యక్ష సాక్షి కథనం
ఆకాశవాణి ప్రసారాలు ఢిల్లీ నుంచి, హైదరాబాదు నుంచి వార్తా కార్యక్రమాలను ఇవ్వడం పరిపాటి. సాయంకాలం 5.30 కు తెప్పోత్సవం ప్రత్యక్షప్రసారాన్ని మొదలుపెట్టాం. అయితే ఆరుగంటలకు ఇంగ్లీషు వార్తలు, 6.05 కు సంస్కృతం వార్తలు, 6.15 కు ప్రాంతీయ వార్తలు రావడం వల్ల తెప్పోత్సవంలో కీలక ఘట్టం శ్రోతలు మిస్సయ్యారు. ఈ వార్తా కార్యక్రమాలు ఎంతోకాలంగా ఉన్నాయి గనుక, ప్రత్యక్ష ప్రసారం కాకుండా ప్రత్యక్ష సాక్షికథనం చేయడం మరుసటి సంవత్సరం నుంచి ప్రారంభించాం. జరుగుతున్నది జరుగుతున్నట్టు వివరించడం ప్రత్యక్ష ప్రసారం. ఇందులో సంఘటన జరుగుతున్నంతకాలం ప్రత్యక్ష ప్రసారం సాగాల్సిందే. ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ప్రత్యక్షసాక్షి కథనం! సంఘటన జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించి, కొంత వ్యవధి తరువాత జరిగినదంతా పూసగుచ్చినట్లు ఆసక్తికరంగా వివరించడమే ప్రత్యక్ష సాక్షి కథనం. దీనికీ, సమీక్షకు తేడా వుంటుంది.
మధ్యలో పద్యాలు, శ్లోకాలు
ప్రత్యక్ష సాక్షి కథనంలో సంభ్రమాశ్చర్య ఆనందాలను సైతం అందివ్వచ్చు. ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా పొందే అనుభూతిని పూర్తిగా, తక్కువ వ్యవధిలో ఇవ్వగలిగే సదుపాయం కూడా ప్రత్యక్ష సాక్షి కథనంలో వుంటుంది. మొత్తం సంఘటన సంబంధించి ప్రతి విషయం పట్ల పర్యవేక్షకునికి అవగాహన వుండి, ఏది అవసరమో, ఏది శ్రోతలకు ఉపయోగకరమో, ముందుగానే గమనించి వ్యాఖ్యానాన్ని మలచుకోగలగాలి. కథనాన్ని రంజింప చేయడానికి మధ్యమధ్యలో చిన్న చిన్న వాక్యాలతో శ్రోతలనుద్దేశించి మాటాడుతూ, అవసరమనిపించినప్పుడు కొన్ని పద్యాలనో శ్లోకాలనో ప్రస్తావిస్తూ చేయవచ్చు. తెప్పోత్సవ సందర్భంలో విజయవాడ వీధులు జనంతో నిండిపోతాయి. అటువంటి సమయంలో మా సామగ్రిని తీసుకుని వెళ్ళి, అక్కడ నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం నిర్వహించడం మామూలుగా కష్టసాధ్యం. ప్రత్యక్ష సాక్షి కథనం అయితే, ప్రసార సమయానికి ముందుగానే ఆ కామెంటేటర్లు స్టూడియోను చేరుకోవలసి వుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కారు సదుపాయం ఉన్నా, దానిని బయటికి తీసి ముందుకు నడిపించడం ఇంకో యజ్ఞం.
Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!
అదో గొప్ప సాహసం!
ఒకసారి నేను, నా సహోద్యోగి బి. వెంకటేశ్వర్లు, మొవ్వ వృషాద్రిపతి, మరో కామెంటేటర్ కలిసి వెళ్ళాం. సంఘటన కాస్త ముగుస్తుండగానే ఓ.బి. శిబిరం నుంచి దిగి స్టూడియో చేరుకోవాల్సి వుంటుంది. ఆ సంవత్సరం అమ్మవారి తెప్పలో చిన్న అగ్నిప్రమాదం జరగడంతో నిచ్చెనను తీసుకెళ్ళిపోయారు. ప్రమాదం పెద్ద నష్టం కలిగించలేదు కానీ, మేము ఏ నిచ్చెన ఎక్కి పైన వుండే శిబిరానికి వెళ్ళామో, ఆ నిచ్చెన మళ్ళీ తిరిగి రాలేదు. ఆ పరిస్థితుల్లో ఏ అధికారికీ సమాచారం కూడా పంపలేము. అప్పటికింకా మొబైల్ ఫోన్లు కూడా రాలేదు. ఆరోజు మా వ్యాఖ్యాతను జాగ్రత్తగా పది, పదిహేను మంది కలిసి కిందికి దించుకోవడం గొప్ప సాహసంగా గుర్తుండి పోయింది.
విజయదశమి అనగానే నాకు ఈ తెప్పోత్సవ అనుభవాలు బోలెడు గుర్తొస్తుంటాయి. అంతకు మించి ఇంతకు ముందు పేర్కొన్న సందర్భంలోనే మహీధర రామమోహనరావుగారి శ్రద్ధాంజలి కార్యక్రమం ఈ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రసారం తరువాత రూపొందించాల్సిన బాధ్యత కూడా ఉంది. కనుక నాలో ఉద్విగ్నత మూడు, నాలుగు రెట్లు పెరగడం ఇంకో విశేషం. ఆ శ్రద్ధాంజలి కార్యక్రమ అనుభవాలు మరోసారి పంచుకుందాం.
Also read: అన్నమయ్య పదగోపురం
— డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి
పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392