త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
వోలేటి దివాకర్
పవిత్ర గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత ఉజ్జయిని తరహా మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఉజ్జయిని లో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో ఏ విధంగా అయితే పూజ కార్యక్రమాలు జరుగుతయో అదే మాదిరిగా ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. 75 అడుగుల నాలుగు దిక్కుల రాజ గోపురాలు నిర్మాణం, 50 అడుగుల నాలుగు మహా మండపాలు, నలు వైపులా నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు మహా నందులు,109 అడుగుల గర్భాలయ గోపురం. ఆలయం చుట్టూ ప్రాకారం నందు 64 ఉప ఆలయాలు నిర్మించారు.
పాతికేళ్ల క్రితమే రాజమహేంద్రవరం లోని కైలాస భూమి శ్మశాన వాటికలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన పట్టపగలు వెంకట్రావు, తోట సుబ్బారావు ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదగా ఈ ఆలయం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఇప్పటికే ఆలయ విశిష్టత గురించి సీఎంతో ఆలయ నిర్వాహకులు చర్చించారు. మరోసారి ఆలయ ట్రస్టు సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్నారు.