తమిళనాడులో మరి కొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు రోజుకొక రకంగా మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మూడవ కూటమి కూడా ఏర్పాటైంది. దీనికి కమల్ హాసన్ సారథ్యం వహిస్తున్నారు. ఈ కూటమిలో కమల్ స్థాపించిన మక్కళ్ నీది మయ్యమ్ కు తోడుగా మరో రెండు పార్టీలు జత కలిశాయి. ఇండియా జన నాయగ కచ్చి (ఐ జె కె ), మరో నటుడు శరత్ కుమార్ స్థాపించిన ఆల్ ఇండియా సముదవ మక్కళ్ (ఏఐఎస్ఎంకె ) ఒక గొడుగు కిందకు వచ్చాయి.
మూడు పార్టీల కూటమి
ఈ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగినట్లు పార్టీల నేతలు మంగళవారం నాడు వెల్లడించారు .ఈ కూటమి విజయం సాధిస్తే, ముఖ్యమంత్రిగా కమల్ హాసన్ ను ఎంచుకుంటామని నటుడు శరత్ కుమార్ ప్రకటించారు. తమిళనాడులో ఎన్నో ఏళ్ళ పాటు డిఎంకె – ఏఐఏడిఎంకె కూటముల మధ్యనే పోరు నడిచింది. ఏ జాతీయ పార్టీయైనా ఈ రెండు పార్టీల్లోని ఏదో ఒక పార్టీతో జత కట్టాల్సివచ్చేది. ఇప్పటి దాకా అదే సాగింది. కాంగ్రెస్ పార్టీ డిఎంకె తో, ఏఐఏడిఎంకెతో బిజెపి కలిసి కాపురం చేస్తున్నాయి. రజనీకాంత్ పార్టీ స్థాపించి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని వుంటే దృశ్యం ఇంకో విధంగా ఉండేది. ఆయన అనారోగ్యంతో ఆట విరమించుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ చుట్టూ సరికొత్త రాజకీయాలు నడుస్తున్నాయి.
Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు
మూడో కూటమి
ఆ రెండు ద్రవిడ సిద్ధాంతల పార్టీలకు విభిన్నంగా, ప్రత్యామ్నాయంగా నేను నడుస్తాను, అని కమల్ హాసన్ చెబుతున్నారు. కమల్ హాసన్ కు, ఆయనతో జత కలిసిన మిగిలిన పార్టీలకు అంత సీన్ ఉందా? అని అడిగితే, లేదనే ఎక్కువమంది సమాధానం చెబుతున్నారు. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు లేకపోవడంతో తనను తాను హీరోగా ప్రతి నాయకుడు ఊహించుకుంటున్నారు. ఏఐఏడిఎంకె కు బలమైన అగ్రనాయకుడు లేకపోయినా, బలమైన క్యాడర్ ఉంది.
బీజేపీ ఆశీస్సులు
బిజెపి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. అర్ధబలం, అంగబలం ఉన్నాయి. శశికళ పార్టీలో చురుకుగా ఉండి ఉంటే, ఏఐఏడిఎంకె కూటమి ఇంకా మరింత బలంగా ఉండేది. ప్రస్తుతం ఈ కూటమికి ఎదురుగాలే వీస్తోంది. జయలలిత స్థానంలో అంతటి ఆకర్షణ కలిగిన నేత వేయి దివిటీలు వేసి వెతికినా కానరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి ఉండాల్సినంత బలంగా లేకపోయినా, దీన్ని ఢీ కొట్టేంత బలం కమల్ హసన్ కు లేదన్నది వాస్తవం. కమల్ కూటమిలో ఉన్న మూడు పార్టీలకు క్షేత్ర స్థాయిలో ఎటువంటి బలం లేదు. పార్టీల నిర్మాణం కూడా వ్యవస్థీకృతంగా లేదు. అధికార ఏఐఏడిఎంకె – బిజెపి కూటమి ఓట్లకు కమల్ కూటమి కొంత గండి కొట్టే అవకాశం మాత్రమే ఉంది. ఒక దశలో, స్టాలిన్ తో జత కడతానని కమల్ హాసన్ బహిరంగంగా ప్రకటించారు. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత, అవసరాన్ని బట్టి డిఎంకెకు కమల్ మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read : బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు
కామరాజ్ స్పూర్తితో శరత్ కుమార్
మరో నటుడు శరత్ కుమార్ 1996 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. కామరాజ్ నాడార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి, 2007లో ఏఐఎస్ఎంకె పార్టీ స్థాపించాడు. ఏఐఏడిఎంకె, డిఎంకె లతోనూ కలిసి సాగాడు. డిఎంకె తరపున ఒకసారి రాజ్యసభ సభ్యుడుగా పనిచేశాడు.ఇప్పుడు కమల్ తో జత కలిశాడు. ఇతని పార్టీ గతంలో 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. శరత్ కుమార్ పార్టీ ప్రభావం ఈసారి కూడా ఏ మాత్రం ఉండదనే పరిశీలకులు భావిస్తున్నారు.
