- ఎంఎల్ సీ ఎన్నికల ప్రచారంలో అదే మాట
- కేవలం ఎంఎల్ సీగా ఉంటే ప్రతిభ వృధా
- ఆమె కోసం తప్పుకోవడానికి మంత్రులు సిద్ధం
కల్వకుంట్ల కవిత. ఈ పేరు తెలియనివారు ఎవరూ లేరు. గతంలో నిజామాబాద్ నియోజకవర్గంనుంచి పార్లమెంటుకు ఎన్నికైన కవిత గత పార్లమెంటు ఎన్నికలలో పరాజయం చవిచూశారు. అయినా తండ్రి కె.సి.ఆర్ లాగానే పట్టుదలకు మారుపేరైన కవిత కూడా ఓటమితో నిరాశ చెందలేదు. ప్రజలకు దూరం కాలేదు.
ఇటీవల జరిగిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థలనుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ప్రత్యర్థులకు డిపాజిట్లు కాడా దక్కలేదు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో గురువారంనాడు శ్రీమతి కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, సత్యవతీ రాధోడ్, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర రావు, పలువురు ఎమ్మెల్సీలు పెద్దమొత్తంలో అభిమానులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారాల పట్టి కవిత ప్రమాణ స్వీకారానికి ఇందరు ప్రముఖులు హాజరుకావడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
కానీ, ఇక్కడే పలువురు అభిమానులు కవిత కాబోయే మంత్రి అని కొనియాడటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా , ప్రచార సమయంలో పలువురు టి.ఆర్.ఎస్. నాయకులు భవిష్యత్తులో కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని, ఈ ప్రాంత అభివృద్ధికి ఆమె మరింతగా కృషిచేస్తారని ప్రకటనలు చేయడం ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
అంతేకాదు, పార్లమెంటు సభ్యురాలిగా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో అనర్గళంగా మాట్లాడి, మంచివక్తగా పేరుతెచ్చుకున్నకవిత ఇప్పుడు కేవలం ఎమెల్సీగా ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం ఎమీ లేదని, ఆమె శక్తి, యుక్తులను రాష్ట్రప్రయోజనాలకు వినియోగించుకోవడానికి వీలుగా ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పలువురు అభిమానులు కోరుతున్నారు.
కేవలం ముఖ్యమంత్రి తనయ గానే గాకుండా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి ప్రజలలో చైతన్యం కల్గించిన కవిత అన్నివిధాలా మంత్రివర్గంలో స్థానం పొందడానికి అర్హురాలని, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుభాషలలో అనర్గళంగా మాట్లాడగలగటంతో పాటు, పార్లమెంటు సభ్యురాలిగా గడించిన అనుభవం ఆమెకు ఉన్నాయని , ఏవిధంగా చూసినా ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం సమర్థనీయమని అంటున్నారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావించిన పక్షంలో , అవసరమైతే మంత్రివర్గం నుంచి తప్పుకొని ఆమెకు అవకాశం కల్పించడానికి ముందుకు వచ్చేవారు కూడా చాలామందే ఉంటారన్నది టి.ఆర్.ఎస్ వర్గాల అబిప్రాయం. మరి కవిత మంత్రివర్గంలో చేరతారా, లేదా అన్నది సమీప భవిష్యత్తులో తేలనుంది.