(60 వ జయంత్యుత్సవ ప్రత్యేక వ్యాసం)
“చావులేని ఆశయాల ఆవాహనే సంస్మరణ” అంటాడు కలేకూరి కార్మికోద్యమకారుడు, పీడిత ప్రజల నేత కామ్రేడ్ శంకర్ గుహ నియోగి గురించిన నివాళి వ్యాసంలో. ఈ రోజు అలాంటి మహోన్నత ఆశయాల కొనసాగింపు కలేకూరి స్పూర్తి. సామాజిక కార్యకర్తగా, ఉద్యమశీలిగా, మేధావిగా, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, ప్రజా పాత్రికేయుడిగా అన్నింటికంటే ఉత్తమమైన మానవతావాదిగా కలేకూరి ప్రస్థానం బహుముఖ విస్తృతం. తెలుగు నేల మీద రాడికల్ సిద్ధాంతాల నుండి దళిత ఉద్యమాల వరకూ అన్ని స్రవంతులలోకి క్రియాశీలకంగా ప్రవహించిన ప్రజాతంత్ర గొంతుక కలేకూరిది. భారత జర్నలిజానికి అంబేద్కర్ని వైతాళికుడిగా ప్రకటించిన కలేకూరి ఒక్క దళితులకే కాదు, మొత్తం దేశానికే ఈ రోజు అంబేద్కర్ అవసరం అంటూ బల్లగుద్ది చెప్పాడు. బుద్ధుడు, కబీర్, ఫూలే, పెరియార్, నారాయణ గురు వంటి ప్రత్యామ్నాయ భారతీయ బహుజన తాత్విక యోధుల పై అద్భుతమైన విశ్లేషణాత్మక రచనలు చేశాడు. అంబేద్కర్నే ఆకట్టుకున్న మహత్తర గ్రంథం, స్వామి ధర్మతీర్థ రాసిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర మొదలుకొని అరుంధతీ రాయ్ , మహాశ్వేతాదేవి, బషీర్, ప్రిమో లెవీ వంటి మహామహుల అక్షరాల్ని అబ్బుర పరిచే రీతిలో తెలుగులోకి అనువదించాడు. “పాట జీవితమైనప్పుడు, పాట జీవన సంగ్రామమై నప్పుడు, పాట అణగారిన ప్రజల ఆశల ప్రతిఫలం అయినప్పుడు పాటకి ఎన్నటికీ మరణం లేదు” అన్న కలేకూరి అద్వితీయమైన పాటలెన్నో తెలుగు సమాజానికి అందించాడు. ఈ రోజు ప్రజానీకం నోళ్ళలో నానుతున్న అనేక గీతాలు ఆయనవేననే సంగతి తెలీయనంతగా ఆయన పాటలు ప్రజల్లో పెన వేసుకుపోయాయ్!
Also read: వీరోచిత ఉపదేశం – నేనూ, నా దేశం!
“అంబేద్కర్ చూపుడువేలు సూర్యుడినే చూపిస్తుంది, మేల్కొన్న తరాలు ఆ వెలుతుర్ని ఆస్వాదించండి.” అంటూ నవ తరాన్ని ఆహ్వానించిన కలేకూరి తెలుగు సమాజంలో అంబేద్కర్ని లోతుగా అధ్యయనం చేసి ఆయన్ని గుండెలనిండా ఆవాహన చేసుకున్న అరుదైన వ్యక్తి. అందుకే అంబేద్కర్ పుట్టినరోజుని ‘ఒక విప్లవం పుట్టినరోజు’ అంటూ పేర్కొన్న ప్రసాద్, ‘అంబేద్కర్ ను కోల్పోయిన ప్రపంచం శవం’ అయిందంటాడు. ‘ఎవరి ఉద్దేశాలు, లక్ష్యాలు ఏవయినా అంబేద్కర్ కలల్ని సాఫల్యం చేయడానికి నడుం కట్టడమే ఈ తరం కర్తవ్యం” కావాలంటాడు. అంతేకాదు, నవయాన సిద్ధాంతంలో కీలకాంశం కులనిర్మూలన అంటూ అంబేద్కర్ లేని ఆధునిక బౌద్ధం లేదంటాడు. “అంబేద్కర్ అభివృద్ధి చేసిన బౌద్ధం వెలుతురులో మళ్ళీ దేశంలో సమతా మమతలు పురుడు పోసుకోవాలి”అంటూ, “అందుకు మనమంతా మంత్ర సానులంకావాల”ని పిలుపిస్తాడు కలేకూరి. ఇంతకు మించిన స్పష్టత ఏ ఉద్యమ కారుడికీ ఉంటుంద నుకోను. దళిత బహుజన తాత్విక దృక్పథానికి సంబంధించిన చర్చలు అనేక పాశ్వాల్లో జరుగుతున్న సమయంలో కలేకూరి ఇచ్చిన హృదయాన్ని కదిలించే సమతా సందేశాన్ని ఒక సమున్నతమైన నిర్మాణ రూపంగా మల్చుకోవడమే మన ముందున్న పెద్ద సవాలు. దళిత సాహిత్య సదస్సు లో ప్రసంగిస్తూ దళిత రచయితలకు కలేకూరి చెప్పిన సూచనలు చాలా విశిష్టమైవి. మొత్తం ప్రజా ప్రత్యామ్నాయ రచయితలు అందరికీ ఈ రోజు వర్తించేవి. అందులో మొదటిది దళిత రచయిత శాశ్వత ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అధికార పీఠాలకూ, చివరకు దళిత నాయకత్వానికీ కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి అంటాడు. వాటిల్లో కలేకూరి ఉల్లేఖించిన అపురూ పమైన ఆశావహ దృక్పథం ఎంతటి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉంటుందంటే, “ఆలస్యం అయ్యింది కానీ ఇంకా గాడాంధ కారం అలముకోలేదు. దళిత ముద్రను కాలం మీద వేద్దాం.” అనే గొప్ప భరోసాతో ముగిస్తాడు!
