Wednesday, January 22, 2025

మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి

రామాయణమ్– 34

 ‘‘కైకా! నీవు చేసిన పని భరత శత్రుఘ్నులు సమర్ధిస్తారనుకొన్నావా?…భరతుడు దశరధుడికి పుట్టిన వాడే అయితే ఈ విషయంలో నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ వంశములో పుట్టిన భరతుడు నిన్ను అనుసరించడు. తండ్రి తనకు మనఃపూర్వకముగా ఇవ్వనిదానిని తాను స్వీకరించడు! అంతెందుకు? రాజ్యంలో అన్నలేకపోతే అన్న ఉన్నచోటే రాజ్యమని భరతశత్రుఘ్నులు రాముని వెంటే వెడతారు.

నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతిః

తద్వనం భవితా రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి!

‘‘రాముడు లేని చోటు అది రాజ్యమే కాదు! రాముడున్న వనమే రాజ్యం . తమ పిల్లపాపలతో జనులంతా రాముని వెంటే కదులుతారు! పాడుపడి, పిచ్చిమొక్కలుమొలిచి నిలిచి ఉన్న నిర్మానుష్యమైన రాజ్యం ,భరత శత్రుఘ్నులు లేక శోభావిహీనమైన అంతఃపురమూ మాత్రమే నీకు మిగులుతాయి.  కైకేయీ ఒక్కసారి బయటకు వచ్చి చూడు. పశుపక్ష్యాదులతో సహా అన్నీ తమ ముఖాన్ని రాముడున్న వైపే త్రిప్పి వున్నాయి. సీతమ్మకు నారచీరలెందుకు ఇచ్చావు? ఈమె నారచీరలు కట్టవలెనని లేదే’’ అని పలుకుతూ వసిష్ఠులవారు సీతమ్మను నారచీరకట్టుకోవద్దని వారించారు.

Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు

‘‘సీత విషయములో నీవు ఏ నిబంధన విధించలేదుకదా! రాముడి ఆత్మ సీత ఆమె ఇక్కడే ఉండి రాముడి సింహాసనం అధిష్ఠించగలదు.

అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనమ్….రాముడియొక్క ప్రస్తుతమైన సింహాసనం అధిష్ఠించగలదు !

సీతమ్మ తనకు అత్యంత ప్రియుడయిన తన భర్తను వదిలి ఉండటానికి ఇష్టపడలేదు. తానుగా తరలింది వనవాసానికి.

(ఇదీ భారతీయమ్! స్త్రీలకు పూర్వకాలంలో సింహాసనం మీద కూర్చుండి పాలించే అర్హత లేదు. స్త్రీలను అణగదొక్కారు అనే వారు దయచేసి ఇలాంటివి గమనించి మాట్లాడండి! భారతీయ సమాజంలోని నేటి పోకడలు కూడా తులనాత్మకంగా అధ్యయనం చేయ ప్రార్ధన..

లౌకిక దృష్టికి కైక చేస్తున్న పనులలో క్రూరత్వం కనిపిస్తున్నది. సామాన్యంగా ఆవిడను రాముడికి ఇన్ని కష్టాలు కలిగించినదానిగా భావించి తిట్టిపోస్తాము మనమంతా.

Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ

ఒక్క క్షణం ఆలోచిద్దాం !

ఆవిడ ముగ్గురికీ దుస్తులు సిద్దం చేసింది. ఆవిడ కోరిక మేరకు రాముడొక్కడే వెళ్లాలి. కానీ చిన్నప్పటినుండీ రాముడిని గారాబంగా పెంచినది ఆవిడే. ఆవిడకు తెలుసు రాముడి నీడ లక్ష్మణుడని. అన్నని వదిలి ఆయన ఒక్కక్షణం కూడా ఉండడని! సీతారాముల అన్యోన్య దాంపత్యం చూసిన ఆవిడకు అర్ధమయ్యింది రాముడి ఆత్మ సీతేనని సీతమ్మప్రాణం రాముడేనని! మరి మనిషిని అతని నీడ, ఆత్మ విడిచి ఉంటాయా? అసంభవమది.

