నాగులపల్లి భాస్మరరావు
ముదునూరు – న్యూఢిల్లీ
కాకాని వెంకటరత్నంగారు చనిపోయి 50 సంవత్సరాలయింది.
అయినా ఆయన గురించి గుర్తుచేసుకునే వాళ్లు, ఆలోచించే వాళ్లు, ఆయన్ని గురించి వ్రాయాలనుకునే వాళ్లు ఎంతో మంది. నేను ఎన్నోసార్లు వ్రాశాను కూడా ఇంతకు ముందు. అయినా ఆయన గురించి ఇంకా వ్రాయాల్సి వుందనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా కాకాని నాయకత్వాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వాళ్లకి కాకాని జీవన శైలి, నాయకత్వం స్ఫూర్తి అయితే రాజకీయాల్లో మార్పునకు మార్గం అవ్వొచ్చు.
కాకాని పేరు మీదుగా ఏ ప్రభుత్వ పథకాలు, ప్రదేశాలు ఎప్పుడూ లేవు. అట్లాంటి వ్యక్తి ఆరాధన, అలవాట్లకి కూడా ఆయన ప్రోత్సహించలా. అసలు ఆయన తన రాజకీయ జీవితంలో పదవులకు అతీతంగా ప్రవర్తించటమే గాక, ప్రభుత్వంలో వున్న పార్టీ నాయకత్వానికీ వ్యతిరేకే. ప్రజా సమస్యల మీదే ఆయన దృష్టి. పదవులకి ఎగబడలా, పాకులాడలా. స్థానిక సమస్యలు, అభివృద్ధి మీదే ఆలోచన. అందుకు పదవుల్లో లేకుండానే ఎక్కువ మందికి సహాయపడవచ్చు అని నమ్మటమే కాక నిరూపించారు కూడా. ఇంతకన్నా గొప్ప ప్రత్యేకత ఏమి కావాలి గుర్తుపెట్టుకోవడానికి.
గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చి ఊళ్లో వున్న స్కూల్లో చదువుని కూడా పూర్తిచేయని వ్యక్తి స్వశక్తితో ఎన్నో వేల మంది చదువులకి కారణమవ్వడమే గాక, ఎన్నో గ్రామాల అభివృద్ధికి కారణం అయ్యాడు. ఇంకా ఎంతో మందికి స్ఫూర్తి, ఆదర్శం అయ్యాడంటే చెప్పుకోదగ్గ విషయం కాదా? ఎంతమంది నాయకులను అలా గుర్తు చేసుకోగలం ఇప్పుడు. ఆయన దూరదృష్టికి ప్రజల మీద వున్న విశ్వాసమే కారణం. 1949-52 మధ్య జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఆయన స్థాపించినన్ని పాఠశాలలు స్థాపించడం ఆయన ముందుగానీ, తర్వాతగానీ జరగలా! వాటిని ఉత్తమ విద్యాసంస్థలుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకి ఆయన ఇచ్చిన గౌరవం, ప్రాముఖ్యతే కారణం. విద్యని పార్టీ రాజకీయాలకతీతంగా 20 సంవత్సరాల పాటు జిల్లాలో వుందంటే అది కాకాని ఆదర్శమే.
‘‘నాకేం తెచ్చారు, నాకేమి ఇస్తారు’’ అనేది కాకుండా, ‘‘నేనేమి చేయగలను, నేనేమి చేయాలి’’ అనే దృష్టితో జీవితాంతం వుండటమే గాక, ఏమీ ఎవ్వరి వద్ద నుంచి ఆశించలా. ప్రతిఫలం చూసి అసలే కాదు ఏది చేసినా. అందుకనే ఆయన అంతమందికి సహాయపడ గలిగారు. పేదలకు అండదండలుగా వుండి వాళ్ల భవిష్యత్‌ని గూర్చి ఆలోచించటమే గాక ప్రత్యక్షంగా కృషి చేశాడు కులమతాలకి అతీతంగా. కాకానిని గురించి తెలిసినవాళ్లే కాదు, ఆయనను రెండు, మూడుసార్లు గమనించగానే తెలిసేది ఏమిటంటే, ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆయన వెంట వుండేది కనీసం నాల్గు వర్గాలకి చెందినవారు. ఆయన కారులో కూడా అంతే. అయితే, కాకానికి కారు ఎప్పుడూ లేదు, వాడలా. ఆయన 1954 ప్రాంతంలో ఆర్మీ వేలంపాటలో కొన్న ఇంజిన్‌కి బాడీ కట్టించి 7 నుంచి 9 మంది పట్టే వ్యాన్ కాకాని మార్క్. అదే జిల్లాలో గుర్తింపు కూడా. దాదాపు 20 సంవత్సరాలు పైగా అదే ఆయన వాహనం. అప్పలస్వామి అనే డ్రైవరే అన్ని సంవత్సరాలూ కూడా.