Also read: మద్యమా? మానవ మనుగడా?
“విమర్శ విధ్వంసానికి కాదు, పరిరక్షించు కోడానికి. ఆత్మ విమర్శ ఆత్మ నిందకు కాదు, సరిచేసుకోడానికి.” అని నిర్ద్వందంగా చెప్పిన కలేకూరి ఉద్యమశక్తుల ఐక్య కార్యాచరణనే అంతిమంగా ఆశించాడు. ఒక దళిత కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం పై చలించిపోయి విలాస్ ఘోరే ఆత్మహత్యను గుర్తుచేస్తూ “దళిత ఉద్యమం పురుగులమందు తాగింది” అంటూ మండిపడ్డాడు. చీలికలు,పీలికలతో ఉద్యమాలకి పట్టిన గతిని అక్షరాలతో అడ్డంగా కడిగి పారేశాడు. దళిత బహుజన మేధావులు, కార్యకర్తలకి ఉద్యమ దిక్సూచిని ఆవిష్కరిస్తూ, “జాతి చెక్కిళ్ళ మీద నిలిచిన ఒక్క కన్నీటి బిందువు నుండి ఇంద్ర ధనస్సులను ఆవిష్కరించాలి” అంటాడు. ఐక్య వేదికల అవసరాన్ని ఇంత అందంగా చెప్పిన వారు తెలుగు సాహిత్యంలో మరొకరు లేరు. డిసెంబరు ఆరున అంబేద్కర్ మరణం, బాబ్రీ మసీదు కూల్చివేత రెంటినీ కలిపి “రెండు అస్తమయాలు ఒకటే గాయం” అన్న కలేకూరి దళిత బహుజన శక్తులు, ముస్లిం మైనారిటీల ఐక్యత అత్యంత అవసరం అని ఆకాంక్షించాడు. మతో న్మాదాన్ని ఓడించడానికి రాజకీయంగా కలవడం తప్పనిసరంటూ నినదించాడు. లెక్కలేనన్ని సమీక్షలు రాశాడు, అన్నే విమర్శలు చేసాడు. ఇవన్నీ ఒకెత్తయితే లక్నోలో జరిగిన పెరియార్ మేళా సమీక్ష మొదలుకొని పెడెల్ కాస్ట్రో వంటి మహా మహుల్ని కూడా ఆకట్టు కునేలా డర్భన్ లో జరిగిన సదస్సులో జాతి వివక్షపట్ల తన నిరసనని నినదించడం వరకూ అంతర్జాతీయ వేదికల పై కూడా ధిక్కారాన్ని తిరుగులేని స్పష్టతతో ప్రకటించడం మరొకెత్తు. అందుకే అమెరికా సామ్రాజ్యవాదం చేసిన సద్దాం హత్యను నిరసస్తూ, “కాలం వీరులకే సలాం చేస్తుంది” అంటాడు!
Also read: ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, చింతన
“నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని/ తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుడ్ని/ అవమానాలకూ, అత్యాచారాలకూ, మానభంగాలకూ, చిత్రహింసలకూ గురై పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాడ్ని..” అని ఘోషించిన కలేకూరి, “నేను బాధితుడ్ని కాదు అమరుడ్ని/ ఎగిరే ధిక్కార పతాకాన్ని” అని ఎలుగెత్తి ప్రంపంచానికి చాటిన మహాకవి. వర్తమాన సంక్షోభ కల్లోలంలో ఉద్యమ కార్యాచరణ పట్ల నిస్పృహ కలుగుతున్న వేళ, నిబద్దత కలిగిన కలేకూరి వంటి అసాధారణ ఆలోచనాపరుల కృషిని స్మరించుకోవడం అన్ని ప్రగతిశీల ప్రజాతంత్ర దళిత బహుజన ఆదివాసీ స్త్రీ మైనారిటీ ఉద్యమ స్రవంతుల బలోపేతానికి అత్యవసరం. అందులో భాగంగా విబేధాలను పక్కన పెట్టి రాబోయే కొత్త తరాలకు స్పూర్తిని ఇచ్చేలా ఉద్యమ స్రవంతులన్నీ ఎక్కడికక్కడ సమిష్టిగా సంఘటితమవడం ఈనాటి కర్తవ్యం. ఈ సందర్భంగా అలాంటి ఐక్య ఉద్యమ కార్యాచరణకు సమయం ఆసన్న మైందని గుర్తించి బ్రాహ్మణీయ మతోన్మాద తిరోగమన ఆధిపత్య కుతంత్ర శక్తులకు వ్యతిరేకంగా గొంతు విప్పేందుకు మన వంతుగా ముందడుగు వేయడమే కలేకూరి కి ఇచ్చే నిజమైన నివాళి కాగలదు!
Also read: సమానత్వమే సైన్సు ఉద్యమ లక్ష్యం!
(అక్టోబర్ 25 కలేకూరి ప్రసాద్ 60 వ జయంతి)
– గౌరవ్