సామాజిక ప్రయోజనాలు అశించి కాళ్ళకూరు నారాయణరావు గారు రాసిన రెండు నాటకాలలో `చింతామణి` వివాదంలో పడింది. `పడింది` అనడం కంటే పడేశారు అనడం సబబేమో…! నాటక సమాజాలు, ప్రదర్శకుల(నటీనటులు) అత్యుత్సాహం, మితిమీరిన కల్పిత ద్వంద్వార్థ సంభాషణలు ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రేక్షకుల చప్పట్లను చూస్తున్నారు తప్ప సామాజికవర్గాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సాగే సంభాషణలతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటి పట్ల కినుక వహించిన ఆ సామాజికవర్గం నాటక ప్రదర్శనను నిషేధించాలని ఎన్నో ఏళ్లుగా ఒత్తిడి తెస్తోంది. కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ నాటక ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా, విభజిత ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇటీవల`నోట్` జారీ చేశారు. బాధిత సామాజికవర్గం మనోభావాలను కాపాడే ఈ నిర్ణయం సమర్థనీయమే అయినా `ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇంటికి నిప్పు పెట్టుకున్నట్లు’ గా ఉందని నాటకప్రియులు అంటున్నారు. తాజా పరిణామాలతో, ఈ నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించేవారు కూడా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. నాటకాన్నే నిషేధించడం కంటే, నిబంధనలు అతిక్రమించే ప్రదర్శకులకు జైలు, జరిమానా లాంటి హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేయాల్సిందని రంగస్థల కళాకారులే అభిప్రాయపడుతున్నారు. ద్వంద్వార్థ సంభాషణలు లేకుండా చూస్తామనే కోణంలో ప్రదర్శకుల నుంచి హామీ పొందవచ్చని సూచిస్తున్నారు.
Also Read : పరిశోధక ‘ప్రభాకరుడు’
సంస్కరణకే నాటకాలు
సమకాలీన సమస్యలు ఇతివృత్తంగా తీసుకొని గురజాడ అప్పారావు (కన్యాశుల్కం), కాళ్ళకూరి నారాయణరావు (వరవిక్రయం, చింతామణి) తదితరులు నాటకాలు రాశారు. వేశ్యావృత్తి వల్ల దెబ్బతిన్న కుటుంబాలు, దిగజారిన సామాజిక, మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, మార్పును కోరుతూ కాళ్ళకూరి ఈ నాటకం రాశారు. విచిత్రం ఏమిటంటే…గురజాడ నాటక `సమస్య` (కన్యాశుల్కం) తీరిపోయింది. అయినా ఆ నాటకం నిత్యనూతనం. వివాదరహితంగా అజేయంగా ప్రదర్శితమవుతోంది. కాళ్ళకూరి నాటక అంశాలు (వరవిక్రయం, వేశ్యావృత్తి) సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి.
Also Read : కథాభి`రాముడు`
`వరవిక్రయం` సినిమాగా, రేడియో నాటకంగానే ప్రసిద్ధం. ఇక`హరిశ్చంద్ర`, `శ్రీకృష్ణ రాయబారం` నాటకాల్లోని `కాటి’ దృశ్యం, పడక దృశ్యం లాంటివి అడపాదడపా ప్రదర్శితమవుతున్నా పూర్తి స్థాయిలో ఆడుతున్ననాటకం చింతామణి`మాత్రమే. శతవార్షికోత్సం జరుపుకున్న ఈ నాటకం సంభాషణలు, వ్యంగ్యోక్తుల పరంగా శ్రుతిమించిందన్నది కాదలేనిది. అందుకు రంగస్థల ప్రదర్శనలే కాదు యూట్యూబ్ చిత్రాలూ ఉదహరణలు. `చింతామణి`లా ఏ నాటకం సంభాషణలు `అప్ డేట్` కాలేదు. నాటకం ప్రదర్శించే ప్రదేశాలు, అప్పటి సామాజిక పరిస్థితులు, పరిణామాలపై మాటలు సందర్భానుగుణంగా సంభాషణల్లో చొచ్చుకు వస్తున్నాయి. నాటక రచనా లక్ష్యమే మసకబారినట్లయింది. కాళ్ళకూరి వారి అసలు మాటల కంటే నటీనటుల `కొసరు`మాటలు.,..ముఖ్యంగా చింతామణి తల్లి శ్రీహరి, సుబ్బిశెట్టి పాత్రల నడుమ సంభాషణలు జుగుప్సాకరంగా మారాయి. నాటకం పతాక సన్నివేశంలో చెప్పే హితోక్తుల కంటే అంతకు ముందు కల్పించిచెప్పే ఇలాంటి అసభ్యకర, ద్వంద్వార్ధ సంభాషణలే మెప్పుపొందుతున్నాయి. అదేమంటే `ప్రేక్షకుల ఆనందం కోసం అలా చెబుతున్నాం` అని ప్రదర్శకులు అంటే,` వారు చెబుతున్నారు కనుక ఆస్వాదిస్తున్నాం` అన్నది ప్రేక్షకుల ధోరణిగా ఉంది. అసలు ఏ నాటకంలో లేనివిధంగా ఇందులోనే `అదనపు మాటలు` ప్రవేశపెట్టవలసి రావవడానికి కారణాలు కచ్చితంగా తెలియదు. కథాపరంగా నాయిక కుటుంబం వేశ్యావృత్తి ప్రధానంగా కలిగి ఉండడం కారణం కావచ్చని విమర్శకులు అంటారు. ఏమైనా…. స్థానం, బుర్రాలాంటి ప్రముఖులు నటించిన ఈ నాటకాన్ని ప్రస్తుత కలుషిత సంభాషణలతో చాలా మంది పెద్ద నటులు నాటక ప్రదర్శనకు దూరమయ్యారు.
Also Read : ‘వట్టికోట’ మానవతకు పెట్టినకోట
ప్రదర్శనలలో రికార్డు
1920లో ఈ రాసిన ఈ నాటకాన్ని కాకినాడకు చెందిన సుజన రంజనీ ప్రచురణ సంస్థ 1923లో ప్రచురించింది. అప్పటికే 446 సార్లు ప్రదర్శితమమై రికార్డు సృష్టించింది. ఈ వందేళ్ళల్లో ప్రపంచంలో తెలుగువారు ఉన్న చోటల్లా ఎక్కడుంటే అక్కడ కొన్ని వేలసార్లు ప్రదర్శితమైంది. నాటకకర్త నారాయణరావు కుమారుడు సదాశివరావు దర్శకుడుగా పులిపాటి వెంకటేశ్వర్లు, దాసరి రామతిలకం ప్రధాన పాత్రలుగా చలనచిత్రంగా (1933) వచ్చింది. తిరిగి ఎన్టీ రామారావు, భానుమతి ప్రధాన పాత్రలుగాపి.ఎస్. రామకృష్ణరావు దర్శకత్వంలో (1956) వచ్చింది. రంగస్థలంపై జేజేలు అందుకున్న `చింతామణి` ‘వెండితెర`పై వెలవెలపోయింది.
Also Read : ఆదర్శ సభాపతి అనంత శయనం
నాటక పాత్రలు
ఈ నాటకంలో చింతామణి, భవానీ శంకరుడు, బిల్వమంగళుడి పాత్రలు సంస్కారవంతమైనవి. ప్రధానంగా చింతామణి సంస్కారం గల వేశ్య. విద్యావంతురాలు. తల్లి శ్రీహరి వేశ్యావృత్తి గురించి మాట్లాడి, ప్రోత్సహించినప్పుడల్లా అందుకు భిన్నంగా మాట్లాడుతుంది. చదువుకున్నవారంటే చింతామణికి అభిమానం. తనకున్న సందేహాల నివృత్తికి వచ్చానని బిల్వమంగళుడితో చెబుతుంది. ధనం కంటే ఆయన పాండిత్యానికే విలువనిస్తుంది. ఆయనతో పరిచయం తరువాత మరో విటుడిని చేరదీయలేదు. పాపభీతి కలిగింది. సర్వం కోల్పోయిన భవానీ శంకరాన్ని వెళ్లగొట్టాలన్న తల్లి మాటలకు `అది పాపం కాదా?` అని ప్రశ్నిస్తుంది. `వేశ్యకు మాత్రం నీతి ఉండదా?`అని `కన్యాశుల్కం`లో మధురవాణి అన్నట్లు, ఇక్కడ చింతామణి మానవత్వం చూపుతుంది. సుబ్బిశెట్టిని అప్పుల వాళ్లు బంధిస్తే బిల్వమంగళుడి సహకారంతో విడిపిస్తుంది. కలలో కృష్ణ సాత్కారం పొందిన ఆమె బిల్వమంగళుడికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
Also Read : తెలుగు గాంధీ ‘బులుసు’
వేశ్యావృత్తి నుంచి బయటపడి, గత అనుభవాలకు పశ్చాత్తం పడిన చింతామణి కృష్ణభక్తురాలిగా మారిపోతుంది. చింతామణి మోజులోపడి తండ్రిని, భార్యను నిర్లక్ష్యంచేసి సంపదతో పాటు తండ్రిని, భార్యను కోల్పోయిన బిల్వమంగళుడిలో పరివర్తన వస్తుంది. లీలాశుక యోగీంద్రుడిగా మారపోతాడు. వేశ్యాలోలత్వంతో కలిగే కష్టనష్టాల గురించి భవానీ శంకరుడు, సుబ్బిశెట్టి ప్రచారానికి నిర్ణయించుకుంటారు.
సంఘసంస్కరణ కోసం ఉద్దేశించిన నాటకం అశ్లీల సంభాషణలు, కించపరిచే వ్యాఖ్యల కారణంగా నిషేధిత జాబితాలో చేరనుండడం దురదృష్టకర పరిణామమే.