ఇక పోతే లోకకంటకుడయిన రావణ వధ జరగాలంటే రాముడి ప్రయాణం మొదలుకావాలి. తండ్రినుండి విడదీయాలి. దశరథుడినుండి రాముడిని వేరు చేయగల సమర్ధులు ఎవరు? ఒకరు విశ్వామిత్రుడు! రెండు కైక! మొదట విశ్వామిత్రుడు తాత్కాలికంగా విడదీసి దివ్యాస్త్రజ్ఞానాన్ని ఇచ్చి రాముడిని రాబోయే సంగ్రామానికి సన్నద్ధుడిని చేశాడు. అది సరిపోతుందా? సరిపోదు! రాముడు బయటకు నడవాల్సిందే. ఇదిగో ఆ పని కైకమ్మచేసింది.  రాముడెవరో కైకకు తెలుసు. రాముడు నారాయణుడని రామనారాయణుడని! మరి ఈ కోణంలో ఆలోచిస్తే కైక అమృతమూర్తి)

Also read: అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు

..

ఆమె తండ్రి ఒక రాజర్షి. ఒక చక్రవర్తి.

ఆమె మామగారు ధర్మాత్ముడు. ఇంకొక చక్రవర్తి.

ఆమె భర్త జగదేకవీరుడు!

అంతఃపురములోని జనులకు తప్ప ఎవరికంటాబడకుండా ఇన్నాళ్ళూ వైభవంగా జీవించింది.

మరి నేడో? నారచీర కట్టటమే రాక భర్త సహాయంతో చుట్టుకొని పదుగురి ఎదుట నిలుచున్నది.

వనవాసము చేయ సంకల్పించుకున్నది.

ఎంతకష్టం? ఎంతకష్టం? ఎండకన్నెరుగని రాకుమారికి ఎంతకష్టం?

ఎవరికి అపకారంచేసిందని ఆవిడకీ శిక్ష?

చూసేవారి హృదయం ద్రవించిపోతున్నది.

ఇది తలుచుకొని కైకను తిట్టనివాడులేడు.

దశరథుడు హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. కైకను చూసి, “పాపాత్మురాలా రాముని అడవికి పంపి పాపములు మూటకట్టుకుంటున్నావు. అవి చాలలేదా నీకు. ఈ సీతను కూడా కష్టపెడుతున్నావు!  ఇన్ని పాపాలు అసలెందుకు చేస్తున్నావు?” అని అంటూ కడుదీనంగా విలపిస్తూ మూర్ఛపోతూ, మరల తేరుకుంటూ, మరలమరల కైకను తిడుతూ పిచ్చివానివలే ఉన్న తండ్రి సమీపంలోకి వచ్చి రాముడు.

Also read: రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం

‘‘తండ్రీ! నా తల్లి వృద్ధురాలైనది. నిన్నెప్పుడూ పల్లెత్తుమాటకూడ అని ఎరుగదు. సాధుస్వభావురాలు. నీచస్వభావమననేమో ఎరుగదు. అందరికీ వరాలిచ్చేవాడవు నా కొక్క వరాన్నీయవయ్యా! నన్నుచూసుకొని ఆవిడ బ్రతుకుతున్నది నేను దగ్గరలేకుంటే ఆవిడ మానసము శోకసముద్రమే. ఆవిడను కాస్త ఆదరంతో చూసుకో తండ్రీ.  నీ ఆదరమే ఆమె ప్రాణాలు నిలుపుతుంది’’ అని వినయంగా పలికిన రాముని చూసి అతికష్టం మీద గొంతుపెగుల్చుకుంటూ విపరీతమైన దుఃఖము మనస్సును, శరీరాన్ని ఆవహించగా అతికష్టం మీద “రామా” అని మాత్రం అనగలిగాడు దశరథుడు.

Also read: సీతారాముల సంభాషణ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

1 COMMENT

  1. I have been following this column and enjyoing. The narration is depicting the pictures of Ramayana and more effective. We expect more from you in future. Thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles