- కైకాల సత్యనారాయణ అస్తమయం
- నటన అంటే ప్రాణం పెట్టిన నవరస సార్వభౌముడు
తరాలను ప్రాతినిధ్యం వహించి, నిన్నటి వరకూ మన మధ్యనే సంచరించి, నవరసాలను పండించి, నవలోకానికి తరలిపోయిన నవరస ‘నట సార్వభౌముడు’ సత్యనారాయణను తలచుకుంటే ఎన్నెన్నో దృశ్యాలు తెలుగువాడి హృదయ సీమల్లో కదిలే బొమ్మలై కన్నీరు పెట్టిస్తాయి. ఈ విలక్షణ నటుడు గురించి మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలు చిరంజీవిగా నిలుస్తాయి. “సత్యనారాయణకు ఆ రెండూ ప్రాణం: నటన, రుచికరమైన భోజనం.’’ అవును! భోజనాన్ని ఆస్వాదించాలంటే కేవలం ఆకలి ఉంటే సరిపోదు, అనుభవించి పల్లవించే రసికత ఉండాలి. విభిన్నమైన పాత్రలను పోషించాలంటే ప్రతిభ, సాధనకు జతగా రసహృదయం ఉండాలి. ఆ రెండూ నిండుగా, మెండుగా వున్న నిండైనమనిషి కైకాల సత్యనారాయణ. దశాబ్దాల ప్రస్థానంలో, వందల సినిమాల్లో, అంతకు ముందు ఎన్నో నాటకాల్లో నటించి, 87 ఏళ్ళు నిండుజీవితాన్ని పండించుకున్న జాతకుడు కూడా. ఇటీవల కొన్నాళ్ల నుంచి కాస్త ఆరోగ్యం దెబ్బతిని వుండవచ్చు గాక, ఎనిమిది పదులకుపైగా చలాకీగానే జీవించారు.
భోజనప్రియత్వం,నటనాప్రియత్వంతో పాటు స్నేహప్రియత్వం కూడా వున్నవారు. నిన్నటి మహానటుడు ఎన్టీఆర్ , నేటి మెగాస్టార్ చిరంజీవి ఇద్దరి హృదయాలకు కూడా బాగా దగ్గరివాడు సత్యనారాయణ.
శారద అన్నగా ఎందరో చెల్లెళ్ళను సంపాదించుకున్నారు
ఇక అల్లు రామలింగయ్యతో వున్న అనుబంధం, శోభన్ బాబుతో వున్న స్నేహం కూడా గొప్పది. నటన, నటన పట్ల తపన ఆయనను అజేయుడిగా ఇన్నేళ్లు నిలిపాయి. ఎస్వీ రంగారావును గుర్తుచేసినా, లాంగ్ షాట్ లో, ప్రొఫైల్ లో ఎన్టీఆర్ లా కనిపించినా సత్యనారాయణకే చెల్లింది. ‘కళాతపస్వి’ కె విశ్వనాథ్ అన్నట్లు ‘శారద’ సినిమాలోని పాత్ర కొత్తగా చూపించింది. శారదకు సోదరుడుగా చూపించిన నటన నూత్న ఆవిష్కరణకు అంకురార్పణ. ఇలాంటి పాత్రల వల్ల ‘సత్తిగాడు’ సత్యనారాయణ అయిపోయాడు. కరుడు గట్టిన విలన్ గా చూడడానికి అలవాటైన ప్రేక్షకులకు ఇలాంటి అన్నయ్య మనకు ఒకడుంటే చాలనిపించింది, ముఖ్యంగా మహిళామణులకు! అట్లే అనేక పాత్రలతో సత్యనారాయణ అందరికీ దగ్గరయ్యాడు. అన్ని రకాల పాత్రలు ఆయనకు దగ్గరయ్యాయి. ఓల్డ్ బీఎ చదివిన శారదామూర్తి, నిజ జీవితంలో నటించడం పెద్దగా తెలియని ప్రేమమూర్తి. ఆ పాత్ర ఎట్టాగైనా తనకే రావాలని తహతహలాడి పొయ్యేవారు. డబ్బుల కంటే కూడా మంచి అవకాశాల కోసం అర్రులు జాచేవారు. అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించారని తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు. తర్వాత జీవితంలో ఎంతో పైకొచ్చిన చాలామంది పెద్దవారి వలె సినిమా కష్టాలన్నీ పడ్డారు. తొలినాళ్ళల్లో అవమానాలు, ఆకలి చూపులు, ఆశనిరాశల ఆటలు అన్నీ అనుభవించారు. మెల్లగా కాలం కలిసాచ్చింది. కలకాలం నిలబడి పోయే పాత్రలు వశమయ్యాయి. ప్రేక్షకులు పరవశమయ్యారు. అన్ని తరాలవారితో నటించారు, అన్ని తరాల ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ ఎంతగానో ప్రోత్సహించారు.ఆయన చలవ వల్ల సత్యనారాయణ ఎంపీ కూడా అయ్యారు.ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేసినా కైకాలకు విఠలాచారి దేవుడు.
యముడి పాత్రకు శాశ్వత చిరునామా
సత్యనారాయణ కలలు కని సాధించుకున్న పాత్రల్లో దుర్యోధనుడి పాత్ర ప్రధానమైంది. ఇక యముడి పాత్రకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ప్రసాద్ ప్రొడక్షన్స్ లో సహాయ కళాదర్శకుడిగా చేసిన అనుభవం కూడా ఉంది. నిర్మాతగా రమా ఫిలిమ్స్ పేరిట గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. సుదీర్ఘమైన సినిమా ప్రస్థానంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు వేశారు. పరిశ్రమలో నిలదొక్కుకోడానికి పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కాకపోతే, ఆ కష్టాన్ని తన గుండెల్లోనే దాచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అన్నట్లుగా హీరోలతో సమానమైన గ్లామర్ కైకాలకు ఉంది. గ్రామర్ కూడా వుంది. ఒడ్డుపొడుగు,
ఏ పాత్రకైనా ఒదిగిపోయే లక్షణం, మంచి గాత్రం వంటి ఎన్నో సులక్షణాలు ఆయన సొంతం. సత్యనారాయణకు బాగా ఇష్టమైన వాటిల్లో నిద్ర కూడా ఒకటి. “అరగుచున్నాడు శ్రీనాథుడమరపురికి” అన్నట్లుగా ‘నటనాథుడు’ కైకాల కళామతల్లి ఒడిలో శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు.