- తమిళనాడులో పాగాకు ఎంఐఎం కసరత్తు
- కమల్ హాసన్ తో పొత్తు చర్చలు?
- మారునున్న రాజకీయ సమీకరణాలు
రాబోయే కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కరుణానిధి, జయలలితలు సినీ నేపథ్యం నుంచి వచ్చి సుధీర్ఘకాలం పాటు తమిళ రాజకీయాలను శాసించారు. ఇద్దరూ లేకుండా తమిళనాడులో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బీహార్ లో సత్తా చాటిన ఎంఐఎం:
హైదరాబాద్ పాత బస్తీలో బలీయమైన శక్తిగా ఉన్న ఎంఐఎం తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా చాటిన ఎంఐఎం తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని రజనీకాంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం సినీనటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
ముస్లింల ఓటు బ్యాంకుకు ఎంఐఎం గాలం:
దీనికి సంబంధిచి తమిళనాడు ఎంఐఎం కు చెందిన పార్టీ నేతలతో ఈ రోజు అసదుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. జనవరిలో చెన్నై, తిరుచ్చి నేతలతో సమావేశమై దీనికి తుది రూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కనీసం 25 స్థానాలలో పోటీ చేయాలని ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న మధురై, వెల్లూర్, రాణిపేట్, తిరుపట్టూర్, కృష్ణగిరి, రామాంతపురం, పుదుకొట్టై, తిరుచ్చి, తిరునల్వేలి ప్రాంతాలలో పోటీ చేయాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటి వరకు ముస్లింలు డీఎంకే, అన్నాడీఎంకేల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేందుకు ఇండియన్ నేషనల్ లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మణితనేయ మక్కల్ కచ్చి, మణితనేయ జననాయగ కచ్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తౌహీద్ జమాత్ లాంటి పార్టీలు ఉన్నా అవి ఎన్నికల్లో నామమాత్రంగానే ప్రభావం చూపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే,బీజేపీ కలిసి పోటీచేసే అవకాశాలున్నందున ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:యుద్ధానికి సిద్ధం అవుతున్న దళపతి
ప్రధాన పార్టీలకు గడ్డుకాలం:
మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏప్రిల్ మేనెలల్లో జరగనున్నందున పొత్తు కూర్పుపై జనవరిలో తుది రూపు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. పొత్తు ఖాయమైతే ప్రధాన పార్టీల విజయావకాశాలు దారుణంగా దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: తమిళనాడు రాజకీయాలలో మూడుముక్కలాట
ఇదీ చదవండి: రజినీ పార్టీ పెడతారు