బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ధరావత్తు గల్లంతు
మొదటి రౌండ్ లోనే విజయం
ఒకటిన్నర సంవత్సరాల పదవీకాలం
(పులిపాటి రాంమోహన్)
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కుమార్తె కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లు ఉండగా కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థి వి. సుభాష్ రెడ్డి వరుసగా 56, 29 ఓట్లు మాత్రమే సంపాదించి ధరావత్తు కోల్పోయారు. కవితకు మొదటి రౌండ్ లోనే 531 ఓట్లు లభించాయి. మెజారిటీ మార్కు 413 కంటే 118 ఓట్లు అధికంగా వచ్చాయి.
లోగడ టీఆర్ ఎస్ టిక్కెట్టు పైన ఎన్నికైన డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేశారు. కవితకు ఎంఎల్ సీగా ఒకటిన్న సంవత్సరం పదవీకాలం ఉంటుంది. మంత్రి వి. ప్రశాంతరెడ్డి కవితను అభినందించారు. నిజానికి కవిత ఎన్నిక ప్రశాంతరెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది. కవితను మంత్రి చేస్తారని అంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఎల్ ఏ లు మంత్రిని లెక్కపెట్టడం లేదు. కవిత చుట్టూ తిరుగుతున్నారు. మున్ముందు పరిస్థితులు ఎట్లా మారతాయోనని పరిశీలకులు అనుకుంటున్నారు.