పచ్చముత్తు పార్టీ
కమల్ కూటమిలో ఉన్న మూడవ పార్టీ ఐ జె కె (ఇండియా జననాయగ కచ్చి). దీని అధిపతి ఆర్. పచ్చముత్తు. సుప్రసిధ్ధ ఎస్ ఆర్ ఎం విద్యా సంస్థల అధినేత. అవినీతికి, సాంఘిక విద్రోహలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈయన ఈ పార్టీని స్థాపించారు. 2014,2016 ఎన్నికల్లో బిజెపి /ఎన్ డి ఏ కూటమితో జత కలిపి తన పార్టీ అభ్యర్థులను ఎన్నికల క్షేత్రంలో దింపారు. రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో డిఎంకె -యూపీఏ కూటమిలో చేరి బరిలో దిగిన ఈ పార్టీ బోణీ కూడా కొట్టలేక పోయింది. ఇప్పుడొచ్చి ఈ పార్టీ కమల్ కూటమిలో చేరింది. మొత్తం మీద మూడవ కూటమి అత్యంత బలహీనమైన కూటమిగా కనిపిస్తోంది. కాస్తో కూస్తో ఆకర్షణ కమల్ పార్టీకే ఉంది.
Also Read : 5 రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా
కమల్ బలం ఎంత?
మంచి నటుడుగా తమిళనాడులో మంచి పేరు తెచ్చుకొని, ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న కమల్ హాసన్ రాజకీయాల్లో ఏ మేరకు గెలుపుబాట పడతారో వేచి చూడాల్సిందే. ఈ మూడు కూటములకు తోడు మరో నటుడు విజయకాంత్ తన సత్తా చూపిస్తానంటున్నాడు. ఈ నటుడు డిఎండికె అనే పార్టీని స్థాపించి, కొన్నాళ్ళుగా రాజకీయాల్లో సందడి చేస్తున్నాడు. నిన్నటి వరకూ ఏఐఏడిఎంకె జట్టులో ఉన్న ఈయన సీట్ల దగ్గర పేచీ వచ్చి, కూటమి నుంచి బయటకు వచ్చాడు.
మిశ్రమ ఫలితాలు
విజయకాంత్ 2005లో పార్టీ స్థాపించినప్పటి నుంచీ మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతున్నాడు. 2006లో 234 స్థానాలకు పోటీ చేసి,8.4శాతం ఓటింగ్ షేర్ తో, ఒకే ఒక్క సీటు గెలుచుకున్నారు. 2011లో అనూహ్యంగా 29 సీట్లు సాధించి ప్రతిపక్ష నాయకుడుగా చక్రం తిప్పాడు. ఈ విజయ గర్వంతో విజయకాంత్ 2016లో మూడవ కూటమి ఏర్పరిచాడు. వామపక్షాలు, విసీకె, ఎండిఎంకె పార్టీలు ఇందులో భాగస్వామ్యం కలిశాయి. ఈ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడి పోయింది.
Also Read : అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం
మూడు పార్టీలకూ సీట్లు పూజ్యం
ఈ మూడు పార్టీలు కలిసి ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయాయి. ఈ ఎన్నికల సమయంలో ఏఐఏడిఎంకె – బిజెపి కూటమితో నడుద్దామని విజయకాంత్ అనుకున్నా, పొత్తు పొసగక బయటకు వచ్చేశాడు. ప్రస్తుతానికి డిఎంకె ద్వారాలు మూసుకొనే ఉన్నాయి. ఇతనికి ఎదురుగా మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ కూటమిలో చేరడం లేదా శశికళ మేనల్లుడు దినకరన్ స్థాపించిన ఏఎంఎంకెతో జత కలవడం లేదా సొంతంగా బరిలోకి దిగడం.
విజయ్ కాంత్ ఏమి చేస్తారు?
కమల్ హాసన్ కంటే ఎన్నో ఏళ్ళు ముందుగానే రాజకీయాల్లోకి వచ్చి,ఎంతో కొంత సాధించి, మూడవ కూటమి పెట్టి విఫలమైన విజయకాంత్ ఇప్పుడు ఏమి చేయబోతున్నాడనేది తమిళనాడు రాజకీయ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. గతంలో విజయకాంత్ సారథ్యంలో ఏర్పడిన మూడవ కూటమి ఎటువంటి ప్రభావాన్ని చూపించలేక పోయింది. ఇప్పుడు కమల్ సారథిగా ఉన్న కూటమి ఏమి చేయబోతోందో ఎన్నికల తెరపై త్వరలోనే కనిపిస్తుంది. మరో కూటమి ఏర్పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపటి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నా, తమిళనాట కుంపట్ల అంశం వేడి పుట్టిస్తోంది.
Also Read : తమిళనాట కాషాయం ఆట