కాకాని వెంకటరత్నంగారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నది 30 సంవత్సరాల లోపే. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండుసార్లు ఓడిపోయాడు కూడా. అయితే గెలుపు ఓటములకు, నాయకత్వానికి సంబంధం లేదని చాటి చెప్పారు. అది ఇప్పుడు నమ్మలేని విషయం. గెలుపే ధ్యేయం. ఎట్లాగైనా గెలవాలనే ఆలోచన కాదు. ఆ భావనకి కూడా ఆయన వ్యతిరేకే. ఎన్నికల కోసం ఆయన డబ్బు పోగు చేయలా. నాకు తెలుసు ఎన్నిసార్లు ఆయన జేబుల్లో అర్జీ కాగితాలే గాని, డబ్బు ఉండేది కాదు. ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళ్లడానికి కూడా డబ్బులేని విషయం నాకు తెలుసు. విజయవాడ నుంచి హైదరాబాదుకి వెళ్లడం, రావడం కూడా ఆర్‌టీసీ బస్సుల్లోనే ఎక్కువగా, ఎమ్మెల్యేగా వున్నపుడు కూడా.
కాకాని గారితో నా పరిచయం రెండు దశాబ్దాలది. కనీసం పది సంవత్సరాలు దగ్గరగా వున్నా. నేను 1960లో మొట్టమొదట ఢిల్లీ వెళ్లింది కాకానిగారితోనే, రెండవ క్లాసు రైలులో. నన్ను ప్రభావితం చేసిన మహానుభావుడు. కొన్ని ఆదర్శాలకి కట్టుబడి వుండే విధంగా ప్రేరణ ప్రసాదించడమే గాక, సేవా దృక్పథం, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చాటిచెప్పిన నాయకుడు. ఎంతో మందికి ఆ విధంగా స్ఫూర్తిప్రదాత – ఆయనని కలవని వాళ్లకు కూడా. ఈ ప్రాంతం నుంచి చదివి ఇతర దేశాలకు 1960-70 మధ్యలో వెళ్లి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్లు, ఇంజినీర్ల పురోభివృద్ధికి కాకానే కారణం అంటే అతిశయోక్తికాదు. వాళ్లలో చాలా మంది ఈ రోజుకీ ఆ విషయం చెప్పుకుంటారు. గత 70 సంవత్సరాలలో విద్యాభివృద్ధికి రాష్ట్రంలో కృషి చేసిన వ్యక్తుల్లో కాకానిది ప్రత్యేక స్థానం.
కాకానిని రాజకీయాల్లో తొక్కేయాలని చాలా మంది ఆర్థికంగా మదించిన వాళ్లు, జమీందారులే కాక, అధికారంలో వున్న నాయకులూ ప్రయత్నించారు. వారు విఫలం కావడానికి ఉక్కు కాకాని అంటే ప్రజల్లో వున్న గౌరవం, ఆదరణే కారణం. ప్రజా సమస్యల విషయంలో కాకాని ఎప్పుడూ రాజీ పడలా. రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం, అందరికీ అవకాశం. ముఖ్యంగా బడుగువర్గాల వాళ్ల పిల్లల భవిష్యత్ విషయంలో ఆయన ఎంతకైనా సిద్ధమే. పోరాటాన్ని నమ్మిన నాయకుడు. అందుకే ఆయన అధికారంలో వున్నా పెద్ద నాయకులని తట్టుకుని తనకంటూ ప్రత్యేకతని నిలబడి మంచి పేరు తెచ్చుకోగలిగాడు. ప్రత్యర్థులను కించపరచటం, వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన పద్దితి కాదు. అసలు ఆయన టైము వృథా అవుతుందని తన పని చేసుకుపోవడంలోనే నిమగ్నమయ్యేవాడు. కావాలని కలహాల్లోకి వెళ్లలా, కుతంత్రాల్లోకి వెళ్లలా. నేను, నాది, మాది అని ఆలోచించలా. అందరినీ కలుపుకుపోవాలనే కృషి ఆయనది. అహంకారాన్ని ప్రదర్శించిన దాఖలాలు అసలే లేవు. మంచి చెడులను ఎన్నికల దృష్టితో బేరీజు వేసుకోలా.
విడిపోయి స్నేహితులుగా వుండిపోవడం, తెలంగాణా, ఆంధ్ర జిల్లాలకి మంచిదని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నమ్మాడు కాకాని. అదే ధోరణిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి యువకుల మీద గన్నవరం విమానాశ్రయంలో పోలీసు జులుం, కాల్పులు తట్టుకోలేక డిసెంబర్ 24-25 రాత్రి గుండె ఆగి మరణించిన మహానుభావుడు కాకాని. 1972లోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి వుంటే, ఈ రోజు ఆంధ్ర జిల్లాల పరిస్థితి ఎట్లా వుందేదో ఊహించవచ్చు. జపాన్‌కి తీసిపోని విధంగా అభివృద్ధి చెందేది. అదే కాకాని దూరద్భష్టి కూడా.
మరి ఆయన చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు. ప్రతి డిసెంబరు 25వ తారీఖున. అంటే ఆయన ఆదర్శాలు, దూరదృష్టి అంత గొప్పవి అని చెప్పకనే చెప్పవచ్చు. ఎన్నో ఉదాహరణలు. కొన్ని క్లుప్తంగా:
1)విలువలు లేని పార్టీ రాజకీయాలు అనర్థాలన్నిటికీ మూలం అనే విషయం. 2) ప్రజాసేవలో వున్న వాళ్లు కొన్ని నియమాలు పాటించాలి. 3) ఎన్నికల్లో గెలుపు ఓటములకు అతీతంగా ఆలోచించడం 4) వ్యక్తి ఆరాధన కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని నమ్మాడు. 5) స్థానిక సమస్యలు, సంస్థల మీద ధ్యాస ముఖ్యం 6) ఏ పదవిలో వున్నాం అనే దానికన్నా తర్వాత ఆ పదవిలోకి వచ్చే వాళ్లకి ఏ విలువలు తెలియజేశాం అనేది ముఖ్యం 7) ఆలోచనలు పది మందితో పంచుకుంటూ మంచిని పెంచుకోటంలోనే వుంది ప్రజాస్వామ్యం అని నమ్మటం 8) కేంద్రీకరణ కాదు, వికేంద్రీకరణే గ్రామాలకు శ్రీరామరక్ష అని పదే, పదే చెప్పాడు. 9) కులమతాలకి అతీతంగా ఆలోచించటమే గాక అందరితో కలిసి పనిచేయటం, అందరికి అవకాశాలు కలుగజేయడం 10) బడుగువర్గాలకు అండగా, వారి అణగచివేతకు వ్యతిరేకంగా ఉండడం 11) పిల్లలు, యువకుల భవిష్యత్‌ని గురించి ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం 12) వ్యాపార లావాదేవీలు పార్టీ రాజకీయాలతో ముడిపెట్టకూడదు. ఆయన పెట్టలా. 13) ప్రత్యర్థుల మీద వ్యక్తిగత దూషణలకి దూరంగా ఉంటే అందరికీ మంచిది అని నమ్మటం.
కాకాని రాజకీయ నాయకుడిగానే కాదు. రూపులో కూడా ఆజానుబాహుడే. అందమైన వర్చస్సుతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ అదే తేజస్సు. తెలుగుతేజం అంటే ఎట్లా ఉంటుందో ఆయనను చూసిన వారికి తెలుసు. తెల్లని పంచెకట్టు, కండువా, అంతా శుద్ధ ఖద్దరు మెరిసిపోతూ. అట్లాంటి నాయకుడిని రాజకీయాల్లో గత 50 సంవత్సరాల్లో చూశామా? అందుకే కాకాని వెంకటరత్నం 70 సంవత్సరాల కిందట చేసిన పనులు, వాటి ఫలితాలు కూడా ఆదర్శానికి ఉదాహరణ ఈ రోజుకీ. ఈ నాటి నాయకులకు కాకాని ఆదర్భవంతుడు, స్ఫూర్తిదాయకుడు. అందుకే ఈ 50వ వర్ధంతి, ఎన్నో గ్రామాల్లో… ప్రతి కిస్టమస్ రోజూ…కాకానికి స్మృత్యంజలి ఘటిస్తాం.
– డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు,
ప్రముఖ విశ్లేషకులు, ఢిల్లీ.
కాకాని వెంకటరత్నం జ్ఞాపకార్థం డిసెంబర్ 24న విజయవాడలో బందరులాకుల వద్ద స్వాతంత్ర్య సమర యోధుల భనవ ప్రాంగణంలోో రచయిత డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు ఏర్పాటు చేసిన ‘రాజకీయాలంటే..’అనే అంశంపైన సదస్సు సందర్భంగా. సదస్సు వివరాలు కింద చూడండి: